
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.2,431 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.2,210 కోట్లతో పోల్చితే 10 శాతం వృద్ధి సాధించామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. గత క్యూ1లో రూ.12,149 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 14 శాతం వృద్ధితో రూ.13,878 కోట్లకు పెరిగిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయకుమార్ చెప్పారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 6 శాతం పెరిగి 35.6 కోట్ల డాలర్లకు, ఆదాయం 9 శాతం వృద్ధితో 205 కోట్ల డాలర్లకు పెరిగిందని వివరించారు. ఈ క్యూ1లో నిర్వహణ మార్జిన్ 19.7 శాతంగా నమోదైందని, అంతకు ముందటి క్వార్టర్‌లో కూడా ఇదే స్థాయిలో ఉందని వివరించారు. కాగా ఈ కంపెనీ ఫలితాలు అంచనాలను అందుకున్నాయి. ఈ కంపెనీ రూ.2,319 కోట్ల నికర లాభం, రూ.13,936 కోట్ల ఆదాయం సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం 8%, ఆదాయం 5 శాతం చొప్పున పెరిగాయి.
వరుసగా 62వ క్వార్టర్‌లోనూ డివిడెండ్
ఒక్కో షేర్‌కు రూ. 2 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని విజయకుమార్ తెలిపారు. వరుసగా 62వ క్వార్టర్ లోనూ డివిడెండ్‌ను ఇస్తున్నామని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,000 కోట్ల మేర షేర్ల బైబ్యాక్ చేయనున్నామని, ఒక్కో షేర్‌ను రూ.1,100 ధరకు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 9.5–11.5% మేర వృద్ధి (స్థిర కరెన్సీ పరంగా) చెందగలదని అంచనాలున్నాయని వివరించారు.
అన్ని విభాగాల్లో మంచి వృద్ధి...
ఎన్నడూ లేనన్ని ఆర్డర్లను ఈ క్యూ1లో సాధించామని విజయకుమార్ చెప్పారు. వాణిజ్య సంస్థల డిజిటల్ భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పాటునందించే నెక్ట్స్ జనరేషన్ పోర్ట్‌ఫోలియో సేవల కోసం పెట్టుబడులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో మంచి వృద్ధి సాధించామని వివరించారు. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,24,121గా ఉందని, ఆట్రిషన్ రేటు 16.3 శాతంగా ఉందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 1.1 శాతం లాభంతో రూ.964 వద్ద ముగిసింది.
విప్రోను దాటేసిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్
ఆదాయం పరంగా భారత మూడో అతి పెద్ద ఐటీ కంపెనీగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అవతరించింది. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న విప్రోను తోసిరాజని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ స్థానంలోకి దూసుకు వచ్చింది. ఈ క్యూ1లో విప్రో ఆదాయం 202 కోట్ల డాలర్లుండగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆదాయం 205 కోట్ల డాలర్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment