
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్‌లో 13 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.2,605 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.2,944 కోట్లకు పెరిగిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.15,699 కోట్ల నుంచి 16 శాతం వృద్ధితో రూ.18,135 కోట్లకు పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయకుమార్ పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 17 శాతం వృద్ధితో 43 కోట్ల డాలర్లకు, ఆదాయం 16 శాతం వృద్ధితో 250 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ అంచనాలను సవరిస్తున్నామని విజయకుమార్ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 16.5–17 శాతం రేంజ్‌లో పెరగగలదని గతంలో అంచనా వేశామని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ అంచనాలను 15–17 శాతంగా సవరిస్తున్నామని వివరించారు. ఈ క్యూ3లో స్థూలంగా 11,502 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.49,173కు పెరిగిందని విజయకుమార్ చెప్పా రు. ఆట్రీషన్ రేటు (ఉద్యోగుల వలస) 16.8%గా ఉందని వివరించారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలతో బీఎస్‌ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ స్వల్పంగా లాభపడి రూ.599 వద్ద ముగిసింది.
పటిష్ట పనితీరు...
గత కొన్నేళ్లుగా మంచి పనితీరు సాధించడాన్ని కొనసాగిస్తున్నాం. ఈ క్వార్టర్‌లో 1,000 కోట్ల డాలర్ల ఆదాయ మైలురాయిని దాటేశాం. ఆదాయం 16 శాతం వృద్ధి సాధించగా, ఎబిట్ 20 శాతం మేర పెరిగింది. లాభదాయకత, వృద్ధి, ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాలు పటిష్టంగా ఉన్నాయనే విషయాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి.
–సి. విజయకుమార్, సీఈఓ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్
Comments
Please login to add a commentAdd a comment