న్యూఢిల్లీ: నష్టాలు, రుణాల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం జోరుగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్ల ఆసక్తిని అంచనా వేసేందుకు ఇటీవలే సింగపూర్, లండన్‌లో రోడ్‌షోలు నిర్వహించింది. అయితే, ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంతమాత్రంగానే వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ, ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రతిపాదనపై దీని ప్రభావం ఉండబోదని, ముందస్తుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారమే విక్రయ ప్రక్రియ ప్రణాళిక కొనసాగుతుందని అధికారి పేర్కొన్నారు. ‘సింగపూర్, లండన్‌లలో నిర్వహించిన రోడ్‌షోలకు పెద్దగా స్పందన కనిపించలేదు. కొందరు ఇన్వెస్టర్లు మాత్రమే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో .. ఎయిరిండియా కొనుగోలుపై ఇన్వెస్టర్ల ఆసక్తి.. ఆలోచనలో పడేసేదిగా ఉంది‘ అని తెలిపారు. విదేశా ల్లోని రోడ్‌షోల్లో వచ్చిన స్పందన బట్టి చూస్తే.. ఎయిరిండియా వేలంలో పెద్ద స్థాయిలో బిడ్లు రాకపోవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
షెడ్యూల్ ప్రకారం విక్రయ ప్రక్రియ ..
అయితే, దేశీయంగా ముంబైలో నిర్వహించిన రోడ్‌షోల్లో ఇన్వెస్టర్ల నుంచి కాస్త ఆశావహ స్పందన కనిపించిందని మరో అధికారి చెప్పారు. ఇదే ఊతంతో.. ఎయిరిండియా విక్రయానికి సంబంధించి తుది బిడ్డింగ్ డాక్యుమెంట్లను ఖరారు చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం పండుగ సీజన్ తర్వాత జనవరిలో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ)ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు అధికారి తెలిపారు. అప్పుడైతే విదేశీ ఇన్వెస్టర్లు కూడా కాస్త పెద్ద సంఖ్యలో పాల్గొనవచ్చని భావిస్తున్నట్లు వివరించారు.
విదేశీ ఎయిర్‌లైన్స్‌కు ఎఫ్‌డీఐ అడ్డంకులు..
ఎయిరిండియా కొనుగోలు ప్రక్రియలో విదేశీ ఎయిర్‌లైన్స్ పాల్గొనడానికి లేకుండా నిబంధనలు ప్రతిబంధకంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం భారతీయ విమానయాన సంస్థల్లో విదేశీ ఎయిర్‌లైన్స్ 49 శాతానికి మించి వాటాలు కొనుగోలు చేయడానికి లేదు. ఒకవేళ కొనదల్చుకున్న పక్షంలో ఏదైనా భారతీయ భాగస్వామ్య సంస్థతో కలిసి బిడ్ చేయాల్సి ఉంటుంది. సదరు భారతీయ భాగస్వామ్య సంస్థ 51 శాతం, విదేశీ ఎయిర్‌లైన్స్ 49 శాతం వాటాలు కొనుగోలు చేయొచ్చు. కానీ ఎయిరిండియా విషయంలో భారత సంస్థలతో జట్టు కట్టే ఆలోచనేదీ విదేశీ ఎయిర్‌లైన్స్‌కు లేనట్లు తెలుస్తోంది.
మరోవైపు, విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ప్రతిబంధకంగా ఉన్న ఈ నిబంధనను సడలించడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎయిరిండియాను కొనుగోలు చేసే విదేశీ ఇన్వెస్టర్లకు కాస్త చెప్పుకోతగ్గ స్థాయిలో యాజమాన్య హక్కులు దక్కేలా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి అభిప్రాయాలకూ ప్రాధాన్యం లభించేలా నిబంధనను సవరించే అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి. గత నెల నవంబర్‌లో విమానయాన శాఖ, పరిశ్రమలు.. అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం మధ్య జరిగిన సమావేశంలో ఇది చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా విక్రయానికి గతంలో ఒకసారి ప్రయత్నించినప్పటికీ.. ఇన్వెస్టర్ల నుంచి స్పందన కరువవడంతో సదరు ప్రతిపాదనపై ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 2007–08లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌తో విలీనమైన తర్వాత నుంచి ఎయిరిండియా నష్టాల్లో కొనసాగుతోంది. 2018–19లో ఎయిరిండియా నష్టాలు సుమారు రూ. 8,556 కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రుణభారం రూ. 58,351 కోట్ల మేర ఉంది. కంపెనీని గట్టెక్కించడానికి 2011–12 నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం రూ. 30,520 కోట్ల దాకా సమకూర్చింది.
Comments
Please login to add a commentAdd a comment