సుమితోమో చేతికి ఫుల్లర్‌టన్‌ క్రెడిట్‌ | Japan Sumitomo to buy Fullerton India for Rs 19k crores | Sakshi
Sakshi News home page

సుమితోమో చేతికి ఫుల్లర్‌టన్‌ క్రెడిట్‌

Published Thu, Jul 8 2021 6:46 AM | Last Updated on Thu, Jul 8 2021 6:46 AM

Japan Sumitomo to buy Fullerton India for Rs 19k crores - Sakshi

ముంబై: జపనీస్‌ దిగ్గజం సుమితోమో గ్రూప్‌ ఎన్‌బీఎఫ్‌సీ విభాగం ఫుల్లర్‌టన్‌ ఇండియా క్రెడిట్‌ కంపెనీని సొంతం చేసుకోనుంది. ఇందుకు 2.5 బిలియన్‌ డాలర్ల(రూ. 18,550 కోట్లు) విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా సింగపూర్‌ కంపెనీ ఫుల్లర్‌టన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హోల్డింగ్స్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన ఫుల్లర్‌టన్‌ క్రెడిట్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తొలుత 74.9 శాతం వాటాకుగాను 2 బిలియన్‌ డాలర్లు, తదుపరి మిగిలిన వాటాను పొందేందుకు మరో 50 కోట్ల డాలర్లు వెచ్చించనున్నట్లు తెలియజేశాయి. డీల్‌ తదుపరి గృహ రుణ విభాగం ఫుల్లర్‌టన్‌ ఇండియా హోమ్‌ ఫైనాన్స్‌.. ఫుల్లర్‌టన్‌ క్రెడిట్‌కు సొంత అనుబంధ సంస్థగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

ఫుల్లర్‌టన్‌ క్రెడిట్‌ కథ ఇదీ..: ఫుల్లర్‌టన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ మాతృ సంస్థ సింగపూర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం టెమాసెక్‌ హోల్డింగ్స్‌కాగా.. ఫుల్లర్‌టన్‌ ఇండియా క్రెడిట్‌ 2007లో కార్యకలాపాలు ప్రారంభించింది. 600 పట్టణాలు, 58,000 గ్రామాలలో బిజినెస్‌ను విస్తరించింది. 629 బ్రాంచీలతో 2.3 మిలియన్ల చిన్న బిజినెస్‌లు, రిటైలర్లకు సేవలు అందిస్తోంది. 13,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. డీల్‌ విలువను వెల్లడించనప్పటికీ తొలుత 74.9%, తదుపరి 25.1% వాటా చేతులు మారనున్నట్లు సుమితోమోతోపాటు.. ఫుల్లర్‌టన్‌ ఫైనాన్షి యల్‌ సంయుక్తంగా ప్రకటించాయి. ఈ కొనుగోలు ద్వారా దేశీయంగా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోనున్నట్లు సుమితోమో పే ర్కొంది. అంతేకాకుండా ఆసియావ్యాప్తంగా డిజిటల్‌ సేవలను పటిష్టపరచుకోనున్నట్లు తెలియజేసింది.  

దేశీయంగా ఫుల్లర్‌టన్‌ క్రెడిట్‌లో పెట్టుబడి ద్వారా కన్జూమర్, ఎంఎస్‌ఎంఈ రుణాలలో ఆసియాలో మరింత విస్తరించనున్నట్లు సుమితోమో తెలియజేసింది. దేశీయంగా భారీస్థాయి కన్జూమర్స్, ఎంఎస్‌ఎంఈ కస్టమర్లకు సైతం సేవలు అందించేందుకు వీలు చిక్కుతుందని పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన మూడేళ్ల వ్యాపార ప్రణాళికలో భాగంగా తాజా కొనుగోలు తమ డిజిటల్‌ సేవల విస్తరణకు దోహద పడుతుందని సుమితోమో మిత్సుయి ఫైనాన్షియల్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్, సీఈవో జున్‌ ఓటా తెలియజేశారు. ప్రస్తుతం సుమితోమోకు ఇండొనేసియాలో అనుబంధ సంస్థ ఉంది. ఇతర కంపెనీల కొనుగోళ్ల ద్వారా ఆసియాలో మరింత పటిష్టంకావాలని చూస్తున్నట్లు జున్‌ వెల్లడించారు. అత్యధిక వృద్ధికి వీలున్న భారత్‌ తమకు కీలక మార్కెట్‌ అని పేర్కొన్నారు. 2015లో ప్రారంభమైన ఫుల్లర్‌టన్‌ ఇండియా హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఉద్యోగులు, సొంత ఉపాధి కలిగిన వ్యక్తులకు రుణాలు మంజూరు చేస్తోంది. 23,000 మందికి గృహ రుణాలు విడుదల చేసింది. 650 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement