
సాక్షి, చెన్నై: తమిళనాట వంద రోజుల్లో ఎన్నికలొస్తే రాజకీయాల్లోకి వస్తా.. వాటిని ఒంటరిగానే ఎదుర్కొనేందుకు సిద్ధం.. అంటూ సినీహీరో కమల్‌హాసన్ చెప్పారు. కమల్ తాజా వ్యాఖ్యలతో ఆయన రాజకీయ ప్రవేశంపై చర్చమొదలైంది. శుక్రవారం ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఓ బలవంతపు పెళ్లితో పోల్చారు. అన్నాడీఎంకే పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నట్టు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో వంద రోజుల్లోపు ఎన్నికలొస్తే.. రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమని, ఒంటరిగానే ఆ ఎన్నికలను ఎదుర్కొంటానని ధీమా వ్యక్తంచేశారు. రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారు.. పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారు.. తదితర ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. రజనీకాంత్‌తో తరచూ రాజకీయాలపై మాట్లాడుతూ ఉంటానని చెప్పారు. ‘ఆయన మార్గం వేరు.. నా మార్గం వేరు’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. కమల్ వ్యాఖ్యలు డొంక తిరుగుడుగా ఉండటంతో రాజకీయాల్లోకి వస్తారా.. లేదా అనే దానిపై చర్చ మొదలైంది.
‘స్వచ్ఛతే సేవ’కు రజనీకాంత్ మద్దతు
ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛతే సేవ’ మిషన్‌కు సూపర్‌స్టార్ రజనీకాంత్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా చేపడుతున్న ఈ మిషన్ ‘పరిశుభ్రతే పరమాత్మ’ అని చాటుతోందని రజనీ ట్వీటర్‌లో పేర్కొన్నారు.