హెచ్‌సీఎల్‌ టెక్‌బీ ప్రోగ్రామ్: ఇంటర్‌తోనే ఐటీ కొలువు | HCL TechBee Early Career Program: IT Jobs for Class 12 Students | Sakshi
Sakshi News home page

ఇంటర్‌తోనే ఐటీ కొలువు

Published Mon, Feb 15 2021 7:21 PM | Last Updated on Mon, Feb 15 2021 10:25 PM

HCL TechBee Early Career Program: IT Jobs for Class 12 Students - Sakshi

ఇంటర్‌ పూర్తయిందా.. వెంటనే ఐటీ కొలువులో చేరాలనుందా.. కానీ,  ఉన్నత విద్య కూడా కొనసాగించాలనుకుంటున్నారా ?! మీలాంటి విద్యార్థులకు సరితూగే కొలువుల కోర్సే.. హెచ్‌సీఎల్‌ అందిస్తున్న టెక్‌బీ ఎర్లీ కెరియర్‌ ప్రోగ్రామ్‌. ఇందులో చేరితే అనుభవంతోపాటు కొలువూ సొంతమవుతుంది. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పట్టా అందుకునే అవకాశం కూడా ఉంటుంది. తాజాగా టెక్‌బీ కోర్సులో ప్రవేశాలకు 
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. సదరు కోర్సు ప్రత్యేకత, దరఖాస్తుకు కావాల్సిన అర్హతలు, ఎంపిక ప్ర్రక్రియ తదితరాల గురించి పూర్తి సమాచారం..

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌.. గ్రాడ్యుయేట్లు, ఇంటర్‌ విద్యార్థులకు ఉపయో గపడేలా పలు ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. తాజాగా హెచ్‌సీఎల్‌ ఐటీ ఇంజనీర్‌ కోర్సుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. హెచ్‌సీఎల్‌ టెక్‌బీ.. ఇంటర్‌ పూర్తయిన వెంటనే ఫుల్‌టైమ్‌ జాబ్‌ చేయాలనుకొనే అభ్యర్థుల కోసం రూపకల్పన చేసిన ప్రోగ్రామ్‌. హెచ్‌సీఎల్‌లో ఎంట్రీ లెవల్‌ కొలువుల భర్తీకి అవసరమైన నైపుణ్యాలపై అభ్యర్థులకు 12 నెలల శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌లో ఫుల్‌ టైమ్‌ ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో ఉద్యోగం చేస్తూనే అభ్యర్థులు బిట్స్‌–పిలానీ, సస్త్ర యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. టెక్‌బీ ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.10000 స్టైపెండ్‌ చెల్లిస్తారు. అనంతరం పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమితులైన తర్వాత రూ.2లక్షల–2.20 లక్షల వార్షిక వేతనం అందుతుంది. 

అర్హత
► 2019, 2020లో ఇంటర్‌ పూర్తి చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. అలాగే 2021లో ఇంటర్‌ పూర్తి చేసుకోనున్న/ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. 
► అభ్యర్థి ఇంటర్‌లో మ్యాథమెటిక్స్‌ లేదా బిజినెస్‌ మ్యాథమెటిక్స్‌ను చదివుండాలి. 

ఫీజు
► ప్రోగ్రామ్‌ ఫీజు ట్యాక్స్‌లతో కలిపి రూ.2.20 లక్షల వరకు ఉంటుంది. 
► అభ్యర్థులకు బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తారు. 
► విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా ఆర్థిక ప్రోత్సాహం అందిస్తారు. 
► శిక్షణ సమయంలో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు∙పొందిన వారికి 100 శాతం ఫీజు మాఫీ చేస్తారు. అలాగే 85–90 శాతం మార్కులు పొందిన వారికి 50 శాతం ఫీజు మాఫీ చేస్తారు. 

శిక్షణ
► హెచ్‌సీఎల్‌ టెక్‌బీ ప్రోగ్రామ్‌.. అభ్యర్థులను హెచ్‌సీఎల్‌ ప్రాజెక్ట్స్‌పై పనిచేసేందుకు సన్నద్ధులను చేస్తుంది.
► ఫౌండేషన్‌ ట్రైనింగ్‌లో భాగంగా.. ప్రొఫెషనల్‌ ఐటీ ఉద్యోగిగా మారేందుకు అవసరమైన ఐటీ ఫండమెంటల్స్‌ను బోధిస్తారు. 
► అభ్యర్థులకు కంపెనీ లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ యాక్సెస్‌ లభిస్తుంది. ఇందులో కంపెనీ విధులకు సంబంధించిన చర్చలు, ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్లు, అసైన్‌మెంట్స్, కేస్‌ బేస్డ్‌ సబ్‌మిషన్స్‌ ఉంటాయి. 
అభ్యర్థులు టెక్నాలజీ సర్వీసెస్‌కు సంబంధించిన ఐటీ సర్టిఫికెట్‌ పొందవచ్చు. 

ఉద్యోగ వివరాలు
► శిక్షణను పూర్తి చేసకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌లో ఫుల్‌ టైమ్‌ ఉద్యోగిగా అవకాశం కల్పిస్తారు.
► ఆఫర్‌ అందుకున్నవారు దేశంలోని హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ల్లో అప్లికేషన్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ సపోర్ట్, డిజైన్‌ ఇంజనీర్‌ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
► హెచ్‌సీఎల్‌ హెల్త్‌కేర్‌ బెనిఫిట్స్, మెడికల్‌ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్, హెల్త్‌ చెకప్స్‌ తదితర సౌకర్యాలు ఉంటాయి. 
► బెనిఫిట్‌ బాక్స్‌ ప్రోగ్రామ్‌ కింద డిస్కౌంట్స్, ఇతర ఆఫర్స్‌ను అందుకోవచ్చు. 

ఉన్నత విద్య
► కెరీర్‌ రూపకల్పనలో విద్యది కీలకపాత్ర. దీన్ని గుర్తించిన హెచ్‌సీఎల్‌.. బిట్స్‌ పిలానీ, సస్త్రా యూనివర్సిటీ భాగస్వామ్యంతో టెక్‌బీ స్కాలర్స్‌కు ప్రత్యేక ఉన్నత విద్యా ప్రోగ్రామ్స్‌ను ఆఫర్‌చేస్తోంది. 

బిట్స్, పిలానీ
► బిట్స్‌ పిలానీ సహకారంతో ఎంప్లాయిబిలిటీ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ ప్రోగ్రామ్‌ను హెచ్‌సీఎల్‌ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కోర్సులకు సంబంధించిన తరగతులను హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌లలో నిర్వహిస్తారు. ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన ఫీజులో కొంత మొత్తాన్ని హెచ్‌సీఎల్‌ భరిస్తుంది. ఈ బీఎస్సీ ప్రోగ్రామ్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే... ఇదే ఇన్‌స్టిట్యూట్‌లో ఎమ్మెస్సీ/ఎంటెక్‌ కోర్సుల్లో చేరే వీలుంది. 

► హెచ్‌సీఎల్‌ టెక్‌ బీ అభ్యర్థులు తంజావూర్‌లోని సస్త్ర డీమ్డ్‌ యూనివర్సిటీలో మూడేళ్ల బీసీఏలో చేరొచ్చు. ఈ కోర్సు పూర్తయ్యాక బిట్స్‌ పిలానీలో ఎమ్మెస్సీ/ఎంటెక్‌లో ప్రవేశం పొందే వీలుంది. 
► పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.hcltechbee.com 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement