Oil firms
-
ఆయిల్‌పామ్ రైతులకు రూ.76 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి: మరో హామీని నిలబెట్టుకుని తాను మాట తప్పనని మరోసారి నిరూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయిల్‌పామ్ రైతులకు ఇస్తామన్న నిధులు విడుదల చేశారు. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి ఫ్యాక్టరీలో ఆయిల్‌పామ్ నూనె రికవరీ శాతం 1.72 శాతం తక్కువ ఉంటోంది. తెలంగాణ రైతులతో సమానంగా మన రైతులకు చెల్లిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2018 నవంబర్ నుంచి 2019 అక్టోబర్ వరకు ఒక్కో టన్నుకు ఎంత వ్యత్యాసం ఉందో లెక్కించి.. ఆ మేరకు నష్టపోయే మొత్తాన్ని రైతులకు చెల్లించాలని హార్టీకల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ధరలో వ్యత్యాసం ఏడాదికి రూ.76.01 కోట్లుగా నిర్ణయించి ఆ మొత్తాన్ని ఆయిల్‌పామ్ కంపెనీలకు జమ చేసి రైతులకు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులు, రైతు సంఘాల ఆనందోత్సాహం మద్దతు ధర విషయంలో తమను ఆదుకోవడంపై జాతీయ ఆయిల్‌పాం రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ క్రాంతికుమార్‌రెడ్డి, ఏపీ ఆయిల్‌పాం రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొబ్బా వీరరాఘవరావులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. నిధుల విడుదలకు కృషి చేసిన మంత్రి కన్నబాబు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పారు. జాతీయ స్థాయిలో ఆయిల్‌పామ్‌కు కనీస మద్దతు ధర వర్తింపజేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణతో సమానంగా ధర చెల్లించడంపై రాష్ట్రంలోని ఆయిల్‌పామ్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెదవేగిలోని ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీని ఆధునీకరించి రికవరీ శాతాన్ని పెంచాలని, ప్రస్తుత సిబ్బందిని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఆయిల్‌పామ్ గెలలు టన్నుకు కనీస మద్దతు ధర రూ.12 వేలుగా నిర్ణయించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో 1.75 లక్షల హెక్టార్లలో సాగు 2018 నవంబర్‌లో టన్నుకు వ్యత్యాసం రూ.629, డిసెంబర్లో రూ.623, 2019 జనవరిలో రూ. 590, ఫిబ్రవరిలో రూ.624, మార్చిలో రూ.605, ఏప్రిల్‌లో రూ.617, మేలో రూ.573, జూన్‌లో రూ.571, జూలైలో రూ.572, ఆగస్టులో రూ.610, సెప్టెంబర్‌లో రూ.621, అక్టోబర్‌లో రూ.619గా ఖరారు చేసింది. రాష్ట్రంలో సుమారు 1.75 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పాంను రెండు లక్షల మంది రైతులు సాగుచేస్తున్నారు. దాదాపు 15 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. తెలంగాణలోని అశ్వారావుపేట ఆయిల్ ఫ్యాక్టరీలో వచ్చే రికవరీ శాతానికీ పెదవేగి ఫ్యాక్టరీలో రికవరీకి తేడా ఉంటోందని కొన్నేళ్లుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ తేడా వల్ల తాము నష్టపోతున్నామని రైతులు జగన్‌కు ఫిర్యాదు చేశారు. రైతుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు నిధుల్ని విడుదల చేసినట్టు ఉద్యాన శాఖ కమిషనర్ తెలిపారు. -
బీపీసీఎల్ మళ్లీ ‘విదేశీ’ పరం!
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)ను విదేశీ చమురు సంస్థకు విక్రయించాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. దేశంలోనే రెండో అతి పెద్ద రిఫైనరీ, ఇంధన రిటైల్ సంస్థ, బీపీసీఎల్‌లో తనకున్న నియంత్రిత వాటాను విక్రయించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగానే బీపీసీఎల్‌లో తన వాటా(53.3 శాతం)ను విదేశీ సంస్థలకు విక్రయించాలని, తద్వారా భారత ఇంధన రిటైల్ రంగంలోకి బహుళ జాతి సంస్థలను ఆకర్షించాలని కేంద్రం యోచిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ రంగంలో సుదీర్ఘకాలం ప్రభుత్వ రంగ సంస్థలే పెత్తనం చెలాయించాయని, దీనికి స్వస్తి చెప్పడానికి, మరోవైపు ఈ రంగంలో పోటీని పెంచడానికి ఈ చర్య ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 1,05 లక్ష కోట్ల నిధులు సమీకరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీపీసీఎల్‌లో వాటా విక్రయం కారణంగా ఈ లక్ష్యంలో 40 శాతం మొత్తాన్ని సమీకరించే అవకాశముందని అంచనా. (శుక్రవారం నాటి ముగింపు ధరతో పోల్చితే) అలాగే ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేసుకోవాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆర్థిక మందగమనం కారణంగా రెవెన్యూ వసూళ్లు తగ్గడంతో మౌలిక, సంక్షేమ పథకాలకు నిధుల లభ్యత దుర్లభమవుతోంది. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో బీపీసీఎల్ వాటా విక్రయం ఒకింత ఊరటనివ్వగలదని నిపుణుల అంచనా. ప్రారంభ స్థాయిలోనే చర్చలు.. అయితే విదేశీ సంస్థకు వాటా విక్రయ చర్చలు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయని, ఈ చర్చలు పూర్తవ్వడానికి ఎంతకాలం పడుతుందో స్పష్టత లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బీపీసీఎల్‌ను ఐఓసీకి విక్రయించాలని మొదట్లో ప్రభుత్వం భావించింది. అయితే బీపీసీఎల్‌ను కొనుగోలు చేయడానికి ఐఓసీ మళ్లీ నిధులు సమీకరించాల్సి రావడం తదితర తలనొప్పులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ ఆలోచనను అటకెక్కించింది. గతంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్)లో తన వాటాను కేంద్రం మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీకి విక్రయించిన సంగతి తెలిసిందే. దీనికోసం ఓఎన్జీసీ భారీగా నిధులను సమీకరించాల్సి వచి్చంది. ఇక బీపీసీఎల్ వాటా విక్రయానికి ఏ మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుంటుందో ఇంత వరకైతే స్పష్టత లేదని నిపుణులంటున్నారు. అయితే బీపీసీఎల్ ప్రైవేటీకరణకు పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. విదేశీ కంపెనీగా ఉన్న బర్మా షెల్ కంపెనీని కేంద్రం 1970లో జాతీయం చేసి బీపీసీఎల్‌గా పేరు మార్చింది. మళ్లీ బీపీసీఎల్ విదేశీ సంస్థల పరమయ్యే అవకాశాలు ఉండటం విశేషం. భారత్‌పై చమురు దిగ్గజాల కన్ను... ఇక పలు బహుళ జాతి సంస్థలు భారత ఇంధన రిటైల్ రంగంపై ఆసక్తి చూపుతున్నాయి. సౌదీ ఆరామ్కో, రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ పీజేఎస్సీ, టోటల్ ఎస్, షెల్, బ్రిటిష్ పెట్రోలియమ్(బీపీ)లు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్‌లో ఇంధన డిమాండ్ 2040 కల్లా రెట్టింపవ్వగలదని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ అంచనా వేస్తోంది. మరోవైపు ఈ ఏడాది, వచ్చే ఏడాది... ఈ రెండేళ్లలో ప్రపంచంలోనే చమురుకు అత్యంత డిమాండ్ భారత్‌లోనే ఉండగలదని ఇటీవలే ఒపెక్ కూడా తన నెలవారీ ఆయిల్ డిమాండ్ నివేదికలో వెల్లడించింది. దీంతో భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి చమురు బహుళ జాతి సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా విక్రయం ఆ సంస్థలకు ఆయాచిత వరంగా అందివచి్చంది. ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంధన రిటైల్ వ్యాపారంలో 49% వాటాను బీపీ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో బీపీసీఎల్ షేర్ శుక్రవారం 6.4 శాతం లాభంతో రూ. 409 వద్ద ముగిసింది. రిఫైనరీల సంఖ్య (నుమాలీగఢ్, బినా, ముంబై, కోచి) =4 దేశవ్యాప్తంగా బంకులు =13,439 భారత్ గ్యాస్ కస్టమర్ల సంఖ్య కోట్లలో=4.2 ఆదాయం రూ. కోట్లలో 2018–19= 3,37,623 2018–19 నికర లాభం రూ. కోట్లలో=7,132 -
మళ్లీ పెట్రో ధరల షాక్
న్యూఢిల్లీ: రూపాయి మారకపు విలువ పడిపోవడంతో డీజిల్, పెట్రోల్ ధరలు మరోమారు పెరిగాయి. సోమవారం డీజిల్ ధర లీటరుకు 14 పైసలు, పెట్రోల్ లీటరుకు 13 పైసలు పెరిగినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.69.46 రికార్డు స్థాయి గరిష్టానికి చేరుకుంది. ముంబైలో డీజిల్ ధర రూ.73.74కు చేరింది. ఆగస్టు 16న రూపాయి విలువ పడిపోయినప్పటి నుంచి ఇంధనం ధరలు పెరుగుతున్నాయి. గత నాలుగేళ్లలో పెట్రో ఉత్పత్తులపై పన్నుల ద్వారా కేంద్రానికి వస్తున్న సొమ్ము రూ.99,184 కోట్ల నుంచి రూ.2,29,019 కోట్లకు పెరిగింది. రాష్ట్రాల్లో వ్యాట్ రూ.1,37,157 కోట్ల నుంచి రూ.1,84,091 కోట్లకు పెరిగింది. -
పెట్రో దూకుడు!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత పది రోజులుగా రోజువారీ సవరణలతో ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి. దేశంలోనే తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రెండో స్థానంలో ఉండగా, డీజిల్ ధర ఆల్‌టైమ్ టాప్‌గా మారి రికార్డు సృష్టిస్తోంది. మంగళవారం నాటికి హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.81.43, డీజిల్ ధర రూ.74.00.. అమరావతిలో పెట్రోల్ ధర రూ.83.00, డీజిల్ ధర రూ.75.29 ఉంది. పది రోజులుగా నిత్యం సగటున పెట్రోల్‌పై 15 నుంచి 47 పైసలు, డీజిల్‌పై 23 నుంచి 31 పైసలు పెరిగింది. దేశవ్యాప్తంగా పెట్రో ధర విషయంలో ముంబై తొలిస్థానంలో ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర మంగళవారం నాటికి రూ.84.70గా ఉంది. ఐదేళ్ల నాటి రికార్డు దిశగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 సెప్టెంబర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.83.07 పైసలతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. తాజాగా ఏపీలో పెట్రోల్ ధర రూ.83.00కు పెరిగి ఈ రికార్డును సమీపించింది. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర గరిష్టంగా రూ.72.24, డీజిల్ రూ.61.75 పైసలు పలికింది. అప్పటి నుంచి చమురు సంస్థలు ప్రజలకు నొప్పి తెలియకుండా రోజువారీ ధరల సవరణ పేరిట సైలెంట్‌గా బాదేస్తున్నాయి. ఒకప్పుడు ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించిన చమురు సంస్థలు.. గతేడాది జూన్ నుంచి ఆ విధానానికి స్వస్తి పలికాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు ధరలను నిర్ణయిస్తూ వస్తున్నాయి. -
ముంబైలో లీటరు పెట్రోల్ రూ. 29లే!
చమురు సంస్థలు అమ్మేది ఈ ధరకే.. మిగతాదంతా ప్రభుత్వ బాదుడే దేశంలో పెట్రోల్‌కు అత్యధిక ధర చెల్లించేది ముంబైకర్లే మన హైదరాబాద్‌లోనూ దాదాపు అంతే! ముంబై: దేశంలో పెట్రోల్ ధరలు పెరగడం కొత్త కాదు. కానీ, ముంబై వాసులకు సోమవారం ఊహించనిరీతిలో షాక్ తగిలింది. చమురు కంపెనీలు దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర పెంచకున్నా.. రాష్ట్ర ప్రభుత్వమే కరువు సెస్సు పేరిట రూ. 3 అదనంగా వడ్డించింది. ఈ దెబ్బకు దేశంలోనే పెట్రోల్‌కు అత్యధిక ధర చెల్లిస్తున్న నగరవాసులుగా ముంబైకర్లు నిలిచారు. ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ. 68.26 లభిస్తుండగా.. అంతకన్నా పది రూపాయలు ఎక్కువగా ముంబైవాసులు చెల్లించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధానిలో లీటరు పెట్రోల్ ధర రూ. 77.50లకు లభిస్తోంది. ఈ పెట్రోల్ వాతపై ముంబై వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ముడిచమురు ధరలు, డాలర్-రూపాయి ఎక్స్చేంజ్ రేట్లు చూసుకుంటే మార్కెటింగ్ చార్జీలు కలుపుకొని చమురు సంస్థలు రూ. 29లకే లీటరు పెట్రోల్‌ను డీలర్లకు అందజేస్తున్నాయి. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాదే పన్నులు, సెస్సులతో కలిపి ఈ ధర ఏకంగా 77.50 రూపాయలకు చేరింది. అంటే మార్కెట్ ధర కంటే రూ. 47.93 అధికమొత్తాన్ని వినియోగదారులు పన్నులు, సుంకాల రూపంలో చెల్లిస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్, సెస్సులు, పెట్రోల్ బంకు యజమానుల కమిషన్ ఉంటుంది. అసలు ధర కన్నా 153శాతం మొత్తాన్ని పన్నుల రూపంలో పెట్రోల్ వినియోగదారులపై భారం పడుతోంది. ముంబైలో పన్నులు ధరలు ఓసారి చూస్తే.. రవాణా చార్జీలతో కలుపుకొని బ్యారెల్ ముడిచమురు ధర : 65.34 (డాలర్ల రూపంలో) సగటు డాలర్ మార్పిడి ధర : రూ. 64.76 లీటరుకు రూపాయలలో రిఫైనరీలకు చమురు సంస్థలు చెల్లించే ధర 26.86 చమురు కంపెనీ ఆపరేటింగ్/మార్కెటింగ్ చార్జీలు 2.68 కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ 21.48 ముంబై అక్ట్రోయ్ 1.10 రవాణా వ్యయం 0.20 రూ. 9 సెస్సు కలుపుకొని రాష్ట్ర వ్యాట్ 26శాతం 22.60 డీలర్ కమిషన్ 2.50 మొత్తం 77.50 దాదాపు దేశవ్యాప్తంగా ఇదేరీతిలో పెట్రోల్ వినియోగదారులపై పన్నులవాత మోత మోగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా ఆదాయాన్ని పెంచుకోవడానికి పెట్రో ఉత్పత్తులను ప్రధాన వనరుగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ రూ. 72. 66లకు లభిస్తోంది. దాదాపు ముంబైరీతిలోనే హైదరాబాద్‌లోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ వినియోగదారులపై పన్నుల మోత మోగుతోంది. మరోవైపు పెట్రోల్ ధర పెరిగిన ప్రతిసారి మధ్య, దిగువ తరగతి జీవులకు మరింతగా ఇబ్బందులు తప్పడం లేదు. నిజానికి వెనుకబడిన దేశాలైన మన పొరుగుదేశాల్లోనే పెట్రోల్ ధరలు చాలా తక్కువగా ఉండటం గమనార్హం. పాకిస్థాన్‌లో రూ. 43.68లకు, శ్రీలంకలో రూ. 50.95, నేపాల్‌లో రూ. 64.24, బంగ్లాదేశ్ లో రూ. 70.82 లకు లీటరు పెట్రోల్ లభిస్తోంది.