
విశ్వరూపం కంటే బెటర్‌గా..
విశ్వ నటుడు కమలహాసన్ ఇంతకు ముందు నటించిన విశ్వరూపం చిత్రం పలు ఆవరోధాలను అధిగమించి తెరపైకి వచ్చి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా కమలహాసన్ తెరకెక్కిస్తున్న విశ్వరూపం–2 చిత్రం కూడా ఆర్థిక సమస్యల వంటి పలు ఆటంకాలను ఎదుర్కొంది. కాగా అలాంటి వాటన్నింటిని చేధించుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం కమల్ తన తాజా చిత్రం శభాష్ నాయుడు చిత్రాన్ని పక్కన పెట్టి విశ్వరూపం–2 చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి మరింత మెరుగులు దిద్దే పనిలో భాగంగా ప్యాచ్ వర్క్ షూటింగ్‌ను స్థానిక పూందమల్లిలోని గోకుల్ స్టూడియోలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రం గురించి తెలుపుతూ విడుదల తేదీ ఇంకా నిర్ణయంచలేదు గానీ, త్వరలోనే అందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. విశ్వరూపం చిత్రానికి మించి విశ్వరూపం–2 ఉంటుందని పేర్కొన్నారు.