Sakshi Special Story On The Services Of AP Grama And Ward Volunteers In Telugu - Sakshi
Sakshi News home page

శభాష్‌ వలంటీర్‌.. వెన్నుచూపలేదు.. వెనక్కి తగ్గలేదు..

Published Wed, Jul 12 2023 7:29 AM | Last Updated on Wed, Jul 12 2023 10:30 AM

Sakshi Special Story On The Services Of Ap Volunteers

కరోనా వైరస్‌ భయపెడుతున్నా... వరద వణికిస్తున్నా... ప్రతిపక్షాలు వెక్కిరిస్తున్నా... వలంటీర్లు వెన్నుచూపలేదు. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కరోనా కష్టకాలంలో అందరూ ఉన్నా ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నవారి వద్దకు వెళ్లి భరోసా కల్పించారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. వాన వచ్చినా... వరద వచ్చినా ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారకముందే  అవ్వతాతల ఇంటి తలుపుతట్టి పింఛను అందిస్తున్నారు.

అర్హత గల తల్లికి అమ్మఒడి... అక్కచెల్లెమ్మలకు ఆసరా... చేయూత... నిరుపేదలకు నివేశన స్థలం.. పక్కా ఇళ్లు... విద్యార్థులకు విద్యాదీవెన... ఇలా ఒకటేమిటీ సమస్త సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే చేరుస్తూ శభాష్‌ వలంటీర్‌ అని అందరి మన్ననలు పొందుతున్నారు. వలంటీర్ల వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలిపారు.

వారి వల్లే వైఎస్సార్‌ బీమా 
వలంటీర్‌ మహబూబ్‌బాషా వల్లే నా కుటుంబానికి వైఎస్సార్‌ బీమా కింద రూ.4.50లక్షలు అందింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా, కార్యాలయాల చుట్టూ తిరగకుండా ధ్రువీకరణపత్రాలు అందజేసి వైఎస్సార్‌ బీమా దరఖాస్తు చేయించి డబ్బులు అందేలా చేశారు. వలంటీర్లు చేసిన సేవలను మరువలేం. కరోనా సమయంలో పాల ప్యాకెట్‌లు ఇంటికే తెచ్చి ఇచ్చారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడంతో ప్రాణాలు నిలుపుకున్నాం.


– ధనలక్ష్మి, 39వ వార్డు, నంద్యాల పట్టణం

నా బాధలు తీర్చారు.. 
నా వయసు 66 దాటింది. నాకు 62 ఏళ్ల వరకు రేషన్‌ కార్డు లేదు. పింఛన్‌ రాలేదు. నా కుటుంబ సభ్యులు ఆదరించకపోవడంతో ఒంటరిగా బతుకీడుస్తున్నా. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏర్పాటు చేసిన వలంటీర్‌ వ్యవస్థ వల్ల నాకు ఎంతో మేలు కలిగింది. మా వలంటీర్‌ నాసు శివశంకర్‌ నా సమస్యను తెలుసుకుని రేషన్‌ కార్డు వచ్చేలా చూశాడు. ఆ తర్వాత పింఛను కూడా పెట్టించాడు. ఆ పింఛనే ఇప్పుడు నాకు జీవనాధారం. ఇంత మంచి వ్యవస్థను అందించిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. 


– పొన్నాన రామారావు, కుమ్మరిగుంట,సారవకోట మండలం, శ్రీకాకుళం జిల్లా

మా కుటుంబాన్ని కాపాడిన వలంటీర్‌ 
రెండేళ్ల క్రితం మా కుటుంబంలోని మొత్తం ఆరుగురం కరోనా బారినపడ్డాం. మా వీధిని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. అప్పుడు మేం ఇంట్లో నుంచి వెలుపలికి రాలేక అవస్థలు పడ్డాం. అప్పుడు వలంటీర్‌ అశోక్‌ వచ్చి మా కుటుంబానికి అండగా నిలిచాడు. 18 రోజులు పూర్తిగా మాకు సేవలందించాడు.. వంట సామాగ్రి తెచ్చిచ్చాడు. ప్రతి రోజు బిందెలతో తాగునీరు కూడా అందించాడు. ఎవరూ మమ్మల్ని చూడడానికి కూడా రాలేదు. అటువంటి సమయంలో మా ప్రాణాలను రక్షించింది మా గ్రామ వలంటీరే.


– నారాయణప్ప, తాళ్లపల్లి, గంగవరం మండలం, చిత్తూరు జిల్లా

వలంటీర్‌ వల్లే ఇంటి స్థలం వచ్చింది
మాకు సొంత ఇల్లు లేక అద్దెకు ఉంటూ అవస్థలు పడుతున్నాం. గత ప్రభుత్వంలో ఇంటిస్థలం కోసం అనేకమార్లు అర్జీలు ఇచ్చినా ప్రయోజనం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వలంటీర్‌ ఆర్‌.మహేష్‌ మా ఇంటికి వచ్చి ఇంటిస్థలానికి దరఖాస్తు చేయించారు. అధికారులు ఇంటిస్థలం మంజూరు చేశారు. రేణిగుంట మండలంలోని ఎల్లమండ్యం సమీపంలోని అడుసుపాళెం జగనన్న కాలనీలో ఇప్పుడు మేం ఇల్లు నిర్మించుకుంటున్నాం. వలంటీర్‌ వ్యవస్థ వల్ల నేను ఏ నాయకుని చుట్టూ తిరగకపోయినా, అర్హతను బట్టి ఇంటిస్థలం ఇచ్చారు. 


– లక్ష్మీపార్వతి, రేణుగుంట, తిరుపతి జిల్లా

ఆస్తులన్నీ కరిగిపోయినా...
నా పేరు మారంరెడ్డి సుబ్బారావు. నా కుడికాలు, కుడి చేతికి పక్షవాతం వచ్చింది. ప్రస్తుతం ఒంటరిగా కొండపిలో నలుగురిని యాచిస్తూ జీవిస్తున్నాను. మా గ్రామ వలంటీర్‌ మారంరెడ్డి గంగాధర్‌ సహకారంతో నాకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌ వచ్చింది. ప్రస్తుతం నాకు పింఛను వచ్చేటట్లు చేశాడు. ప్రతి నెలా కొండపి వచ్చి నాకు పింఛను అందిస్తున్నాడు. గ్రామ వలంటీర్‌ వ్యవస్థ వలన నాకు ఎంతో మేలు జరిగింది.


– మారంరెడ్డి సుబ్బారావు, పీరాపురం, జరుగుమల్లి మండలం, ప్రకాశం జిల్లా

కష్టకాలంలో కన్నబిడ్డలా చూసుకుంది
నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఇద్దరికి పెళ్లి చేశాం. నేను, నా భర్త ఇద్దరమే ఉంటున్నాం. నాకు కరోనా సోకడంతో మాట్లాడేందుకు అందరూ భయపడ్డారు. మా వలంటీర్‌ తాడువాయి శ్వేత ధైర్యంగా మా ఇంటికి వచ్చి యోగక్షేమాలు తెలుసుకుంది. మందులు ఇచ్చింది. కరోనా సోకిన మూడు రోజుల తర్వాత నాకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో నన్ను నరసరావుపేటలోని క్వారెంౖ­టె­న్‌ సెంటర్‌కు పంపించింది. ఇంటి వద్ద ఉన్న నా భర్తకు కూరగాయలు, సరుకులు, పాలు వంటివి అందించింది. కోలుకుని ఇంటికి వచ్చే వరకు మమ్మల్ని కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్న వలంటీర్‌ శ్వేత సేవలను ఎప్పటికీ మరిచిపోలేను.


– ఊటా అచ్చమ్మ, ముప్పాళ్ల, పల్నాడు జిల్లా 

డోలీ మోసి ప్రాణం నిలిపాడు 
మాది మారుమూల గిరిజన గ్రామం. నేను గత ఏడాది డిసెంబర్‌లో చెట్టు నుంచి జారి కిందపడిపోయాను. తలకు తీవ్రగాయమై రక్తం అధికంగా పోయింది. బుడపనస గ్రామం నుంచి ప్రధాన రహదారి రంగబయలు వరకు సరైన రహదారి లేకపోవడంతో మా గ్రామ వలంటీర్‌ రాము మూడు కిలోమీటర్లు గ్రామస్తుల సాయంతో అడవి మార్గంలో మోసుకుని వచ్చాడు. అక్కడ నుంచి 108కి ఫోన్‌ చేసి ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తీసుకువెళ్లాడు. సకాలంలో ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్య సేవలు అందించాడు. లేకుంటే నేను చనిపోయి ఉండేవాడిని. ఆ సమయంలో నాకు ఖర్చుల నిమిత్తం వలంటీర్‌ రాము రూ.5 వేలు ఆర్థికసాయం చేశాడు. ఆరోజు ఆస్పత్రికి సకాలంలో తరలించడం వల్ల ఈ ప్రాణాలతో ఉన్నాను.


– పాంగి అనుసు, బుడపనస, అల్లూరి సీతారామరాజు జిల్లా   
 

నేనున్నానంటూ..
2021 మే నెలలో శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరా జుపల్లిలో పేద దంపతులు నాగ­రాజు, నాగలక్ష్మమ్మ దంపతులకు కష్టమొచ్చింది. వీరి కుమార్తె సుమలత (9)కు తీవ్రజ్వరం 20 రోజులు తగ్గలేదు. హిమోగ్లోబిన్‌ 1.5కి పడిపోయింది. చనిపోతుందని భావించి ఇంటి బయట పడుకోబె­ట్టారు. ఈ విషయం తెలుసుకున్న వలంటీర్‌ ప్రసాద్‌ అప్పటి ఎంపీడీవో నరేష్‌కృష్ణకు సమాచారం అందించారు. బాలికను సొంత ఆటోలో పుట్టపర్తి­లోని శ్రీసత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుమారు 15 రోజుల పాటు ఇతరుల నుంచి రక్తం ఇప్పించి బాలికకు చికిత్సలో సహాయపడ్డారు. ఆ అమ్మాయి కోలుకుని ఇంటికి చేరుకుంది. అయితే.. ఐదునెలలకే ఆ బాలిక చనిపోయి­నప్పటికీ.. వలంటీర్‌ ప్రసాద్‌ అందించిన సేవలు మాత్రం గ్రామస్తులకు గుర్తుండిపోయాయి. ప్రసాద్‌ సేవలను ప్రశంసిస్తూ అప్పట్లో పత్రికల్లో వార్తలు కూడా ప్రచురితమయ్యాయి.  

ప్రాణాలు కాపాడారు
ఈ ఫొటోలో కూరగాయలు ఇస్తున్న యువకులు వలంటీర్లు. కూరగాయలు అందుకుంటున్న వ్యక్తి విజయనగరం జిల్లా సంతకవిటి మండలం అప్పల అగ్రహారం గ్రామానికి చెందిన కొమనబల్లి సన్యాసిరావు. కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో సన్యాసిరావు, రమణమ్మ దంపతులు మాత్రమే ఇంటివద్ద ఉన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన కుమారుడు ఆ సమయంలో ఇంటికి రాలేకపోయాడు. తాము అసలు బతుకుతామా?లేదా? అనుకున్న సమయంలో వలంటీర్లు వీరికి వెన్నుదన్నుగా నిలిచారు. కూరగాయలు వంటివి ఇంటికే తీసుకెళ్లి ఇవ్వడంతోపాటు వారి కుమారుడిని రప్పించి, కోవిడ్‌ షెల్టర్‌లో ఉంచి అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్‌ కష్టకాలం నుంచి సన్యాసిరావును, అతడి కుటుంబాన్ని గట్టెక్కించారు.  

వలంటీర్‌కు రుణపడి ఉంటా
ఈ ఫొటోలో బెడ్‌పై చికిత్స పొందుతున్న వ్యక్తి ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వైవాక గ్రామానికి చెందిన దూసనపూడి వెంకటేశ్వరరావు. ప్రతి నెల ఒకటో తేదీన వలంటీర్‌ ద్వారా ఇంటివద్దే పింఛను సొమ్ము అందుకుంటున్న ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవడంతో విజయవాడ ఆస్పత్రిలో చేరారు. ఇక ఈ నెల పింఛను అందదేమో అనుకున్నారు. కానీ.. వలంటీర్‌ కత్తుల వెంకటశ్రీలక్ష్మి సేవాభావంతో ఆమె సొంత ఖర్చులతో విజయవాడ వెళ్లి వెంకటేశ్వరరావుకు పింఛను అందజేశారు. వలంటీర్లు లేకుంటే తనలాంటి వారి గతేమవుతుందని వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. దేవుళ్ల వంటి వలంటీర్లను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అభిప్రాయపడ్డారు.

కరోనా కష్టంలో అండగా.. 
ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో కరోనా కాలంలో ఒక కుటుంబానికి అండగా నిలిచారు వలంటీరు తమ్మిశెట్టి యలమందరావు. ఆరోగ్యం ఎలా ఉందని అడగడానికి కూడా ఎవరూ సాహసించని సమయంలో చల్లా లక్ష్మి కుటుంబానికి ధైర్యం చెప్పి బతుకుపై ఆశ కలిగించారు. చల్లా లక్ష్మి..  డ్రైవర్‌గా పనిచేస్తున్న భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో.. 2019లో కరోనా బారిన పడింది. ఇరుగుపొరుగు వారు, బంధువులు, తోబుట్టువులు కూడా వారి ఇంటికి వెళ్లలేదు.

మాట్లాడేందుకు కూడా ఎవరూ రాని ఆ సమయంలో లక్ష్మిని బతుకు భయం వెంటాడింది. ఆయాసంతో బాధపడుతున్న తనకు ఏమైనా అయితే పిల్లల భవిష్యత్తు ఏమిటనే ఆందోళనకు గురైంది. ఆ సమయంలో ఆ కుటుంబానికి వలంటీర్‌ తమ్మిశెట్టి యలమందరావు అండగా నిలిచారు. ధైర్యంగా వారి ఇంటికి వెళ్లి కరోనా గురించి ఆందోళన చెందవద్దని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన మందుల కిట్లు, పౌష్టికాహారం అందజేశారు. రోజూ ఆమె ఆరోగ్యం గురించి కనుక్కున్నారు. క్రమంగా లక్ష్మి కోలుకుంది. తమ కుటుంబం ఇప్పుడు ఆనందంగా జీవిస్తోందంటే వలంటీరు సేవలే కారణమని ఆమె సంతోషంగా చెబుతోంది.

అంతిమంలోను అండగా.. 
కరోనా విపత్తులో ప్రాణాలు కోల్పోయినవారికి అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లిలో వలంటీర్లు మోర్త రవి, స్వామిరెడ్డి శివకామేశ్వరరావు, విజ్జపురెడ్డి నాగేంద్ర. 2021 మే నెల 3వ తేదీ గ్రామంలో తలాటం కొండయ్య కరోనాతో మృతిచెందాడు. అతడి బంధువులకు కరోనా సోకడంతో.. కొండయ్య అంత్యక్రియలు నిర్వహించేందుకు వారు వచ్చే వీలు లేకపోయింది. ఇతరులు కూడా భయపడి ముందుకు రాలేదు. మృతదేహం ఉదయం నుంచి సాయంత్రం ఇంటి వద్దే ఉండిపోయింది. వలంటీర్లు వెంటనే పీపీఈ కిట్లు తెప్పించుకుని కొండయ్య మృతదేహాన్ని పంచాయతీ రిక్షాపై మరుభూమికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. 

సేవకు ప్రతిరూపం 
కరోనా సమయంలోను భయపడ­కుండా కరోనా బాధితు­లకు ప్రభుత్వ సాయా­న్ని పంపిణీ చేయడ మేగాక అవసరమైన నిత్యావస­రాలను కూడా అందించిన ఈమె వలంటీరు రేణుకాదేవి. తిరుపతి అర్బన్‌ మండలం 47వ డివిజన్‌ ఎర్రమెట్ట ప్రాంతంలో నివసిస్తున్న లక్ష్మీదేవి భర్త, ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నారు. 2020లో లక్ష్మీదేవికి కరోనా సోకడంతో ఇంట్లోనే వేరే గదిలో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో వలంటీర్‌ రేణుకాదేవి ఏఎన్‌ఎం ద్వారా లక్ష్మీదేవి కుటుంబ సభ్యులకు ఇంటివద్దే కోవిడ్‌ పరీక్షలు చేయించారు. ప్రభుత్వం అందించినరూ.వెయ్యి సాయాన్ని ధైర్యంగా లక్ష్మీదేవి ఇంటికెళ్లి అందజేశారు. రోజు ఆమె ఆరోగ్య పరిస్థితులపై ఆరాతీశారు. ఆ కుటుంబ సభ్యుల­కు అవసరమైన సరుకులను కూడా తీసుకెళ్లి అందజేశారు.

బెంగళూరు వెళ్లి.. ఈకేవైసీ
కరోనా విజృంభనకు ముందు కర్నూలు జిల్లా కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు కర్ణాటకలోని బెంగళూరుకు వలసవెళ్లాయి. కరోనా పెరిగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఆ కుటుంబాలు మూడునెలలు అక్కడే ఉండిపోవడంతో రైస్‌కార్డుల అప్‌డేట్‌కు ఈకేవైసీ అవసరమైంది. దీంతో వలంటీర్‌ శంకర్‌.. బెంగళూరు వెళ్లాడు. ఆంక్షలను అధిగమించి దాదాపు 400 కుటుంబాలకు అక్కడే ఈకేవైసీ పూర్తిచేసి శభాష్‌ అనిపించుకున్నాడు. శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, చిత్తూరు, ఆదోని, కోసిగి ప్రాంతాల వాళ్లను కలుసుకుని ఈకేవైసీ పూర్తిచేశాడు.

సేవ చేసేందుకే మేము.. 
ఇతడి పేరు వల్లెపు వెంకటేశ్వరరావు. దివ్యాంగుడు. బాపట్ల జిల్లా అద్దంకి మౌలానగర్‌ నివాసి. 2021 ఆగస్ట్‌లో ఇంట్లో వారికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వెంకటేశ్వరరావుకు కూడా కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో మేదరమెట్ల వైద్యశాలలో చేరాడు. బజారులో తిరగడానికే భయపడుతున్న సమయంలో.. వారి వార్డు వలంటీరు సైదా మేదరమెట్ల వైద్యశాలకు వెళ్లి వెంకటేశ్వరరావుకు వికలాంగ పింఛన్‌ రూ.3 వేలు అందించాడు.

దీంతో వెంకటేశ్వరరావు తండ్రి ఇలాంటి సమయంలో మా దగ్గరకు వచ్చి పింఛన్‌ ఇచ్చావని సంతోషిస్తూ అందులో సగం డబ్బు వలంటీరుకు ఇవ్వబోయాడు. ‘మేము సేవ చేయడానికే ఉన్నాం. ఇది మాకు జగన్‌ ఇచ్చిన వరం. మాకు ఏమీ వద్దు..’ అంటూ సైదా తిరస్కరించాడు. దీంతో అందరూ సైదాను అభినందించారు. మాస్కులు లేని వారికి ఉచితంగా మాస్కులు పంచడం వంటి సేవలు కూడా చేసిన సైదా అందరి ప్రశంసలు అందుకున్నాడు. 

పరిశుభ్రతలో.. 
ఇక్కడ రిక్షా తొక్కుతూ బ్లీచింగ్‌ చల్లుతున్న వారు పారిశుద్ధ్య కార్మికులు కాదు.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి గ్రామానికి చెందిన వలంటీర్లు దట్టి బాలకృష్ణ, సంతోష్‌కుమార్, యోగేశ్వరరావు, రాజరాజేశ్వరి. 2020 మే 26వ తేదీ నాటిది ఈ చిత్రం. కోవిడ్‌ కాలంలో ప్రజలు బయటకు రావడానికి వణికిపోయారు. శానిటేషన్‌ సిబ్బంది విధులు నిర్వర్తించడానికి భయపడటంతో ఆ పనుల్ని కూడా ఈ నలుగురు భుజానికెత్తుకున్నారు. స్వచ్ఛ భారత్‌ వాహనాన్ని తీసుకుని వీధుల్లో బ్లీచింగ్‌ చల్లి శుభ్రం చేశారు. దట్టి బాలకృష్ణ రిక్షా తొక్కగా సంతోష్‌కుమార్, యోగేశ్వరరావు, రాజరాజేశ్వరి బ్లీచింగ్‌ చేతపట్టుకుని వీధివీధిన చల్లారు.  

ట్రాన్స్‌ఫార్మర్‌ను భుజాలపై వేసుకుని కొండలెక్కి.. 
అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని చలిసింగం గ్రామం రెండు కొండల అవతల ఉంది. ఆ గ్రామంలో తాగునీటి సదుపాయం కోసం చీకాయపాడు బోరుబావి నుంచి కొండపైకి పైపులైన్‌ వేశారు. గత ఏడాది ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడంతో దానికి అమర్చిన మోటారు పనిచేయక నీటి సరఫరా నిలిచిపోయి తాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ట్రాన్స్‌కో సిబ్బంది ట్రాన్స్‌ఫార్మర్‌ను రహదారి ఉన్న చీకాయపాడు వరకు తేగలిగారు.

అక్కడి నుంచి కొండపైకి చేర్చే మార్గం లేక అక్కడే వదిలేశారు. ఎవరూ రాకపోవడంతో రెండురోజులు అక్కడే ఉండిపోయింది. దీంతో గ్రామ వలంటీర్లు వంజరి రవీంద్ర, కూడ రవి, తుర్రె రవి, ఒంపురి రాజు, సబ్బారపు రమణ నడుం బిగించారు. బలమైన కర్రల సహాయంతో ట్రాన్స్‌ఫార్మర్‌ను భుజాలపైకి ఎత్తుకుని అతి కష్టంపై రెండు కొండలెక్కారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయించి తాగునీటి ఇబ్బందులు తొలగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement