ఆయిల్‌పామ్‌ రైతులకు రూ.76 కోట్లు విడుదల | Rs 76 crore released to oil palm farmers | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ రైతులకు రూ.76 కోట్లు విడుదల

Published Thu, Jan 30 2020 4:12 AM | Last Updated on Thu, Jan 30 2020 4:12 AM

Rs 76 crore released to oil palm farmers - Sakshi

సాక్షి, అమరావతి: మరో హామీని నిలబెట్టుకుని తాను మాట తప్పనని మరోసారి నిరూపించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయిల్‌పామ్‌ రైతులకు ఇస్తామన్న నిధులు విడుదల చేశారు. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి ఫ్యాక్టరీలో ఆయిల్‌పామ్‌ నూనె రికవరీ శాతం 1.72 శాతం తక్కువ ఉంటోంది. తెలంగాణ రైతులతో సమానంగా మన రైతులకు చెల్లిస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2018 నవంబర్‌ నుంచి 2019 అక్టోబర్‌ వరకు ఒక్కో టన్నుకు ఎంత వ్యత్యాసం ఉందో లెక్కించి.. ఆ మేరకు నష్టపోయే మొత్తాన్ని రైతులకు చెల్లించాలని హార్టీకల్చర్‌ కమిషనర్‌ చిరంజీవి చౌదరీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ధరలో వ్యత్యాసం ఏడాదికి రూ.76.01 కోట్లుగా నిర్ణయించి ఆ మొత్తాన్ని ఆయిల్‌పామ్‌ కంపెనీలకు జమ చేసి రైతులకు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.  

రైతులు, రైతు సంఘాల ఆనందోత్సాహం 
మద్దతు ధర విషయంలో తమను ఆదుకోవడంపై జాతీయ ఆయిల్‌పాం రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ క్రాంతికుమార్‌రెడ్డి, ఏపీ ఆయిల్‌పాం రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొబ్బా వీరరాఘవరావులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. నిధుల విడుదలకు కృషి చేసిన మంత్రి కన్నబాబు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పారు. జాతీయ స్థాయిలో ఆయిల్‌పామ్‌కు కనీస మద్దతు ధర వర్తింపజేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణతో సమానంగా ధర చెల్లించడంపై రాష్ట్రంలోని ఆయిల్‌పామ్‌ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెదవేగిలోని ఆయిల్‌ ఫెడ్‌ ఫ్యాక్టరీని ఆధునీకరించి రికవరీ శాతాన్ని పెంచాలని, ప్రస్తుత సిబ్బందిని ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయిల్‌పామ్‌ గెలలు టన్నుకు కనీస మద్దతు ధర రూ.12 వేలుగా నిర్ణయించాలని కోరుతున్నారు.

రాష్ట్రంలో 1.75 లక్షల హెక్టార్లలో సాగు 
2018 నవంబర్‌లో టన్నుకు వ్యత్యాసం రూ.629, డిసెంబర్‌లో రూ.623, 2019 జనవరిలో రూ. 590, ఫిబ్రవరిలో రూ.624, మార్చిలో రూ.605, ఏప్రిల్‌లో రూ.617, మేలో రూ.573, జూన్‌లో రూ.571, జూలైలో రూ.572, ఆగస్టులో రూ.610, సెప్టెంబర్‌లో రూ.621, అక్టోబర్‌లో రూ.619గా ఖరారు చేసింది. రాష్ట్రంలో సుమారు 1.75 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పాంను రెండు లక్షల మంది రైతులు సాగుచేస్తున్నారు. దాదాపు 15 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. తెలంగాణలోని అశ్వారావుపేట ఆయిల్‌ ఫ్యాక్టరీలో వచ్చే రికవరీ శాతానికీ పెదవేగి ఫ్యాక్టరీలో రికవరీకి తేడా ఉంటోందని కొన్నేళ్లుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ తేడా వల్ల తాము నష్టపోతున్నామని రైతులు జగన్‌కు ఫిర్యాదు చేశారు. రైతుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు నిధుల్ని విడుదల చేసినట్టు ఉద్యాన శాఖ కమిషనర్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement