హెచ్‌సీఎల్‌లో శివ్ నాడార్ ఫౌండేషన్ షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: శివ్ నాడార్ ఫౌండేషన్ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో తనకున్న మొత్తం వాటాను విక్రయించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో తనకున్న 0.79 శాతం వాటా(56 లక్షల షేర్ల)ను సోమవారం ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించడంతో రూ. 1,108.9 కోట్లు వచ్చినట్లు ఫౌండేషన్ తెలిపింది. ఒక్కో షేర్‌ను రూ.1,980.18 ధర చొప్పున విక్రయించినట్లు వివరించింది. ఈ వాటా విక్రయం ద్వారా వచ్చిన నిధులతో వివిధ సామాజిక సేవా కార్యకలాపాలు నిర్వహిస్తామని వివరించింది.
టెక్నాలజీ దిగ్గజం హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శివ్ నాడార్ ఈ ఫౌండేషన్‌ను 1994లో స్థాపించారు. విద్య, కళలకు తగిన తోడ్పాటు నందించే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు.హెచ్‌సీఎల్ కార్పొరేషన్, అనుబంధ సంస్థల ద్వారా ఈ వాటా షేర్లు విరాళాలుగా ఈ ఫౌండేషన్‌కు లభించాయి. కాగా ఎన్‌ఎస్‌ఈలో సోమవారం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 0.03 శాతం వృద్ధితో రూ.2,066 వద్ద ముగిసింది.