అడ్వాన్స్డ్ ఎంజైమ్ ఐపీఓ ధర శ్రేణి రూ.880-896
ఈ నెల 20న ఐపీఓ ప్రారంభం 22న ముగింపు
ముంబై: అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ కంపెనీ తన ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు ధర శ్రేణిని రూ.880-896గా నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.412 కోట్లు సమీకరించాలని యోచి స్తోంది. ఈ నెల 20న ప్రారంభమయ్యే ఈ ఐపీఓ 22న ముగుస్తుంది. కనీసం 16 షేర్లకు దరఖాస్తు చేయాలి. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.880-896 ధరకు రూ.50కోట్ల సమానమైన షేర్లను జారీ చేస్తోంది. వీటితో పాటు ప్రమోటర్ గ్రూప్ వాటాదారులు-కోటక్ ఎంప్లాయిస్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్, కోటక్ ఇండియా వెంచర్ ఫండ్ వన్, కోటక్ ఇండియా వెంచర్(ఆఫ్‌షోర్)ఫండ్‌కు సంబంధించిన 40 లక్షలకు పైగా షేర్లను ఆఫర్ ఫర్ సేల విధానంలో ఆఫర్ చేస్తోంది. ఈ ఐపీఓకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్ సంస్థలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
రెండో అతి పెద్ద కంపెనీ..
అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ టెక్నాలజీస్...దేశంలోనే అతి పెద్ద ఎంజైమ్ కంపెనీ అని కంపెనీ ఎండీ చంద్రకాంత్ ఎల్. రాఠి చెప్పారు. ఎంజైమ్‌ల పరిశోధన, అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని అమ్మకాల పరంగా ప్రపంచంలోనే 15వ అతిపెద్ద కంపెనీ అని వివరించారు.