Advanced Enzyme Technologies
-
అడ్వాన్స్డ్ ఎంజైమ్- కేపీఐటీ.. దూకుడు
మిడ్‌సెషన్ నుంచీ మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న హెల్త్‌కేర్ రంగ కౌంటర్ అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్‌కు మరోసారి డిమాండ్ నెలకొంది. మరోపక్క సాఫ్ట్వేర్ సేవల కంపెనీ కేపీఐటీ టెక్నాలజీస్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ తాజాగా 52 వారాల గరిష్టాలకు చేరాయి. వివరాలు చూద్దాం.. అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ ఇటీవల ముఖ విలువ విభజన నేపథ్యంలో జోరు చూపుతున్న ఫార్మా రంగ కంపెనీ అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ తాజాగా ఏడాది గరిష్టానికి చేరింది. ఎన్ఎస్ఈలో తొలుత 15 శాతంపైగా దూసుకెళ్లి రూ. 339ను తాకింది. ప్రస్తుతం 13 శాతం ఎగసి రూ. 332 వద్ద ట్రేడవుతోంది. రూ. 10 ముఖ విలువగల షేర్లను రూ. 2 ముఖ విలువగల 5 షేర్లుగా కంపెనీ ఇటీవల విభజించింది. దీనికితోడు ఎఫ్‌పీఐ విభాగంలో నలంద ఇండియా ఈక్విటీ ఫండ్ షేరుకి రూ. 264 ధరలో 4.19 మిలియన్ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఇది కంపెనీ ఈక్విటీలో 3.75 శాతం వాటాకు సమానంకాగా.. ఇందుకు రూ. 111 కోట్లు వెచ్చించింది. ఈ కారణాలతో గత వారం రోజుల్లోనే అడ్వాన్స్డ్ ఎంజైమ్ షేరు 45 శాతం దూసుకెళ్లింది! కేపీఐటీ టెక్నాలజీస్ ప్రమోటర్లు వాటాను పెంచుకున్న వార్తలతో తాజాగా కేపీఐటీ టెక్నాలజీస్ షేరు జోరందుకుంది. ఎన్ఎస్ఈలో తొలుత 10 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 127ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.2 శాతం లాభపడి రూ. 123 వద్ద ట్రేడవుతోంది. ఈ నెల మూడో వారంలో ప్రమోటర్ కుంటుంబంలోని అనుపమ కిశోర్ పాటిల్ రెండు దఫాలలో 14.9 లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. దీంతో అనుపమ కిశోర్ వాటా 0.59 శాతానికి చేరింది. కాగా.. ద్వితీయార్థంలో కంపెనీ పటిష్ట పనితీరును చూపనున్న అంచనాలతో ఇటీవల ఈ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి గత రెండు వారాలలో ఈ షేరు 30 శాతం ర్యాలీ చేసింది! -
అడ్వాన్స్డ్ ఎంజైమ్- సిప్లా.. భళిరా భళి
ట్రేడర్ల షార్ట్ కవరింగ్, వరుస నష్టాల కారణంగా దిగివచ్చిన బ్లూచిప్స్‌లో ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 600 పాయింట్లు జంప్‌చేసి 37,150ను అధిగమించగా.. నిఫ్టీ 185 పాయింట్లు ఎగసి 10,990 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ దాదాపు 4 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు మల్టిపుల్ స్కెరోసిస్ వ్యాధి చికిత్సకు వినియోగించగల ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి లభించినట్లు పేర్కొనడంతో ఫార్మా దిగ్గజం సిప్లా లిమిటెడ్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ ఓపెన్ మార్కెట్ ద్వారా నలందా ఇండియా ఈక్విటీ ఫండ్ 3.75 శాతం వాటాకు సమానమైన అడ్వాన్స్డ్ ఎంజైమ్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ బల్క్‌డేటా వెల్లడించింది. షేరుకి రూ. 263.80 ధరలో అడ్వాన్స్డ్ ఎంజైమ్‌కు చెందిన 4.19 మిలియన్ ఈక్విటీ షేర్లను నలందా కొనుగోలు చేసింది. ఇందుకు నలందా ఇండియా రూ. 111 కోట్లు వెచ్చించింది. దీంతో అడ్వాన్స్డ్ ఎంజైమ్ షేరు జోరందుకుంది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 16 శాతం దూసుకెళ్లి రూ. 317ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 11 శాతం జంప్‌చేసి రూ. 303 వద్ద ట్రేడవుతోంది. సిప్లా లిమిటెడ్ మల్టిపుల్ స్కెరోసిస్ వ్యాధి చికిత్సకు వినియోగించగల ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు సిప్లా లిమిటెడ్ వెల్లడించింది. ఇది బయోజెన్స్ టెక్‌ఫిడెరా ఔషధానికి జనరిక్ వెర్షన్‌గా పేర్కొంది. డైమెథల్ ఫ్యూమరేట్ డీఆర్ క్యాప్సూల్స్‌గా పిలిచే వీటిని 120 ఎంజీ, 240 ఎంజీ డోసేజీలలో విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఈ ఔషధానికి 3.8 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 28,000 కోట్లు) మార్కెట్ ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో సిప్లా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4.3 శాతం జంప్‌చేసి రూ. 765 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 773 వరకూ ఎగసింది. తద్వారా 52 వారాల గరిష్టం రూ. 819కు చేరువకావడం గమనార్హం! -
అడ్వాన్స్డ్ ఎంజైమ్ ఐపీఓ ధర శ్రేణి రూ.880-896
ఈ నెల 20న ఐపీఓ ప్రారంభం 22న ముగింపు ముంబై: అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ కంపెనీ తన ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు ధర శ్రేణిని రూ.880-896గా నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.412 కోట్లు సమీకరించాలని యోచి స్తోంది. ఈ నెల 20న ప్రారంభమయ్యే ఈ ఐపీఓ 22న ముగుస్తుంది. కనీసం 16 షేర్లకు దరఖాస్తు చేయాలి. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.880-896 ధరకు రూ.50కోట్ల సమానమైన షేర్లను జారీ చేస్తోంది. వీటితో పాటు ప్రమోటర్ గ్రూప్ వాటాదారులు-కోటక్ ఎంప్లాయిస్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, కోటక్ ఇండియా వెంచర్ ఫండ్ వన్, కోటక్ ఇండియా వెంచర్(ఆఫ్‌షోర్)ఫండ్‌కు సంబంధించిన 40 లక్షలకు పైగా షేర్లను ఆఫర్ ఫర్ సేల విధానంలో ఆఫర్ చేస్తోంది. ఈ ఐపీఓకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్ సంస్థలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. రెండో అతి పెద్ద కంపెనీ.. అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్...దేశంలోనే అతి పెద్ద ఎంజైమ్ కంపెనీ అని కంపెనీ ఎండీ చంద్రకాంత్ ఎల్. రాఠి చెప్పారు. ఎంజైమ్‌ల పరిశోధన, అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని అమ్మకాల పరంగా ప్రపంచంలోనే 15వ అతిపెద్ద కంపెనీ అని వివరించారు.