ప్రేమించడం అందరూ చేస్తారు.. కానీ ఆ ప్రేమను వ్యక్తపరిచేది మాత్రం కొందరే. ప్రేమించిన వ్యక్తితో మాట్లాడటానికి ఉండే సిగ్గు.. భయం.. మొహమాటం.. ఏమంటారో అనే సందేహం.. ఇలా ఏదైనా కావచ్చు.. కొన్ని ప్రేమలు చూపులతో ప్రారంభమై.. చూపులతోనే ఆగిపోతాయి. ఇలాంటి వారి కోసమే జపాన్‌లోని ‘కొకునావీ’ అనే కంపెనీ మేమున్నాం మీకోసం అంటోంది. మీ ప్రేమను మీ తరఫున మేము ప్రపోజ్ చేస్తామంటోంది. మీ ప్రేమ భావాలకు మరింత మెరుగులు దిద్ది.. కవితలుగా మార్చి మీరు ప్రేమించిన వారికి వ్యక్తపరుస్తామని చెబుతోంది. ఇదంతా చూస్తుంటే స్నేహితులకు ప్రేమ లేఖలు ఇచ్చి ప్రేయసి/ప్రియుడికి ఇవ్వమని పంపే విషయం గుర్తుకు వస్తుంది కదూ.. ఇది కూడా అలాంటిదే. కానీ ఇదంతా కొకునావీ ఊరికే ఏం చేయదు. కొంత చార్జ్ చేస్తుంది.
ఇలా ప్రపోజ్ చేయడానికి 3 రకాల ప్యాకేజ్‌లు కూడా ఉన్నాయి వారి దగ్గర. తక్కువ ఖర్చుతో.. సింపుల్‌గా చెప్పాలనుకునే వారికి బేసిక్ ప్లాన్ సరిపోతుందట. ఇక ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు అనుకునేవారికి కొకునావీ సపోర్ట్ ప్లాన్ సరిగ్గా సూట్ అవుతుందని కంపెనీ చెబుతోంది. మరో ప్యాకేజ్ కూడా ఉంది. మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని ఇష్టపడేలా చేసుకోవాలంటే ఈ ప్యాక్ తీసుకోవాల్సిందేనని చెబుతోంది. ఈ ప్యాక్‌లో భాగంగా ఎలా ప్రేమను ప్రపోజ్ చేస్తే ఇష్టపడతారు.. గతంలో లవ్ సక్సెస్ అయిన సందర్భాలు.. ప్రేమ లేఖలో ఎలాంటి కవితలు ఉండాలి.. తదితర విషయాలని డేటా ఎనాలసిస్ సాంకేతికతను ఉపయోగించి ఓ అందమైన ప్రపోజల్‌ను మీ ప్రేయసి/ప్రియుడి ముందు ఉంచుతారు. ఇప్పటికే కొకునావీ సహాయంతో చాలా మంది ఒక్కటయ్యారు. జపాన్‌లో ఈ పద్ధతి చాలా ప్రాచుర్యం పొందడంతో కంపెనీకి బాగా పేరొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment