ఈ–పంట తరహాలో ఈ–ఫిష్‌ | Fisheries Officials Created The E Fish App | Sakshi
Sakshi News home page

ఈ–పంట తరహాలో ఈ–ఫిష్‌

Published Fri, Sep 11 2020 8:15 AM | Last Updated on Fri, Sep 11 2020 8:15 AM

Fisheries Officials Created The E Fish App - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాణ్యమైన మత్స్య దిగుబడులను, సాగు విస్తీర్ణాన్ని 2025 నాటికి మూడింతలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సాంకేతిక విధానాల అమలు ద్వారా కలగనున్న ప్రయోజనాలపై రైతులకు అవగాహన కలిగిస్తూ.. ఆ విధానాల అమలుకు ముఖ్యమైన సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రత్యేక యాప్‌ల రూపకల్పన ద్వారా క్షేత్ర స్థాయిలోని పరిస్థితులన్నింటినీ క్షణాల్లో ప్రభుత్వానికి తెలిసేలా చర్యలు తీసుకుంటోంది. ప్రకృతి వైపరీత్యాలు, ప్రస్తుత కోవిడ్‌–19 వంటి విపత్తులో ఆక్వా రైతులకు ఈ యాప్‌ల ద్వారా సత్వరం సేవలు అందుబాటులోకి వస్తాయి. 

ఈ–పిష్‌ : వ్యవసాయ శాఖలోని ఈ–కర్షక్‌ విధానాన్ని పరిశీలించి మత్స్యశాఖ అధికారులు ఈ–ఫిష్‌ యాప్‌ను రూపొందించారు. రాష్ట్రంలో దాదాపు 1.95 లక్షల హెక్టార్లలో చేపలు, రొయ్యలు సాగులో ఉన్నాయి. అయితే గ్రామ, మండల, జిల్లాల వారీగా పంటల వివరాలు నేటికీ లేవు. ఇప్పుడు సర్వే నంబర్లు, రైతుల పేర్లు, సాగులోని వివరాలను యాప్‌ ద్వారా నమోదు చేస్తూ డాష్‌ బోర్డుకు అనుసంధానం చేస్తున్నారు. తద్వారా నష్టపోయినప్పుడు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని వెంటనే అందించవచ్చు.  

మత్స్య సాగుబడి: వ్యవసాయ శాఖలోని పొలంబడిని ఆధారంగా చేసుకుని మత్స్య సాగుబడి యాప్‌ను రూపొందించారు. సాగులో మెళకువలు, అధిక దిగుబడుల కోసం మేత వినియోగం తదితర విషయాల్లో రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ప్రతి ఆర్‌బీకేలో మత్స్య సాగుబడిని ఏర్పాటు చేసి, రైతుల సందేహాలు నివృత్తి చేస్తారు.  

కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు : ఐదు హెక్టార్లలోపు చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య సంపద చెరువులు ఉన్న రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇస్తారు. సమీపంలోని బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిండానికి చర్యలు  తీసుకుంటున్నారు. రైతుల వివరాలు యాప్‌ ద్వారా నమోదు చేసి డాష్‌బోర్డు ద్వారా మత్స్యశాఖ ప్రధాన కార్యాలయానికి అనుసం«ధానం చేస్తున్నారు. తద్వారా ఆక్వా రైతుల పూర్తి వివరాలు తెలుస్తాయి. దీంతో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ ఎస్‌ఎస్‌బీసీ (స్టేట్‌ లెవెల్‌ బ్యాంకర్స్‌ కమిటీ)లో ప్రభుత్వానికి వివరించడానికి అవకాశం ఉంటుంది.  

నీటి నాణ్యత పరీక్షలు : ప్రభుత్వం రాష్ట్ర మత్స్య సహాయకులకు ఇచ్చిన టెస్ట్‌ కిట్‌ల ద్వారా చెరువుల్లోని నీటి నాణ్యతను పరిశీలించి రైతులకు సూచనలు ఇవ్వనున్నారు. రొయ్యలు, చేపల మేత, రోగనిరోధక మందుల వినియోగానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. రైతు భరోసా కేంద్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఆక్వాల్యాబ్స్‌కు వీటిని అనుసంధానం చేస్తారు. 

నీలి విప్లవంలో సాంకేతిక పరిజ్ఞానం 
అంతర్జాతీయ విపణిలో దేశ మత్స్య సంపద విక్రయాలు పెరగాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగించాలి. తీర ప్రాంతంలో మత్స్య సాగుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వం చొరవ వల్ల మత్స్యశాఖ కూడా వినూత్న విధానాలు, శాస్త్ర సాంకేతిక విధానాల అమలు పట్ల మొగ్గు చూపుతోంది. ఇందుకు అనుగుణంగా మా సిబ్బంది, అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. 
– కన్నబాబు, మత్స్య శాఖ కమిషనర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement