క్యారెక్టర్ డిమాండ్‌ని బట్టి గెటప్ మారుతుంది. ఒక్కోసారి మేల్ ‘ఫీమేల్’గా మారాల్సి వస్తుంది. ఫీమేల్ ‘మేల్’గా మారాల్సి వస్తుంది. అలా క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఇద్దరు హిందీ హీరోలు ఫీమేల్ గెటప్‌లోకి మారారు. ఇటు సౌత్‌లో ఇద్దరు హీరోలు లేడీ గెటప్స్‌లోకి మారనున్నారు. ఆ ఫీ‘మేల్’ విశేషాలు...
ఆయుష్‌ఉమన్
‘‘అయ్య బాబోయ్.. స్త్రీ పాత్ర చేయడం అంత ఈజీ కాదండోయ్’’ అంటున్నారు ఆయుష్మాన్ ఖురానా. ‘డ్రీమ్ గర్ల్ 2’లో తను చేసిన పూజ పాత్ర గురించే ఆయన అలా అన్నారు. ‘అంధాధున్’లో అంధుడిగా, ‘బాలా’లో బట్టతల ఉన్న యువకుడిగా.. ఇలా వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన ఆయుష్మాన్ ‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్రంలో కరణ్‌వీర్ అనే యువకుడిగా, పూజ అనే యువతిగా కనిపించనున్నారు. 2019లో ఆయుష్మాన్ హీరోగా నటించిన ‘డ్రీమ్ గర్ల్’కి ఇది సీక్వెల్. తొలి భాగాన్ని తెరకెక్కించిన రాజ్ షాండిల్యానే మలి భాగానికి కూడా దర్శకత్వం వహించారు.
ఫస్ట్ పార్ట్‌లోనూ పూజ పాత్రలో కనిపించిన ఆయుష్మాన్ సెకండ్ పార్ట్‌లోనూ ఆ పాత్ర చేశారు. ఓ చిన్న పట్టణానికి చెందిన కరణ్ తన తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి కష్టాలుపడుతుంటాడు. అతని ప్రేయసి పరీ (అనన్యా పాండే). అయితే ఆమెను పెళ్లాడటానికి పరీ తండ్రి కరణ్‌కి కొన్ని నిబంధనలు పెడతాడు. తన ముందున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి పూజాగా మారతాడు కరణ్. ఇలా కష్టాల కరణ్‌గా, నవ్వులు పూయించే పూజాగా ఆయుష్మాన్ నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ ఈ నెల 25న విడుదల కానుంది. కాగా.. ‘‘స్త్రీ వేషం చాలా సవాల్‌గా అనిపించింది. ముఖ్యంగా ఎండల్లో విగ్ పెట్టుకుని నటించడం కష్టంగా అనిపించింది. ఈ ఆయుష్‘మాన్’ చేసిన ఆయుష్‘ఉమన్’ని ఇష్టపడతారని ఆశిస్తున్నాను’’ అన్నారు ఆయుష్.
అమ్మాయిగా ఆలోచించాలి
‘‘ఫీమేల్ ఆర్టిస్టులు వ్యానిటీ వేన్ నుంచి బయటకు రావడానికి అన్నేసి గంటలు ఎందుకు పడుతుందో నాకిప్పుడు అర్థమైంది. మేల్ ఆర్టిస్ట్‌ల మేకప్‌తో పోల్చితే ఫీమేల్‌కి చాలా ఎక్కువ టైమ్ పడుతుంది. నేను చేసిన స్త్రీ పాత్ర మేకప్‌కి మూడు గంటలు పట్టేది’’ అని నవాజుద్దీన్ సిద్ధిఖీ అంటున్నారు. ‘హడ్డీ’ చిత్రంలో తాను చేసిన లేడీ క్యారెక్టర్ గురించే నవాజుద్దీన్ ఈ విధంగా అన్నారు. అక్షయ్ అజయ్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఓ చిన్న పట్టణానికి చెందిన హరి అనే యువకుడికి అమ్మాయిగా మారాలనే ఆకాంక్ష ఉంటుంది. లింగ మార్పిడి గురించి ఈ చిత్రంలో చూపించారు. ‘‘అమ్మాయి పాత్ర చేయడానికి అమ్మాయిలా మేకప్ వేసుకుంటే చాలదు.. అమ్మాయిలానే ఆలోచించాలి. నేను అలానే చేశాను’’ అంటూ ఈ పాత్రలో తానెంతగా లీనమయ్యారో చెప్పారు నవాజుద్దీన్. ఇదిలా ఉంటే... వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’లో ఆయన విలన్‌గా నటిస్తున్నారు. తెలుగులో నవాజుద్దీన్‌కి ఇది తొలి చిత్రం.
పదిహేనేళ్ల తర్వాత...
వైవిధ్యమైన పాత్రలకు చిరునామా కమల్‌హాసన్. ఫిజికల్లీ చాలెంజ్డ్, చిన్న వయసులో వృద్ధుడిగా, ఎత్తు పళ్లు, వృద్ధురాలిగా.. ఇలా క్యారెక్టర్ డిమాండ్ మేరకు మౌల్డ్ అవుతారు కమల్‌హాసన్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లోనే వచ్చిన ‘ఇండియన్’ (1996) చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో కమల్ యువకుడిగా, వృద్ధుడిగా కనిపించనున్నారని తెలిసిందే. కొన్ని సన్నివేశాల్లో స్త్రీగానూ కనిపించనున్నారన్నది తాజా సమాచారం. ఇదే నిజమైతే పదిహేనేళ్ల తర్వాత కమల్ స్త్రీ వేషంలో కనిపించినట్లు అవుతుంది. గతంలో కమల్‌హాసన్ ‘భామనే సత్యభామనే’ (1996), ‘దశావతారం’ (2008)లో లేడీ గెటప్‌లో కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ‘ఇండియన్ 2’ విషయానికి వస్తే.. ఓ సమస్య పరిష్కారానికి కమల్ స్త్రీ వేషంలోకి మారతారని టాక్.
లేడీ గెటప్ పై ఫోకస్
విశ్వక్ సేన్‌లో మంచి నటుడు–దర్శకుడు ఉన్న విషయాన్ని నిరూపించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. ఆ తర్వాత ‘హిట్’, ‘పాగల్’... ఇలా హీరోగా ఒకదానికి ఒకటి పోలిక లేని చిత్రాలు చేస్తున్న విశ్వక్ ఆ మధ్య ఓ సినిమా ప్రమోషన్ సమయంలో తాను ఒక సినిమాలో లేడీ గెటప్‌లో కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అయితే జస్ట్ కొన్ని సన్నివేశాల్లో అలా కనిపించి మాయం కాకుండా సినిమా సెకండాఫ్ మొత్తం ఆ గెటప్‌లోనే కనిపించనున్నారని సమాచారం. అందుకే ఈ చిత్రానికి ‘లీల’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని భోగట్టా. ఈ చిత్రం గురించి, ఈ పాత్ర గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం విశ్వక్ ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గామి’తో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నారు. మరి.. వీటిలో ఏదైనా సినిమాలో లేడీ గెటప్ ఉంటుందా? లేక వార్తల్లో ఉన్న ప్రకారం ‘లీల’ అనే సినిమా ఉంటుందా? అనే క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment