
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత పది రోజులుగా రోజువారీ సవరణలతో ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి. దేశంలోనే తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రెండో స్థానంలో ఉండగా, డీజిల్ ధర ఆల్‌టైమ్ టాప్‌గా మారి రికార్డు సృష్టిస్తోంది. మంగళవారం నాటికి హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.81.43, డీజిల్ ధర రూ.74.00.. అమరావతిలో పెట్రోల్ ధర రూ.83.00, డీజిల్ ధర రూ.75.29 ఉంది. పది రోజులుగా నిత్యం సగటున పెట్రోల్‌పై 15 నుంచి 47 పైసలు, డీజిల్‌పై 23 నుంచి 31 పైసలు పెరిగింది. దేశవ్యాప్తంగా పెట్రో ధర విషయంలో ముంబై తొలిస్థానంలో ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర మంగళవారం నాటికి రూ.84.70గా ఉంది.
ఐదేళ్ల నాటి రికార్డు దిశగా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 సెప్టెంబర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.83.07 పైసలతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. తాజాగా ఏపీలో పెట్రోల్ ధర రూ.83.00కు పెరిగి ఈ రికార్డును సమీపించింది. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర గరిష్టంగా రూ.72.24, డీజిల్ రూ.61.75 పైసలు పలికింది. అప్పటి నుంచి చమురు సంస్థలు ప్రజలకు నొప్పి తెలియకుండా రోజువారీ ధరల సవరణ పేరిట సైలెంట్‌గా బాదేస్తున్నాయి. ఒకప్పుడు ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించిన చమురు సంస్థలు.. గతేడాది జూన్ నుంచి ఆ విధానానికి స్వస్తి పలికాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు ధరలను నిర్ణయిస్తూ వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment