బతికి సాధిద్దాం ! | Special Article On World Suicide Prevention Day | Sakshi
Sakshi News home page

బతికి సాధిద్దాం !

Published Tue, Sep 10 2019 2:39 PM | Last Updated on Tue, Sep 10 2019 2:44 PM

Special Article On World Suicide Prevention Day - Sakshi

ఒక్క నీటి బిందువు మీద పడితేనే అల్ప ప్రాణి చీమ చివరి క్షణం వరకూ ప్రాణం కాపాడుకోవడానికి పోరాడుతుంది. చల్లటి చిరుగాలి వీస్తే ఆ స్పర్శకు చిటికెన వేలు మీద వెంట్రుక సైతం లేచి నిలబడుతుందే.. అలాంటిది ఏళ్ల తరబడి ఎంతో ఇష్టంగా తీర్చిదిద్దుకున్న నిండు ప్రాణం ఎలా తీసుకోవాలనిపిస్తుంది. అసలు ఈ భూమ్మీద మనిషి కాకుండా మరో ప్రాణి ఏదైనా ఆత్మహత్యకు ప్రయత్నించడం చూశామా.. మేధస్సు కలిగిన మనిషికి ఎందుకింత బలహీనత..

ఒక్క నిమిషం..
‘నా చావుకు ఎవరూ కారణం కాదు. జీవితం మీద విరక్తికలిగి నేనే ఈ ప్రయత్నానికి ఒడిగట్టాను. నా కోసం ఎవరూ బాధపడొద్దు. తమ్మున్ని, చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి. బాగా చదివించండి. ఉంటాను. ఇక సెలవు’. ఇలా.. మరణానికి ముందు సొంతంగా రాసుకునే చివరి అక్షరాలు రాయడానికి కనీసం ఐదు నిమిషాలు పడుతుంది కదా.. అందులోంచి ఒక్క నిమిషం.. బతికి చూస్తే ఈ సమస్యలనుంచి బయటపడే మార్గం ఉంటుంది కదా.. చనిపోయి మాత్రం సాధించేదేముంటుంది.

సాక్షి జగిత్యాల : యుక్తవయసు, వృద్ధ వయసు అనే భేధం లేకుండా జిల్లాలో ఆర్థిక, మానసిక ఒత్తిళ్లతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లా కేంద్రంలో గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు, ముగ్గురు ఆడపిల్లల తర్వాత కొడుకు జన్మించాడు. తమను పోషిస్తాడని అనుకున్న తరుణంలో ఎదిగిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. అలాగే సారంగాపూర్‌ మండలం పోచంపేట గ్రామానికి చెందిన ఓ చిన్నారి చదువు ఇష్టం లేదని ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌లో ఓ యువతి ప్రేమ వివాహం చేసుకుని నెలరోజుల పాప ఉండగా భర్త విదేశాల్లో ఉండటం జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఆ చిన్నారిని చూసిన వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

జగిత్యాల జిల్లాలో 2018లో వివిధ కారణాలతో 242 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 163 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో కారణం. తీవ్ర ఒత్తిళ్లకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఎక్కడో ఏదో కారణం చేత ఆత్మహత్య చేసకుంటున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మానసిక స్థితి సరిగా లేకపోవడం, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, గృహహింస, చదువులో విఫలమవడం, ప్రేమ వైపల్యం వంటి కారణాలతో ఈ బతుకు నాకొద్దు.. అంటూ అభాగ్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యకృత్యమైనాయి. ఇంతే కాకుండా నచ్చిన కూర వండలేదనో, పండుగకు పుట్టింటికి పంపించలేదనో, సినిమాకు వద్దన్నారనో, చీరలు, నగలు కొనివ్వలేదనో, చివరకు పెళ్లి కాలేదనో, ఒంటరిగా బతకలేమనే నెపంతో కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. 

ఎక్కువగా 15–40 ఏళ్ల వయస్సు వారే.. 
జగిత్యాల జిల్లాలో 2018లో 242 మంది వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకోగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 163 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు కారణం కడుపునొప్పిగా మాత్రమే పోలీసు రికార్డులకెక్కుతున్నాయి. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఎక్కువగా 15–40 ఏళ్ల వయస్సులోపు వారే ఉంటున్నారు. ఆత్మహత్యలను మానవీయ కోణంలో చూసి ప్రజల్లో స్థైర్యాన్ని నింపాల్సిన అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనబడటం లేదు. స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. 

సమస్య చిన్నదే.. దృక్పథమే వేరు
ఎవరి సమస్య వారికి పెద్దదిగా కనిపించడం సహజమే. అయితే గోళీకాయను కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కంటి పరిధిని తగ్గిస్తుంది. అదే కాస్త దూరంగా పెట్టి చూస్తే సమస్య చిన్నదవుతుంది. ప్రపంచం విశాలంగా కనిపిస్తుంది. విశాల ప్రపంచంలో చిన్న సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది.

సమస్యలు పలు రూపాలు..
ఆత్మీయుల మోసాలు, ప్రేమ వైఫల్యాలు, పరీక్షల్లో పరాజయం, తల్లిదండ్రుల అంచనాలకు అందుకునే ర్యాంకు రాకపోవడం, ఆలోచనలేవీ కార్యరూపంలోకి రాకపోవడం, ఎంతకీ మెరుగుపడని కుటుంబ ఆర్థిక పరిస్థితులు, దాంపత్యంలో అభిప్రాయ భేదాలు, అయినవాళ్లతోనే సమస్యలు, ఊహించిన ఉద్యోగం రాకపోవడం, ఉద్యోగంలో పై అధికారి చులకనగా మాట్లాడడం కారణం ఏదైనా సరే జీవితంపై విరక్తి కలిగించవచ్చు. 

లక్షణాలు ఇలా కూడా ఉండొచ్చు..
నలుగురికీ దూరంగా కాలక్షేపం చేయడం, గదిలో ఒంటరిగా తలుపులు వేసుకుని కూర్చోవడం, చావు గురించో, ఆత్మహత్య ప్రయత్నాల గురించో మాట్లాడడం, కవితలు, పాటల్లో మరణదేవతను పొగుడుతూ ఉండడం, ఇంకేమీ లేదనే నిరాశావాదం, మత్తుపదార్థాలకు బానిస కావడం, చేస్తున్న వృత్తి, ఉద్యోగాల్లో ఆసక్తి తగ్గిపోవడం, ఇవన్నీ ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తుల లక్షణాలు కాకపోయినా వీటిలో కొన్నింటినైనా ప్రదర్శించడం అలాంటి వాళ్ల సహజ లక్షణం. ‘నాకు బతకాలని లేదు. చస్తే తప్ప నా సమస్యకు పరిష్కారం’ లేదనుకునే వాళ్లు ఏదో సందర్భంలో మాటలు, తమ చేతల ద్వారా వాళ్ల ఆలోచనను బయట పెడుతుంటారు. ఆత్మీయులు పసిగట్టాలి. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలి. మేమున్నామన్న భరోసా ఇవ్వాలి.

బయట పడనివ్వాలి
ముందు వాళ్లను మనసు విప్పి మాట్లాడనివ్వండి. ఏడ్పులు, ఎక్కిళ్లు రానివ్వండి. ఎన్ని కన్నీళ్లు కారుస్తారో కార్చనివ్వండి. అడ్డు చెప్పే ప్రయత్నం చేయొద్దు. ఎంత వరకు వాళ్ల భావోద్వేగాల్ని బయట పెట్టగలరో అంత వరకు ఓపిగ్గా ఎదురు చూడండి. హృదయంలో భారం దిగేవరకు వేచి చూడండి. ఆవేశం, కోపం, పశ్చాత్తాపం,  ఒక్కసారిగా కట్ట తెగిన ప్రవాహంలో వెల్లువెతనివ్వండి. మనసు కుదుటపడ్డాక జీవితం మీద ఆశ కల్గించే మంచి స్ఫూర్తినిచ్చే మాటలు మాట్లాడాలి. ఎంతటి కష్టాలనుంచైనా ఎదురీది నిలిచిన విజేతల గురించి వివరించాలి. పాజిటివ్‌ దృక్పథాన్ని మనసు నిండా నింపాలి.

నలుగురితో కలవాలి
ఏకాంతం వేరు ఒంటరి తనం వేరు. ఒంటరిగా కూర్చుని బాధల్లోంచి బయటకు రాలేకపోతున్నామనే భావనతో కుమిలిపోవడం మంచిదికాదు. సమస్యలు ఏవైనా సరే.. ఏ స్థాయిలో ఉన్నా సరే అయినవాళ్లతో కాసేపు పంచుకోవాలి. కనీసం ఒక్క స్నేహితుడైనా దొరక్కపోతాడా.. ఆలోచించండి. భక్తి భావనలు, ఆధ్యాత్మిక ఆలోచనలు అ«ధికంగా ఉన్నవాళ్లకు సహజంగానే ఇలాంటి అపసవ్యమైన ఆలోచనలు రావు. మనల్ని మన ప్రపంచాన్ని ఏదో అద్భుత శక్తి నడిపిస్తుందన్న ఆశావాదం మనల్ని మాత్రం ఎందుకు చంపాలని ప్రయత్నిస్తుందో ఆలోచించాలి.

సంప్రదించేందుకు సంకోచమెందుకు..
కష్టమొచ్చినప్పుడు మరో దారి లేనప్పుడు మంత్రాల్లాంటి మాటలతో మనల్ని దారిలో ఉంచగలిగిన సైకాలజిస్టులు, ప్రేరణాత్మక ఉపన్యాసకులు మన చుట్టూ ఎందరో ఉంటారు. వాళ్లతో మాట్లాడి చూడడానికి సంకోచించాల్సిన పని లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కౌన్సెలింగ్‌ చాలాసార్లు పని చేస్తుంది.

ఓటమిలోనూ ఆనందించాలి..
ఓడిపోయిన వాడి అనుభవం ముందు అదేమంత పెద్దది కాదు. ప్రతీ విజేత ఏదో దశలో ఓటమి చవిచూసిన వాడే. ప్రతీ ప్రయత్నం విజయం కోసం చేసిందే. అన్ని ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఒక ప్రయత్నం మాత్రం కచ్చితంగా మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. అందుకే విజేతల ఆత్మకథల్ని విస్తృతంగా చదవండి. గెలిచే వాళ్ల సాహచర్యం కోసం ప్రయత్నించండి. 

ఆత్మీయులను పెంచుకోవాలి
అందర్నీ ప్రేమిస్తే మనవాళ్లవుతారు. అభిమానించే మనుషులు లేకపోవడం అంత పెద్ద సమస్య మరేదీ ఉండదు. నిజానికి ప్రేమించే మనుషులు మన చుట్టూ ఎంత ఎక్కువ మంది ఉంటే అంతగా సమస్యల తీవ్రత తగ్గుతుంది.

కరీంనగర్‌ జిల్లాలో 2017, 2018, 2019 సెప్టెంబర్‌ వరకు వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడినవారి సంఖ్య

2017  2018 2019
232 229 142

ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావు 
చాలా మంది ఆత్మస్థైర్యం కోల్పోయి చిన్నచిన్న సమస్యలకు మనస్తాపానికి గురై క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్య చేసుకోవద్దు. గ్రామాల్లో పోలీసు కళాబృందాలతో ఆత్మహత్యల నివారణ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. సామాజిక సేవకులు కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి.
– సిందూశర్మ, ఎస్పీ, జగిత్యాల జిల్లా                  

క్షణికావేశమే శాపమైంది..
పెద్దపల్లిరూరల్‌ : సాగుచేసిన పంటకు నీరందక ఎండిపోయి, పెట్టిన పెట్టుబడులు చేతికి అందని పరిస్థితి ఏర్పడిందని.. చేసిన అప్పులు ఎలా తీర్చాలోననే మనస్తాపంతో క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకున్న గుర్రాల గట్టేశం కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. పెద్దపల్లి మండలం హన్మంతునిపేట గ్రామానికి చెందిన గట్టేశంకు ఎకరం 10గుంటలు భూమి ఉండగా మరో 10ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేయగా నీరందక పంటలు ఎండిపోయి నష్టపోయాడు. కూతురు మమత పెళ్లికి చేసిన అప్పుతో కలిపి రూ.7లక్షల దాక అప్పు అయింది. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడం, పంట దిగుబడి రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలోననే బెంగతో క్షణికావేశంలో క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అతడి కుమారులు మల్లేశ్, రాజు చదువును అర్ధాంతరంగా ఆపేసి కూలీలుగా మారారు. గట్టేశం భార్య శాంత తనకున్న ఎకరం భూమిలో పంట సాగు చేసేందుకు నానా తంటాలు పడుతోంది. తన భర్త మరణించిన తర్వాత ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామంటూ వచ్చిన అధికారులు మళ్లీ కనిపించకుండా పోయారని, ఇప్పటివరకు సర్కార్‌సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమ కుమారులకైనా ఉపాధి కల్పించాలని లేదా ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటుంది.

ఫెయిల్‌కు భయపడి..
సిరిసిల్లక్రైం: ఇంటర్‌ బోర్డు తప్పిదం వల్లే ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యానన్న మనస్తాపంతో కోనారావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థి లావణ్య ఆత్మహత్య చేసుకుంది. పదిహేనేళ్ల పాటు పెంచిన కూతురు మరణంతో తల్లిదండ్రులు మరణ వార్త విని తట్టులేకపోయారు. చదువుకోకున్న ఉన్న ఊరిలో పని చేసుకుని బతకాలే కానీ ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని మృతి చెందిన విద్యార్థి కుటుంబీకులు అంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement