నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో యువతకు రోష్నీ | 'Roshni' for Naxalite-affected areas | Sakshi
Sakshi News home page

నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో యువతకు రోష్నీ

Published Thu, Jan 2 2014 1:24 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

'Roshni' for Naxalite-affected areas

 2013- జాతీయం
 
ప్రాణాధారమైన నీటి సంరక్షణకు భారత్ నడుంబిగించింది. జాతీయ జల విధాన కార్యాచరణలో భాగంగా 2013ను జల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించేందుకు మేలో కేంద్ర  కేబినెట్ పచ్చజెండా ఊపింది.
 
దేశ వ్యాప్తంగా నగదు బదిలీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 20 జిల్లాల్లో జనవరి 1న ప్రారంభించింది. తొలుత ఈ పథకాన్ని 51 జిల్లాల్లో ప్రారంభించాలని నిర్ణయించినా.. లబ్ధిదారులకు ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు లేకపోవడం వంటి కారణాలతో 20 జిల్లాలకే పరిమితం చేశారు.
 
స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 12న ప్రత్యేక తపాలా బిళ్ల (పోస్టల్ స్టాంప్)ను న్యూఢిల్లీలో విడుదల చేశారు.
 
కేరళలోని కోచిలో 11వ ప్రవాసీ భారతీయ దివస్‌ను జనవరి 7 నుంచి 9 వరకు మూడు రోజులపాటు నిర్వహించారు. ఇదే వేదికపై ‘గదర్ ఉద్యమం’ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జనవరి 8న ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మారిషస్ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పుర్యాగ్‌కు భారత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డును బహూకరించారు. ‘ఎంగేజింగ్ డయాస్పొరా-ది ఇండియన్ గ్రోత్ స్టోరీ’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది.
 
కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ జనవరి 19న పార్టీ ఉపాధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. రాహుల్‌కు పార్టీలో నెం.2 స్థానాన్ని కట్టబెడుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయం తీసుకుంది.
 
కేంద్ర ప్రభుత్వం మేఘాలయ, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో కొత్తగా మూడు హైకోర్టులను ఏర్పాటు చేసింది. త్రిపుర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి నలుగురు న్యాయమూర్తులు.. మేఘాలయ, మణిపూర్ హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తితో కలిపి ముగ్గురు న్యాయమూర్తులు ఉంటారు. ఈ మూడు కొత్త హైకోర్టులతో కలిపి దేశంలో హైకోర్టుల సంఖ్య 21 నుంచి 24కు పెరిగింది.
 
దేశంలో 2002-09 మధ్య పాఠశాలల సంఖ్య 27 శాతం పెరిగినట్లు 8వ ఆలిండియా ఎడ్యుకేషన్ సర్వే (ఏఐఈఎస్‌టీ) పేర్కొంది. అదే సమయంలో ఉపాధ్యాయుల సంఖ్య కూడా 30 శాతానికిపైగా పెరిగినట్లు తెలిపింది. ఈ సర్వేను జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) జనవరి 22న విడుదల చేసింది.
 
బాలల ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన ‘రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య పథకాన్ని’ యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఫిబ్రవరి 6న మహారాష్ట్రలోని ఫాల్ఘార్‌లో ప్రారంభించారు. ఈ పథకం కింద జననానికి ముందే వైకల్యానికి కారణమయ్యే వ్యాధులు, లోపాలు, ఇతర సమస్యలను గుర్తించడానికి చర్యలు తీసుకుంటారు.
 
దేశంలో మొదటి జియో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని బలరామ్‌పూర్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ), ఛత్తీస్‌గఢ్ పునర్వినియోగ ఇంధన అభివృద్ధి సంస్థల మధ్య ఫిబ్రవరి 16న ఒప్పందం కుదిరింది.
 
లోక్‌సభ, శాసనసభ, శాసనమండలి ఎన్నికలకు పోటీ చేసిన 2,171 మందిని ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 15న అనర్హులుగా ప్రకటించింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 30 రోజులలోపు ఎన్నికల వ్యయం లెక్కలను సమర్పించకపోవడంతో వారిని అనర్హులుగా గుర్తించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 కింద అనర్హత వేటు పడినవారు మరో మూడేళ్లపాటు ఎన్నికల కమిషన్ నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేదు.
 
కావేరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ తుది తీర్పును కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న నోటిఫై చేసింది. దీని ప్రకారం కర్ణాటక విధిగా తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. జస్టిస్ ఎన్.పి. సింగ్ చైర్మన్‌గా, ఎన్.ఎన్.రావు, సుధీర్ నారాయణ్‌లు సభ్యులుగా ఉన్న ట్రిబ్యునల్ 2007 ఫిబ్రవరిలో కావేరీ జలాల పంపిణీపై ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది.
 
సముద్ర జలాలను తాగు నీరుగా మార్చేందుకు ఉద్దేశించిన నిర్లవణీకరణ ప్రాజెక్ట్‌ను తమిళనాడు కాంచీపురం జిల్లాలోని నెమిలి వద్ద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఫిబ్రవరి 22న ప్రారంభించారు. దీన్ని రూ. 871 కోట్లతో 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నిత్యం 265 మిలియన్ లీటర్ల సముద్ర నీటిని 100 మిలియన్ లీటర్ల తాగు నీరుగా మార్చుతారు. దీనివల్ల చెన్నైలోని వేలాచ్చారి, పళ్లిపట్టు, తిరువాన్మయూరులలో నివసిస్తున్న సుమారు 15 లక్షల మందికి మంచి నీరు అందనుంది.
 
 త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ఫిబ్రవరి 28న వెల్లడించింది. త్రిపుర: అధికార లెఫ్ట్‌ఫ్రంట్ విజయం సాధించి వరుసగా ఐదోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 60 సీట్లకు గాను 50 స్థానాల్లో లెఫ్ట్‌ఫ్రంట్ (సీపీఎం-49 స్థానాలు, సీపీఐ-1 స్థానం) గెలిచింది. నాగాలాండ్: నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 59 అసెంబ్లీ స్థానాలకు గాను 37 సీట్లలో గెలుపొందింది. మేఘాలయ: మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను 29 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 8 స్థానాల్లో యునెటైడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) గెలిచింది.
 
ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందంపై భారత్-భూటాన్‌లు న్యూఢిల్లీలో మార్చి 4న సంతకాలు చేశాయి. ఆర్థిక మంత్రి చిదంబరం, భూటాన్ ఆర్థిక మంత్రి లింపో వాండే నోర్బూలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆదాయపు పన్ను ఎగవేతను, ద్వంద్వ పన్నులను ఈ ఒప్పందం నివారిస్తుంది.
 
అత్యాచార నిరోధక బిల్లుకు మార్చి 19న లోక్‌సభ ఆమోదం తెలిపింది. ‘క్రిమినల్ చట్టాల సవరణ బిల్లు -2013’ పేరుతో ఈ బిల్లును తీసుకువచ్చారు. ఈ బిల్లు ప్రకారం అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడితే దోషికి కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష, అవసరమైతే చనిపోయేంత వరకు జైలుశిక్ష విధిస్తారు. రెండోసారి అదే నేరానికి పాల్పడితే మరణశిక్ష విధిస్తారు. పరస్పర ఆమోదంతో శృంగారానికి వయోపరిమితిని 18 ఏళ్లుగా నిర్ణయించారు.
 
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్వర్ణోత్సవాలు ఏప్రిల్ 6న న్యూఢిల్లీలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి ప్రణబ్.. సుపరిపాలన లేకపోవడం సమాజంలో రుగ్మతలకు కారణమని, అవినీతి.. ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు.
 
దేశంలో అనేక ప్రాంతాల్లో 19.57 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 4.87 లక్షల హెక్టార్లు, అస్సాంలో 3.30 లక్షల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో 2.57 లక్షల హెక్టార్ల భూమి ఆక్రమణకు గురైంది.
 
2013ను జల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించేందుకు కేంద్ర కేబినెట్ మే 9న ఆమోదం తెలిపింది. గతేడాది డిసెంబర్‌లో ఆమోదించిన జాతీయ జలవిధాన కార్యాచరణలో భాగంగా జల సంరక్షణ సంవత్సరానికి పచ్చజెండా ఊపింది.
 
చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్ భారత్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య మే 20న ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో ైైైద్వైపాక్షిక వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలు, జలవనరుల రంగంలో సహకారం, మాంసం, మత్స్య ఉత్పత్తుల వాణిజ్యంలో పరస్పర సహకారం, మురుగునీటి నిర్వహణలో సహకారం వంటివి ఉన్నాయి.
 
 45వ భారత కార్మిక సదస్సు ఢిల్లీలో మే 17న జరిగింది. ఈ సదస్సును ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. 2004 నుంచి 2010 వరకు ప్రభుత్వం 20 మిలియన్ల అదనపు ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఇదే కాలంలో నిరుద్యోగిత రేటు 8.3 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గిందన్నారు.
 
 క్రీమీలేయర్ (సంపన్న శ్రేణి) వార్షిక ఆదాయ పరిమితిని రూ.4.5 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచాలని కేంద్ర కేబినెట్ మే 16న నిర్ణయించింది. ఓబీసీ కోటా కింద రిజర్వేషన్లు పొందేవారికి ఇది వర్తిస్తుంది. నాలుగేళ్లకోసారి క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని సవరిస్తారు.
 
 హర్యానాలోని గుర్గావ్‌లో బినోలా వద్ద ఏర్పాటు చేస్తున్న తొలి జాతీయ రక్షణ విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మే 23న శంకుస్థాపన చేశారు. ఐఐటీ, ఐఐఎం స్థాయిలో ఇండియన్ నేషనల్ డిఫెన్స్ వర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం 2018 నాటికి పనిచేయడం ఆరంభిస్తుంది.
 
మలయాళం భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్ మే 23న నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 3.33 కోట్ల మంది మలయాళం మాట్లాడేవారున్నారు. దక్షిణ భారతదేశంలో ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన నాలుగో భాష మలయాళం.
 ఇప్పటికే తమిళం, కన్నడం, తెలుగు భాషలకు ఈ హోదా దక్కింది.
 
భారత్‌లోని నికోబార్ దీవులను యునెస్కో వరల్డ్ బయోస్పియర్ రిజర్వ్‌గా మే 30న ప్రకటించింది. స్థానిక సమాజ చర్యలాధారంగా సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమంలో (మాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్) భాగంగా యునెస్కో, నికోబార్ దీవులను గుర్తించింది. ప్రకృతి, మానవ కార్యకలాపాలను నిర్వహించే కొత్త విధానాలను ఈ ప్రాంతంలో పరీక్షిస్తారు. నికోబార్ దీవులు 1800 జంతు జాలాలకు, అంతరిస్తున్న గిరిజన తెగలకు ఆవాసంగా ఉన్నాయి.
 
భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ థాయ్‌లాండ్ పర్యటనలో మే 30న ఇరుదేశాలు నేరస్తుల అప్పగింత ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఉగ్రవాద, ఆర్థిక, ఇతర అంతర్జాతీయ నేరాలతో సంబంధమున్న నేరస్థు ల అప్పగింతకు ఈ ఒప్పందం చట్టబద్ధత కల్పిస్తుంది.
 
రాజకీయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) జూన్ 3న కీలక తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలు కూడా ప్రజా సంస్థలేనని, సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద అవి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. ఆరు జాతీయ పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీలు కేంద్ర ప్రభుత్వం నుంచి పరోక్షంగా పెద్ద ఎత్తున నిధులు పొందుతున్నాయని తెలిపింది. ప్రజా సంబంధిత కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున.. ఆర్టీఐ చట్టంలోని ప్రజా సంస్థల లక్షణం పార్టీలకున్నట్లేనని చెప్పింది.
 
దేశంలోని నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లోని యువత కోసం రోష్నీ పేరిట కొత్తగా నైపుణ్య అభివృద్ధి పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ జూన్ 7న ఢిల్లీలో ప్రారంభించారు. దేశంలోని అత్యంత సమస్యాత్మకమైన 24 నక్సల్స్ ప్రభావిత  జిల్లాల్లో ఈ పథకాన్ని అమలుచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విశాఖపట్నం జిల్లా ఇందుకు ఎంపికైంది. యువతలో నైపుణ్యాన్ని పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించడమే రోష్నీ పథకం లక్ష్యమని మంత్రి చెప్పారు.
 
భారత్‌లో సింగపూర్ సైన్యం శిక్షణ, విన్యాసాల సౌకర్యాలు ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై భారత్- సింగపూర్‌లు జూన్ 4న సంతకాలు చేశాయి. భారత రక్షణ మంత్రి ఏకే ఆంటోని సింగపూర్ పర్యటనలో ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పటికే ఇటువంటి ఒప్పందాలు ఇరుదేశాల మధ్య 2007, 2008లో కుదిరాయి. ప్రస్తుత ఒప్పందం ప్రకారం సింగపూర్ సైనిక శిక్షణ కార్యక్రమాలు ఐదేళ్లపాటు సాగుతాయి.
 
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రుల సమావేశం జూన్ 5న న్యూఢిల్లీలో జరిగింది. నక్సల్ సమస్య  ప్రధానంగా చర్చకు వచ్చింది.
 
 భారత విదేశాంగశాఖ కార్యదర్శిగా సుజాతా సింగ్ జూలై 31న బాధ్యతలు చేపట్టారు. చోకిలా అయ్యర్, నిరుపమారావు తర్వాత ఈ పదవిని చేపట్టిన మూడో మహిళ సుజాతాసింగ్.


 జాతీయ ఆహార భద్రత ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 5న ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ జూలై 3న ఆమోదించింది.
 
భారత సైన్యంలో అత్యంత వుుఖ్యమైన వ్యక్తిగత కార్యదర్శి హోదా పొందిన తొలి వుహిళగా లెఫ్టినెంట్ గనీవ్ లాల్జీ చరిత్ర సృష్టించారు.
 
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలును పర్యవేక్షించే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల (డీఆర్‌డీఏ)ను రద్దు చేస్తున్నట్టు కేంద్రం జూలై 9న ప్రకటించింది.
 
 దేశంలో టెలిగ్రామ్ సేవలను జూలై 14 నుంచి పూర్తిగా రద్దు చేశారు. 1854 నుంచి టెలిగ్రామ్ సేవలు సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
 
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ (జేఎంఎం) జూలై 13న ప్రమాణ స్వీకారం చేశారు.
 
 సుప్రీంకోర్టు 40వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి.సదాశివం జూలై 19న ప్రమాణ స్వీకారం చేశారు.
 
 జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నూతన చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి శరద్ కుమార్ నియమితులయ్యారు.
 
 2012 కంపెనీల బిల్లుకు రాజ్యసభ ఆగస్టు 8న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు గత డిసెంబర్‌లో లోక్‌సభ ఆమోదం పొందింది. 1956 కంపెనీల చట్టం స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. కార్పొరేట్ గవర్నెన్‌‌స, పెట్టుబడిదారుల భద్రత, కార్పొరేట్ సామాజిక బాధ్యత మోసాలను అరికట్టడం వంటి ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లును తీసుకొచ్చారు.
 
 ఆహార భద్రత పథకాన్ని ఢిల్లీలో ఆగస్టు 20న సోనియా గాంధీ ప్రారంభించారు. ఢిల్లీతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని ప్రారంభించాయి.
 
 భూసేకరణ బిల్లు-2012కు లోక్‌సభ ఆగస్టు 29న ఆమోదం తెలిపింది. 1894 చట్టం స్థానంలో కొత్త బిల్లును తెచ్చారు.
 
 ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానంపై తన ప్రత్యేక దూతగా మాజీ రాయబారి రాకేశ్ సూద్‌ను సెప్టెంబర్ 1న నియమించారు.
 
 పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) బిల్లు-2011ను లోక్‌సభ సెప్టెంబర్ 4న ఆమోదించింది. వృద్ధాప్య ఆదాయ భద్రతను ప్రోత్సహించే అథారిటీ ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
 
 లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ భారత్ పర్యటనలో సెప్టెంబర్ 11న నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
 
 ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆగ్నేయాసియా ప్రాంతీయ సంస్థ (ఎస్‌ఈఏఆర్‌ఓ) రీజనల్ డెరైక్టర్‌గా భారత ప్రతినిధి డా.పూనమ్ ఖేత్రపాల్ సింగ్ సెప్టెంబర్ 12న ఎన్నికయ్యారు.
 జాతీయ సమగ్రతా మండలి (ఎన్‌ఐసీ) సెప్టెంబర్ 23న న్యూఢిల్లీలో సమావేశమైంది.
 
 ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే తిరస్కరించే హక్కును కల్పిస్తూ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 27న తీర్పునిచ్చింది. దీంతో పోటీచేస్తున్న అభ్యర్థిని వ్యతిరేకించడం గాని లేదా అందరిని తిరస్కరించే హక్కు ఓటరుకు ఉంటుంది. ఇందుకోసం బ్యాలెట్ పత్రాలు, ఓటింగ్ యంత్రాల్లో ‘పై వారెవరూ కాదు’ (నన్ ఆఫ్ ది అబౌ) అనే బటన్ ఉండాలని కోర్టు పేర్కొంది. ఓటర్లకు తిరస్కరించే హక్కు ఉండాలంటూ ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు పై తీర్పునిచ్చింది.
 
 భారత సుప్రీంకోర్టుకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక పిన్‌కోడ్ - 110201ను సెప్టెంబర్ 26న ప్రవేశపెట్టింది.
 
 వివిధ కేసుల్లో దోషులుగా నిర్ధారితులైన ఎంపీలు, ఎంఎల్‌ఏలు తక్షణమే అనర్హులు కాకుండా రక్షణ కల్పిస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను కేంద్ర కేబినెట్ అక్టోబర్ 2న ఉపసంహరించుకుంది. ఈ ఆర్డినెన్స్‌కు సెప్టెంబర్ 24న కేంద్రం ఆమోదం తెలిపింది.
 
 హైదరాబాద్ సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ అక్టోబర్ 3న ఆమోదం తెలిపింది.
 
 ఉన్నత విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షాభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్టోబర్ 3న ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
 
 భారత్‌లో పాకిస్థాన్ కొత్త రాయబారిగా సయ్యద్ ఇబ్నే అబ్బాస్ నియమితులయ్యారు.
 
 క్రిమినల్ కేసుల్లో రెండేళ్లకుపైన శిక్ష పడిన ప్రజాప్రతినిధులు (ఎంపీ, ఎంఎల్‌ఏలు) వెంటనే తమ సభ్యత్వం కోల్పోతారని జూలై 10న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
 
 తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. తిరునల్వేలి జిల్లాలోని ఈ కేంద్రం యూనిట్-1 నుంచి విద్యుత్‌ను అక్టోబర్ 22న దక్షిణాది గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.
 
 భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) సొంత 3జీ సేవలను అక్టోబర్ 25న ప్రారంభించింది. దీంతో ఐఏఎఫ్ సిబ్బందికి దేశమంతా కమ్యూనికేషన్ సేవలు వేగంగా, సకాలంలో అందేందుకు అవకాశం ఏర్పడుతుంది.
 
 భాక్రానంగల్ డ్యామ్‌ను నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 22న హర్యానాలోని నంగల్‌లో స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు.
 
 గుజరాత్‌లోని నర్మదా డ్యామ్ సమీపంలో భారత మొదటి ఉప ప్రధాని, ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహ నిర్మాణానికి ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 31న శంకుస్థాపన చేశారు. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తై స్మృతి చిహ్నం కానుంది. స్టాట్యూ ఆఫ్ యూనిటీగా పేరు పెట్టిన ఈ విగ్రహం ఎత్తు 182 మీటర్లు (597 అడుగులు). చైనాలోని హెనాన్‌లో గల ‘స్ప్రింగ్ టెంపుల్ ఆఫ్ బుద్ధ’ 128 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలో ఎత్తై విగ్రహంగా గుర్తింపు పొందుతోంది.
 
 60,000 చ.కి.మీ. పరిధిలో విస్తరించిన పశ్చిమ కనుమల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిపేయాలని కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నవంబర్ 14న కోరింది. ఇందులో భాగంగా మైనింగ్, క్వారీయింగ్, విద్యుత్ కేంద్రాల ఏర్పాటు వంటివాటిని నిషేధించింది.
 
 బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ భారత్ పర్యటనలో నవంబర్ 14న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు.
 
 బీహార్‌లోని తూర్పుచంపారన్ జిల్లాలోని కేషరియా వద్ద నిర్మించనున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఆలయానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ నవంబర్ 13న శంకుస్థాపన చేశారు. 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ విరాట్ రామాయణ్ మందిరాన్ని నిర్మిస్తున్నారు.
 
 క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండ్కూలర్ యునిసెఫ్ పారిశుద్ధ్య కార్యక్రమం ప్రాంతీయ ప్రచార కార్యకర్తగా నవంబర్ 21న నియమితులయ్యారు.
 
 సహజీవనం నేరం కాదని సుప్రీంకోర్టు నవంబర్ 28న తీర్పులో పేర్కొంది. సహజీవనం చేస్తున్న మహిళలకు, వారికి పుట్టే పిల్లలకు భద్రత, రక్షణకు చట్టాన్ని రూపొందించాలని పార్లమెంటును కోరింది.
 
 అవినీతి సూచీలో భారత్‌కు 94వ స్థానం దక్కింది. గతేడాది కూడా భారత్ ఇదే స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అవినీతి దేశాల జాబితాలో సోమాలియా అత్యంత అవినీతి దేశంగా మొదటి స్థానంలో ఉంది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ 177 దేశాల జాబితాను డిసెంబర్ 3న విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత తక్కువ అవినీతి దేశాలుగా డెన్మార్క్, న్యూజిలాండ్ ఉన్నాయి.
 
స్వలింగ సంపర్కం నేరం కాదన్న 2009 నాటి ఢిల్లీ కోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. స్వలింగ సంపర్కం శిక్షించదగ్గ నేరమన్న భారతీయ శిక్షాస్మతిలోని సెక్షన్ 377ను కోర్టు సమర్థించింది.  ఈ సెక్షన్ కొనసాగుతున్నంతవరకూ స్వలింగ లైంగిక సంబంధాలను చట్టబద్ధమైనవిగా పరిగణించలేమని కోర్టు డిసెంబర్ 11న తన తీర్పులో అభిప్రాయపడింది.
 
రాజకీయ ఒత్తిళ్ల నుంచి ఉద్యోగస్తులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల ప్రవర్తనా నియమావళికి చేసిన సవరణలకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 12న ఆమోదం తెలిపింది.
 
అత్యున్నత స్థాయిలో అవినీతిని నిర్మూలించేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్, లోకాయుక్తల ఏర్పాటు బిల్లు - 2011కు పార్లమెంట్ డిసెంబర్ 18న ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రాజ్యసభ డిసెంబర్ 17న, లోక్‌సభ డిసెంబర్ 18న ఆమోదించాయి. ఈ బిల్లు ప్రకారం కేంద్ర స్థాయిలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ లోక్‌పాల్‌ను ఏర్పాటు చేస్తారు. లోక్‌పాల్ ఏర్పాటైన ఏడాదిలోగా రాష్ట్రాలు లోకాయుక్తలను ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకురావాల్సి ఉంటుంది.
 
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా సుష్మాసింగ్ డిసెంబర్ 19న బాధ్యతలు చేపట్టారు.
 
కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి వీకే దుగ్గల్ డిసెంబర్ 23న మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. తెలంగాణపై ఏర్పాటైన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీలో దుగ్గల్ సభ్య కార్యదర్శిగా ప్రముఖ పాత్ర పోషించారు.
 
ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ఆధ్యాత్మిక, మతపరమైన వేడుకగా పేరొందిన మహా కుంభ మేళా జనవరి 14న పవిత్ర గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమమైన ప్రయాగ (అలహాబాద్)లో ప్రారంభమైంది. ప్రపంచంలో ఒక కార్యక్రమం కోసం అత్యంత ఎక్కువ మంది ఒక్కచోట చేరే వేడుకగా ఇది ఇప్పటికే రికార్డు సృష్టించింది.
 
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వరుసగా ఐదోసారి అసోం నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. మొత్తం 126 స్థానాలు ఉన్న అసోం అసెంబ్లీలో 49 తొలి ప్రాధాన్యత ఓట్లతో  ప్రధాని ఎన్నికైనట్లు మే 30న ఎన్నికల అధికారులు ప్రకటించారు.
 
 
ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను రాజస్థాన్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర  ప్రభుత్వం సెప్టెంబర్ 21న నిర్ణయించింది. రాజధాని జైపూర్‌కు సమీపంలోని సాంబార్ సరస్సు వద్ద 23 వేల ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పే ఈ ప్రాజెక్ట్ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్  ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
 
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం సమర్పించిన నివేదికను, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2013ను డిసెంబర్ 5న కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
 
 
 ఐదు రాష్ట్రాల శాసనసభలకు నవంబర్, డిసెంబర్‌లలో జరిగిన ఎన్నికల ఫలితాలు..
 
 ఢిల్లీ (మొత్తం సీట్లు-70): బీజేపీకి 31 స్థానాలు, అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి 28 స్థానాలు, కాంగ్రెస్‌కు 8 స్థానాలు దక్కాయి. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ మద్దతుతో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా డిసెంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు.
 
 మధ్యప్రదేశ్ (సీట్లు-230 ): బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీకి 165, కాంగ్రెస్‌కు 58, ఇతరులకు 7 స్థానాలు దక్కాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు.
 
  ఛత్తీస్‌గఢ్ (మొత్తం సీట్లు-90): బీజేపీకి 49, కాంగ్రెస్‌కు 39, ఇతరులకు 2 స్థానాలు లభించాయి. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్ డిసెంబర్ 12న వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు.
 
 రాజస్థాన్ (మొత్తం సీట్లు-200): బీజేపీకి 162, కాంగ్రెస్ 21, ఇతరులు 16 స్థానాలు దక్కాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు.
 
 మిజోరం (మొత్తం సీట్లు-40): కాంగ్రెస్ పార్టీ 33 సీట్లు, మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్) 5 స్థానాలు, మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ ఒక స్థానం లభించాయి. మిజోరం సీఎంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లాల్ తన్వాహ్లా డిసెంబర్ 14న ప్రమాణ స్వీకారం చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement