న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 11 శాతం బలపడి రూ. 3,983 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 3,599 కోట్లు ఆర్జించింది. అయితే త్రైమాసికవారీగా అంటే గతేడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో సాధించిన రూ. 4,096 కోట్లతో పోలిస్తే నికర లాభం 3 శాతం తగ్గింది.
కాగా.. ఈ క్యూ4లో మొత్తం ఆదాయం 18 శాతం ఎగసి రూ. 26,606 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 22,597 కోట్ల ఆదాయం నమోదైంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 10 శాతం మెరుగై రూ. 14,845 కోట్లను తాకింది. 2021–22లో రూ. 13,499 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. లక్ష కోట్లను దాటి రూ. 1,01,456 కోట్లకు చేరింది! అంతక్రితం ఏడాది రూ. 85,651 కోట్ల ఆదాయం అందుకుంది.
భారీ డీల్స్ అప్
క్యూ4లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 13 భారీ డీల్స్ గెలుచుకుంది. వీటి విలువ 207.4 కోట్ల డాలర్లుకాగా.. వార్షికంగా 18 శాతం క్షీణించింది. ఈ కాలంలో కంపెనీ 3,674 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,25,944కు చేరింది. ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 19.5 శాతంగా నమోదైంది. డీల్ పైప్‌లైన్ దాదాపు కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయికి చేరినట్లు కంపెనీ సీఈవో విజయ్‌కుమార్ పేర్కొన్నారు.
గైడెన్స్ గుడ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఆదాయం 6–8 శాతం వృద్ధి చెందగలదని హెచ్‌సీఎల్ టెక్ తాజాగా అంచనా(గైడెన్స్) వేసింది. వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున డివిడెండును ప్రకటించింది. వరుసగా 81వ త్రైమాసికంలోనూ డివిడెండును చెల్లిస్తున్నట్లు తెలియజేసింది.
ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు నామమాత్ర నష్టంతో రూ. 1,037 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment