మిడ్‌సెషన్ నుంచీ మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న హెల్త్‌కేర్ రంగ కౌంటర్ అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ టెక్నాలజీస్‌కు మరోసారి డిమాండ్ నెలకొంది. మరోపక్క సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీ కేపీఐటీ టెక్నాలజీస్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ తాజాగా 52 వారాల గరిష్టాలకు చేరాయి. వివరాలు చూద్దాం..
అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ టెక్నాలజీస్
ఇటీవల ముఖ విలువ విభజన నేపథ్యంలో జోరు చూపుతున్న ఫార్మా రంగ కంపెనీ అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ తాజాగా ఏడాది గరిష్టానికి చేరింది. ఎన్ఎస్‌ఈలో తొలుత 15 శాతంపైగా దూసుకెళ్లి రూ. 339ను తాకింది. ప్రస్తుతం 13 శాతం ఎగసి రూ. 332 వద్ద ట్రేడవుతోంది. రూ. 10 ముఖ విలువగల షేర్లను రూ. 2 ముఖ విలువగల 5 షేర్లుగా కంపెనీ ఇటీవల విభజించింది. దీనికితోడు ఎఫ్‌పీఐ విభాగంలో నలంద ఇండియా ఈక్విటీ ఫండ్ షేరుకి రూ. 264 ధరలో 4.19 మిలియన్ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఇది కంపెనీ ఈక్విటీలో 3.75 శాతం వాటాకు సమానంకాగా.. ఇందుకు రూ. 111 కోట్లు వెచ్చించింది. ఈ కారణాలతో గత వారం రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ షేరు 45 శాతం దూసుకెళ్లింది!
కేపీఐటీ టెక్నాలజీస్
ప్రమోటర్లు వాటాను పెంచుకున్న వార్తలతో తాజాగా కేపీఐటీ టెక్నాలజీస్ షేరు జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత 10 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 127ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.2 శాతం లాభపడి రూ. 123 వద్ద ట్రేడవుతోంది. ఈ నెల మూడో వారంలో ప్రమోటర్ కుంటుంబంలోని అనుపమ కిశోర్ పాటిల్ రెండు దఫాలలో 14.9 లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. దీంతో అనుపమ కిశోర్ వాటా 0.59 శాతానికి చేరింది. కాగా.. ద్వితీయార్థంలో కంపెనీ పటిష్ట పనితీరును చూపనున్న అంచనాలతో ఇటీవల ఈ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి గత రెండు వారాలలో ఈ షేరు 30 శాతం ర్యాలీ చేసింది!
Comments
Please login to add a commentAdd a comment