న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)ను విదేశీ చమురు సంస్థకు విక్రయించాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. దేశంలోనే రెండో అతి పెద్ద రిఫైనరీ, ఇంధన రిటైల్ సంస్థ, బీపీసీఎల్‌లో తనకున్న నియంత్రిత వాటాను విక్రయించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగానే బీపీసీఎల్‌లో తన వాటా(53.3 శాతం)ను విదేశీ సంస్థలకు విక్రయించాలని, తద్వారా భారత ఇంధన రిటైల్ రంగంలోకి బహుళ జాతి సంస్థలను ఆకర్షించాలని కేంద్రం యోచిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ రంగంలో సుదీర్ఘకాలం ప్రభుత్వ రంగ సంస్థలే పెత్తనం చెలాయించాయని, దీనికి స్వస్తి చెప్పడానికి, మరోవైపు ఈ రంగంలో పోటీని పెంచడానికి ఈ చర్య ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 1,05 లక్ష కోట్ల నిధులు సమీకరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీపీసీఎల్‌లో వాటా విక్రయం కారణంగా ఈ లక్ష్యంలో 40 శాతం మొత్తాన్ని సమీకరించే అవకాశముందని అంచనా. (శుక్రవారం నాటి ముగింపు ధరతో పోల్చితే) అలాగే ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేసుకోవాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆర్థిక మందగమనం కారణంగా రెవెన్యూ వసూళ్లు తగ్గడంతో మౌలిక, సంక్షేమ పథకాలకు నిధుల లభ్యత దుర్లభమవుతోంది. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో బీపీసీఎల్ వాటా విక్రయం ఒకింత ఊరటనివ్వగలదని నిపుణుల అంచనా.
ప్రారంభ స్థాయిలోనే చర్చలు..
అయితే విదేశీ సంస్థకు వాటా విక్రయ చర్చలు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయని, ఈ చర్చలు పూర్తవ్వడానికి ఎంతకాలం పడుతుందో స్పష్టత లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బీపీసీఎల్‌ను ఐఓసీకి విక్రయించాలని మొదట్లో ప్రభుత్వం భావించింది. అయితే బీపీసీఎల్‌ను కొనుగోలు చేయడానికి ఐఓసీ మళ్లీ నిధులు సమీకరించాల్సి రావడం తదితర తలనొప్పులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ ఆలోచనను అటకెక్కించింది. గతంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్)లో తన వాటాను కేంద్రం మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీకి విక్రయించిన సంగతి తెలిసిందే. దీనికోసం ఓఎన్‌జీసీ భారీగా నిధులను సమీకరించాల్సి వచి్చంది. ఇక బీపీసీఎల్ వాటా విక్రయానికి ఏ మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుంటుందో ఇంత వరకైతే స్పష్టత లేదని నిపుణులంటున్నారు. అయితే బీపీసీఎల్ ప్రైవేటీకరణకు పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. విదేశీ కంపెనీగా ఉన్న బర్మా షెల్ కంపెనీని కేంద్రం 1970లో జాతీయం చేసి బీపీసీఎల్‌గా పేరు మార్చింది. మళ్లీ బీపీసీఎల్ విదేశీ సంస్థల పరమయ్యే అవకాశాలు ఉండటం విశేషం.
భారత్‌పై చమురు దిగ్గజాల కన్ను...
ఇక పలు బహుళ జాతి సంస్థలు భారత ఇంధన రిటైల్ రంగంపై ఆసక్తి చూపుతున్నాయి. సౌదీ ఆరామ్‌కో, రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ పీజేఎస్‌సీ, టోటల్ ఎస్, షెల్, బ్రిటిష్ పెట్రోలియమ్(బీపీ)లు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్‌లో ఇంధన డిమాండ్ 2040 కల్లా రెట్టింపవ్వగలదని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ అంచనా వేస్తోంది. మరోవైపు ఈ ఏడాది, వచ్చే ఏడాది... ఈ రెండేళ్లలో ప్రపంచంలోనే చమురుకు అత్యంత డిమాండ్ భారత్‌లోనే ఉండగలదని ఇటీవలే ఒపెక్ కూడా తన నెలవారీ ఆయిల్ డిమాండ్ నివేదికలో వెల్లడించింది. దీంతో భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి చమురు బహుళ జాతి సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా విక్రయం ఆ సంస్థలకు ఆయాచిత వరంగా అందివచి్చంది. ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంధన రిటైల్ వ్యాపారంలో 49% వాటాను బీపీ కొనుగోలు చేసిన విషయం విదితమే.
ఈ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో బీపీసీఎల్ షేర్ శుక్రవారం 6.4 శాతం లాభంతో రూ. 409 వద్ద ముగిసింది.
రిఫైనరీల సంఖ్య (నుమాలీగఢ్, బినా, ముంబై, కోచి) =4
దేశవ్యాప్తంగా బంకులు =13,439
భారత్ గ్యాస్ కస్టమర్ల సంఖ్య కోట్లలో=4.2
ఆదాయం రూ. కోట్లలో 2018–19= 3,37,623
2018–19 నికర లాభం రూ. కోట్లలో=7,132
Comments
Please login to add a commentAdd a comment