సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో ప్రమాదం జరిగిన ఫ్లోర్‌లోకి వెళ్లడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి రెండు గంటలు పట్టింది. బిల్డింగ్‌లోకి వెళ్లేందుకు ఉన్న స్పైరల్ స్టెయిర్ కేస్ (మెట్లు) వేడెక్కిపోవడంతో ఇబ్బందిపడాల్సి వచ్చింది. వేకువజామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో మంటలంటుకోగా ఉదయం 8 గంటలకు 8 ఫైరింజన్లు కష్టపడి మంటలార్పాయి. అయితే అగ్ని ప్రమాదాల్లో మంటలను త్వరగా ఆపేందుకు మన దేశంలో అత్యాధునిక పరికరాలేమున్నాయి, ఎలాంటి టెక్నాలజీని వాడి మంటలను అదుపు చేస్తున్నారు, ప్రాణాలను ఎలా కాపాడుతున్నారు?
రిమోట్ కంట్రోల్డ్ ఫైర్ ఫైటింగ్ మెషీన్
ప్రస్తుతం ఢిల్లీ అగ్నిమాపక శాఖ దగ్గర ఉంది. తీవ్రమైన వేడి ఉన్నప్పుడు, ప్రమాద స్థలంలోకి వెళ్లే పరిస్థితి లేనప్పుడు రిమోట్ ద్వారా కంట్రోల్ చేసే మెషీన్లను సులువుగా వాడొచ్చు. 140 హార్స్ పవర్‌తో పని చేసే డీజిల్ ఇంజిన్ ఇందులో ఉంటుంది. నిమిషానికి దాదాపు 2,400 లీటర్ల నీటిని ఇది పంప్ చేస్తుంది. పైగా ఇందులోని ఆటోమైజ్డ్ వాటర్ జెట్.. నీటిని కోట్లాది చిన్న చిన్న నీటి బిందువులుగా మార్చేస్తుంది. అవసరమైన ప్రదేశాల్లో నురగను కూడా ఉత్పత్తి చేసి పంప్ చేస్తుంది.
టర్న్ టేబుల్ ల్యాడర్
పెద్ద పెద్ద బిల్డింగుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాడటానికి టర్న్ టేబుల్ ల్యాడర్‌ను వాడుతున్నారు. దీని ద్వారా దాదాపు 32 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి మంటలు ఆర్పవచ్చు. నిచ్చెనను జాగ్రత్తగా ఆపరేట్ చేయడానికి కంప్యూటర్ మానిటరింగ్ ఉంది. డిస్‌ప్లే ఇండికేషన్లు కూడా ఉన్నాయి.
మోటార్ సైకిళ్లకు మిస్ట్ సిస్టమ్
ఈ తరహా సిస్టమ్‌ను మోటార్ సైకిళ్లకు బిగిస్తారు. ఇది దాదాపు 40 మైక్రాన్ల స్థాయిలో నీటి అణువులను వెదజల్లుతుంది. చిన్నస్థాయి, ఎలక్ట్రిక్ మంటలను ఆర్పేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇరుకుగా ఉండే ప్రాంతాల్లో బాగా పని చేస్తుంది. అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడానికి ముందు మంటల తీవ్రతను ఇది తగ్గించగలుగుతుంది.
హై ప్రెజర్ హోస్ రీల్ సిస్టమ్
నీటిని సమర్థంగా వాడి మంటలార్పడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా అత్యధిక ఒత్తిడితో నీటిని, ఇతర మంటలార్పే పదార్థాలు, ద్రావణాలను చల్లుతారు.
విదేశాల్లో కొత్త టెక్నాలజీలు ఇవే..
డ్రోన్లతో..
అగ్ని ప్రమాదాల్లో మంటలార్పేందుకు చైనాలో డ్రోన్లను వాడుతున్నారు. ఎంత ఎత్తుకైనా, ఎక్కడికైనా చాలా సులువుగా డ్రోన్లు వెళ్లిపోగలవు. కచ్చితత్వంలో మంటలను ఆర్పగలవు. ఆ మధ్య చైనాలోని చాంగ్‌క్వింగ్‌లో డ్రోన్లతో మంటలార్పే డ్రిల్‌ను కూడా నిర్వహించారు.
షాట్ గన్స్..
మంటలార్పే ఇంపల్స్ ఫైర్ ఎక్స్‌టింగ్విషింగ్ సిస్టమ్ షాట్ గన్స్‌లో తక్కువ స్థాయిలో నీటిని వాడతారు. అయితే అత్యధిక వేగంతో మంటలపై దీన్ని ప్రయోగిస్తారు. వీటిలోంచి వచ్చే నీటి బిందువులు సెకనుకు 120 మీ. వేగంతో వెళ్లి పరిసరాలను చల్లబరుస్తాయి. దీంతో మంటలు ఆరిపోతాయి.
రోబోటిక్ ఫైర్ ఫైటర్స్
చూడటానికి అచ్చం యుద్ధ ట్యాంకులా ఉంటుంది. ఇది నిమిషానికి 2 వేల నుంచి 20 వేల లీటర్ల నీటిని చల్లుతుంది. దీంట్లో కెమెరాలు, వేడిని గుర్తించే సెన్సార్లు కూడా ఉన్నాయి. వీటి ద్వారా రోబోలు ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని దూరం నుంచే అగ్నిమాపక సిబ్బంది ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటారు. –సాక్షి, సెంట్రల్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment