Female character
-
ఫీమేల్ గెటప్‌లో మెప్పించేందుకు ప్లాన్ చేస్తున్న హీరోలు
క్యారెక్టర్ డిమాండ్‌ని బట్టి గెటప్ మారుతుంది. ఒక్కోసారి మేల్ ‘ఫీమేల్’గా మారాల్సి వస్తుంది. ఫీమేల్ ‘మేల్’గా మారాల్సి వస్తుంది. అలా క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఇద్దరు హిందీ హీరోలు ఫీమేల్ గెటప్‌లోకి మారారు. ఇటు సౌత్‌లో ఇద్దరు హీరోలు లేడీ గెటప్స్‌లోకి మారనున్నారు. ఆ ఫీ‘మేల్’ విశేషాలు... ఆయుష్ఉమన్ ‘‘అయ్య బాబోయ్.. స్త్రీ పాత్ర చేయడం అంత ఈజీ కాదండోయ్’’ అంటున్నారు ఆయుష్మాన్ ఖురానా. ‘డ్రీమ్ గర్ల్ 2’లో తను చేసిన పూజ పాత్ర గురించే ఆయన అలా అన్నారు. ‘అంధాధున్’లో అంధుడిగా, ‘బాలా’లో బట్టతల ఉన్న యువకుడిగా.. ఇలా వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన ఆయుష్మాన్ ‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్రంలో కరణ్వీర్ అనే యువకుడిగా, పూజ అనే యువతిగా కనిపించనున్నారు. 2019లో ఆయుష్మాన్ హీరోగా నటించిన ‘డ్రీమ్ గర్ల్’కి ఇది సీక్వెల్. తొలి భాగాన్ని తెరకెక్కించిన రాజ్ షాండిల్యానే మలి భాగానికి కూడా దర్శకత్వం వహించారు. ఫస్ట్ పార్ట్‌లోనూ పూజ పాత్రలో కనిపించిన ఆయుష్మాన్ సెకండ్ పార్ట్‌లోనూ ఆ పాత్ర చేశారు. ఓ చిన్న పట్టణానికి చెందిన కరణ్ తన తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి కష్టాలుపడుతుంటాడు. అతని ప్రేయసి పరీ (అనన్యా పాండే). అయితే ఆమెను పెళ్లాడటానికి పరీ తండ్రి కరణ్‌కి కొన్ని నిబంధనలు పెడతాడు. తన ముందున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి పూజాగా మారతాడు కరణ్. ఇలా కష్టాల కరణ్‌గా, నవ్వులు పూయించే పూజాగా ఆయుష్మాన్ నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ ఈ నెల 25న విడుదల కానుంది. కాగా.. ‘‘స్త్రీ వేషం చాలా సవాల్‌గా అనిపించింది. ముఖ్యంగా ఎండల్లో విగ్ పెట్టుకుని నటించడం కష్టంగా అనిపించింది. ఈ ఆయుష్‘మాన్’ చేసిన ఆయుష్‘ఉమన్’ని ఇష్టపడతారని ఆశిస్తున్నాను’’ అన్నారు ఆయుష్. అమ్మాయిగా ఆలోచించాలి ‘‘ఫీమేల్ ఆర్టిస్టులు వ్యానిటీ వేన్ నుంచి బయటకు రావడానికి అన్నేసి గంటలు ఎందుకు పడుతుందో నాకిప్పుడు అర్థమైంది. మేల్ ఆర్టిస్ట్‌ల మేకప్‌తో పోల్చితే ఫీమేల్‌కి చాలా ఎక్కువ టైమ్ పడుతుంది. నేను చేసిన స్త్రీ పాత్ర మేకప్‌కి మూడు గంటలు పట్టేది’’ అని నవాజుద్దీన్ సిద్ధిఖీ అంటున్నారు. ‘హడ్డీ’ చిత్రంలో తాను చేసిన లేడీ క్యారెక్టర్ గురించే నవాజుద్దీన్ ఈ విధంగా అన్నారు. అక్షయ్ అజయ్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఓ చిన్న పట్టణానికి చెందిన హరి అనే యువకుడికి అమ్మాయిగా మారాలనే ఆకాంక్ష ఉంటుంది. లింగ మార్పిడి గురించి ఈ చిత్రంలో చూపించారు. ‘‘అమ్మాయి పాత్ర చేయడానికి అమ్మాయిలా మేకప్ వేసుకుంటే చాలదు.. అమ్మాయిలానే ఆలోచించాలి. నేను అలానే చేశాను’’ అంటూ ఈ పాత్రలో తానెంతగా లీనమయ్యారో చెప్పారు నవాజుద్దీన్. ఇదిలా ఉంటే... వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’లో ఆయన విలన్‌గా నటిస్తున్నారు. తెలుగులో నవాజుద్దీన్‌కి ఇది తొలి చిత్రం. పదిహేనేళ్ల తర్వాత... వైవిధ్యమైన పాత్రలకు చిరునామా కమల్‌హాసన్. ఫిజికల్లీ చాలెంజ్డ్, చిన్న వయసులో వృద్ధుడిగా, ఎత్తు పళ్లు, వృద్ధురాలిగా.. ఇలా క్యారెక్టర్ డిమాండ్ మేరకు మౌల్డ్ అవుతారు కమల్‌హాసన్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లోనే వచ్చిన ‘ఇండియన్’ (1996) చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో కమల్ యువకుడిగా, వృద్ధుడిగా కనిపించనున్నారని తెలిసిందే. కొన్ని సన్నివేశాల్లో స్త్రీగానూ కనిపించనున్నారన్నది తాజా సమాచారం. ఇదే నిజమైతే పదిహేనేళ్ల తర్వాత కమల్ స్త్రీ వేషంలో కనిపించినట్లు అవుతుంది. గతంలో కమల్‌హాసన్ ‘భామనే సత్యభామనే’ (1996), ‘దశావతారం’ (2008)లో లేడీ గెటప్‌లో కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ‘ఇండియన్ 2’ విషయానికి వస్తే.. ఓ సమస్య పరిష్కారానికి కమల్ స్త్రీ వేషంలోకి మారతారని టాక్. లేడీ గెటప్ పై ఫోకస్ విశ్వక్ సేన్లో మంచి నటుడు–దర్శకుడు ఉన్న విషయాన్ని నిరూపించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. ఆ తర్వాత ‘హిట్’, ‘పాగల్’... ఇలా హీరోగా ఒకదానికి ఒకటి పోలిక లేని చిత్రాలు చేస్తున్న విశ్వక్ ఆ మధ్య ఓ సినిమా ప్రమోషన్ సమయంలో తాను ఒక సినిమాలో లేడీ గెటప్‌లో కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అయితే జస్ట్ కొన్ని సన్నివేశాల్లో అలా కనిపించి మాయం కాకుండా సినిమా సెకండాఫ్ మొత్తం ఆ గెటప్‌లోనే కనిపించనున్నారని సమాచారం. అందుకే ఈ చిత్రానికి ‘లీల’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని భోగట్టా. ఈ చిత్రం గురించి, ఈ పాత్ర గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం విశ్వక్ ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గామి’తో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నారు. మరి.. వీటిలో ఏదైనా సినిమాలో లేడీ గెటప్ ఉంటుందా? లేక వార్తల్లో ఉన్న ప్రకారం ‘లీల’ అనే సినిమా ఉంటుందా? అనే క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
సుమంగళి నుంచి ఫిదా వరకు
సాహిత్యానికి కొంత స్వేచ్ఛ ఉంది. సినిమా జనామోదానికి లోబడి ఉండాలి. జనం, అనగా పురుషులు, అనగా పురుష భావజాలం తమపై ఉందని తెలియని స్త్రీలు కూడా మెచ్చే సినిమాలు తీస్తేనే డబ్బులు వస్తాయి. తెలుగు సినిమా స్త్రీ పాత్రను పాపులర్ జనాభిప్రాయాల మేరకే చూపింది. అయినా కొన్నిసార్లు వెండి తెర మీద స్త్రీ పాత్రలు కాస్త వెలుతురు చూశాయి. కొన్ని మాటలు చెప్పాయి. తమ ముఖం చూపడానికి చిన్న అద్దాలు వద్దని చెప్పాయి. తెలుగు సినిమాల్లో స్త్రీలు ఏం చెప్పారు? తెలుగు సినిమాలు స్త్రీలకు ఏం చెప్పాయి. ప్రత్యేక కథనం. ‘సతీ’ అనే పదం ఉండాలి టైటిల్లో. సినిమాను మహిళా ప్రేక్షకులకు అలవాటు చేయడానికి సినిమా మొదలైన కొత్తల్లో సినిమా వారు చేసిన పని అది. ‘సతీ అనసూయ’,‘సతీ సావిత్రి’, ‘సతి సుమతి’... దేశ వ్యాప్తంగా ‘సతి‘ సినిమాలు వచ్చాయి. తెలుగులో ‘సతి తులసి’ కూడా తీశారు. ‘సతి’ ఏం చేయాలి? పతిని శిరసావహించాలి. కథలు సోషలైజ్ అయ్యాక కూడా ఇదే భావధారను తెలుగు సినిమా జనామోదం కోసం తీస్తూ వెళ్లారు. భర్త ప్రాణాల కోసం యమునితో పోరాడిన సతి ఉంది కాని భార్య ప్రాణాల కోసం పోరాడిన పతి లేడు. ∙∙∙ ‘శ్రీ లక్ష్మమ్మ కథ’ (1950) తెలుగు సినిమాల్లో స్త్రీలు ఎలా ఉండాలో గట్టిగా సుబోధ చేసిన చిత్రం. అక్కినేని, అంజలి దేవి నటించిన ఈ సినిమాలో అక్కినేని స్త్రీలోలుడిగా మారితే అంజలి దేవి అత్తారింటికి చేరి ఒక్కగానొక్క కూతురితో నానా బాధలు పడుతుంది. అయినా అక్కినేని మారడు. అయితే ఆమె సతి ధర్మాన్ని వీడదు. చివరకు ఆమెను బాధించినందుకు అక్కినేనికి కళ్లుపోతే ఆ కళ్లు తన ప్రార్థనా బలంతో రప్పించి ప్రాణాలు విడిచి దేవతలా కొలుపులు అందుకుంటుంది. శ్రీ లక్ష్మమ్మ మహిళా ప్రేక్షకులకు ఇలవేల్పు. చూడండి... భర్త తనకు దక్కకపోయినా భార్య భర్త కోసమే జీవించాలి. తన సుఖానికి పనికి రాకపోయినా భర్త కోసమే జీవించాలి. ‘సుమంగళి’ (1965) కథ ఇదే మాట చెబుతుంది. ఇందులో సావిత్రిని పెళ్లి చేసుకున్నాక అక్కినేనికి యాక్సిడెంట్ అవుతుంది. అతను వైవాహిక జీవితానికి పనికి రాడు. యోగ్యమైన వయసులో ఉన్న సావిత్రి భర్తనే సర్వస్వం అనుకుంటూ ఉంటుంది. ఆమె బాధ చూడలేక అక్కినేని అవస్థ పడతాడు. ఆమెకు మరో పెళ్లి చేయాలని ప్రయత్నిస్తాడు. భారతీయ వ్యవస్థలో స్త్రీ వివాహాన్ని ఎంత గౌరవించాలో చెబుతూ సుమంగళిగా వెళ్లిపోవడానికి సావిత్రి ఆత్మహత్య చేసుకుంటుంది. పై రెండు సినిమాల్లోనూ భార్యలు మరణించారు. భర్తలు జీవించారు. స్త్రీ సమస్యలను తెలుగు సినిమా పట్టించుకోలేదు. బహుశా కొద్దిపాటి బుద్ధులు, కొంచెం సంస్కారం నేర్పడం వరకు అది తన వంతు అనుకుంది. ‘మాలపిల్ల’ (1938) సినిమా వచ్చింది... అందులో బ్రాహ్మణ యువకుడు మాలపిల్లను వివాహం చేసుకుంటాడు నిజమే కాని అది సాంఘిక సంస్కరణ మాత్రమే పురుష సంస్కరణ కాదు. ‘వర విక్రయం’ (1939) సినిమా వచ్చింది. అందులో భానుమతి ‘స్వాతంత్య్రం లేదా స్త్రీలకు’ అని పాడింది. అయితే ఈ ధోరణి గట్టిగా కొనసాగలేదు. ఇంటి పట్టున ఉండటం స్త్రీ ధర్మం, సంపాదించుకు రావడం పురుషధర్మం కనుక ఇంటి పట్టున ఉన్న స్త్రీని శ్లాఘించి ఇంటి పట్టున ఉండటంలోని గొప్పతనం తెలియచేసే కథలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. ‘అర్థాంగి’ (1955), ‘మా ఇంటి మహాలక్ష్మి’ (1959), ‘దేవత’ (1965), ‘గృహలక్ష్మి’ (1967) ... ఇవి చాలా ఉన్నాయి. ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి’ అని పాటలు కట్టారు. అసలు ఇల్లాలు అంటే ఎలా ఉండాలో మోడల్ కూడా గట్టిగా చూపించారు. పాట సాగుతుండగా ఆమె తెల్లవారే లేస్తుంది.. ఎడ్లకు గడ్డి వేస్తుంది... స్నానం చేసొచ్చి కాఫీ తీసుకుని భర్త గదిలోకి వస్తుంది... అందాక భర్త నిద్రపోతూ ఉంటాడు. అతణ్ణి రెడీ చేసి టిఫిన్ పెట్టి.. బ్రీఫ్ కేస్ ఇచ్చి... ఇలా చేయడం వల్ల ఆమె దేవత. దీనిని రివర్స్ చేయడం మన సమాజంలో కాదు కదా సినిమాల్లోనూ అనూహ్యం. అమంగళకరం. ఆఫీసుకు వెళ్లే భార్య కోసం ఉదయాన్నే లేచి పాట పాడే భర్త లేడు. దాసరి తీసిన ‘సీతారాములు’ (1980)లో ‘ఏమండోయ్ శ్రీమతిగారు.. లేవండోయ్ పొద్దెక్కింది’ అని పాట ఉంటుంది... దానిని చూసి సమస్త లోకం కంగారు పడుతూ ఉండగా పాట చివరలో అది కల అని తెలుస్తుంది. ఆ సినిమాలో పెద్ద ఫ్యాక్టరీ యజమాని జయప్రద. కాని దర్శకుడు దాసరి చెప్పినట్టు బుద్ధిగా ఎర్లీ మార్నింగ్ లేచి కృష్ణంరాజుకు కాఫీ ఇస్తుంది. ‘గుండమ్మ కథ’ (1962) ‘స్త్రీల పొగరు అణచడం’ అనే సక్సెస్ ఫార్ములాను తెలుగు సినిమాకు ఇచ్చింది. ఈ సక్సెస్ఫుల్ సినిమా స్త్రీలకు బాగా అపకారం చేసిందని చెప్పవచ్చు. ఇందులో గుండమ్మ కూతురు జమున చేసిన తప్పు ఏమిటో ఎవరికీ తెలియదు. ఆమె కొంచెం పెంకిగా ఉంటుంది అంతే. గారాబంగా ఉంటుంది. ‘బాధ్యత తెలియకుండా’ ఉంటుంది. దాంతో ఎస్.వి.రంగారావు, ఎన్.టి.ఆర్, అక్కినేని వంటి మహామహులు కలిసి ఆమె ‘పొగరు’ అణచడానికి నాటకాలు ఆడతారు. ఏడ్పిస్తారు. మట్టి పని చేయిస్తారు. బెంబేలెత్తిస్తారు. ఇన్ని చేసేది ఆమె ‘భర్త పట్ల చూపాల్సిన అణకువ’ను అలవర్చుకోవడం కోసం. తెలుగు సినిమా అత్తలతో పందెం కాసే అల్లుళ్లతో, తల ఎగరేసే అలాంటి అత్తల కుమార్తెల ‘పీచమణిచే’ హీరోలతో నేటికీ వర్థిల్లుతోంది. తెలుగు హీరోకి ఏ స్త్రీ ఎదురు కారాదు... అయితే ఆమెను ‘దారికి తెస్తాడు’. ‘నరసింహ’లో రజనీకాంత్ రమ్యకృష్ణను తెచ్చినట్టు. అయితే తెలుగు సినిమా ఎప్పుడూ స్త్రీల పట్ల పూర్తి అసున్నితంగా లేదు. అప్పుడప్పుడు సదుద్దేశాల వల్ల కావచ్చు.. ట్రెండ్ కోసం కావచ్చు స్త్రీల సమస్యను పట్టించుకుంది. ‘కట్నం’ సమస్యను తెలుగు సినిమా చర్చించింది. ఎన్.టి.ఆర్ స్వయంగా ‘వరకట్నం’ (1969) తీశారు. ‘శుభలేఖ’ (1982), ‘శ్రీకట్నలీలలు’ (1985), ‘శ్రీవారికి ప్రేమలేఖ’ (1984), ‘రాఖీ’ (2008) తదితరం ఉన్నాయి. ప్రేమ పేరుతో మోసం చేసే కుర్రాళ్లకు బుద్ధి చెప్పే ‘న్యాయం కావాలి’ (1981), ‘మౌన పోరాటం’ (1989) సినిమాలు ఉన్నాయి. వ్యభిచార సమస్యను ‘పూజకు పనికి రాని పువ్వు’ (1986), ‘నేటి భారతం’ (1983)లో చూపారు. ‘అనుమానం’ను ‘డాక్టర్ చక్రవర్తి’ (1964), ‘ముత్యాల ముగ్గు’ (1975) తదితర సినిమాలలో, లైంగిక దోపిడిని ‘దాసి’ (1988), గృహహింసను ‘ఆడదే ఆధారం’ (1986), ఇంటి చాకిరీని ‘అమ్మ రాజీనామా’ (1991), రేప్‌ను ‘శ్రీకారం’ (1996) ... ఇవన్నీ తప్పక ప్రస్తావించాలి. అయితే పురుషులు పురుషులతో స్త్రీల తరఫున చేసిన సంభాషణలే ఇవన్నీ ఎక్కువగా. స్త్రీలు గట్టిగా చేసిన స్టేట్మెంట్ కాదు. స్త్రీలు గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చే సందర్భం ఇంకా తెలుగులో రాలేదు. స్త్రీలు లీడ్‌రోల్స్ చేయడానికి వెనుకాడతారు తెలుగులో. ఒక్కసారి వారు తమ భుజాల మీద సినిమా మోస్తారన్న ఇమేజ్ వస్తే వారి పక్కన హీరోలు చేయరు. గతంలో చాలామంది హీరోయిన్లు అలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడూ పడుతున్నారు. స్త్రీలు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులుగా, న్యాయవాదులుగా, కలెక్టర్లుగా, సంఘ సేవకులుగా కొన్ని అన్యాయాలను గొప్పగా ఎదిరించిన సినిమాలు తెలుగులో ఉన్నాయి. వాటితో సమాజానికి పేచీ లేదు. కాని స్త్రీల తరఫున స్త్రీలు మాట్లాడినప్పుడే పేచీ. అందుకు ఇంకా స్పేస్ రాలేదు. స్త్రీలు కుటుంబాలను గౌరవించం అనడం లేదు. స్త్రీలుగా తమ బాధ్యతలను విస్మరించం అనడం లేదు. పురుషులకు–స్త్రీలకు ఇల్లు సమానమే. కాని పెంపకంలో, చదువులో, ఉపాధి అవకాశాలలో, ఉద్యోగ స్థలాలలో, నిర్ణయాత్మక రాజకీయ పదవులలో, ఉనికిలో, అస్తిత్వంలో, అందచందాల నిర్వచనాలలో, గౌరవంలో సరి సమాన దృష్టికోణం, సరి సమాన వేదిక గురించి వారు మాట్లాడాల్సింది చాలా ఉంది సినిమాలలో. ‘చైల్డ్ అబ్యూజ్’, ‘మేరిటల్ రేప్’, ‘అంగీకార శృంగారం’, ‘జీవిత భాగస్వామి ఎంపిక’, ‘పిల్లల్ని కనే/వద్దనుకునే హక్కు’, ‘అబార్షన్’, ‘సెక్సువల్ హరాస్మెంట్’ వీటి గురించి తెలుగు సినిమా ఎంతో మాట్లాడాల్సి ఉంది. కాస్త ఆత్మవిశ్వాసం చూపి తమ టర్మ్స్ ప్రకారం తాము ఉంటూ అబ్బాయిలు గౌరవంగా, ప్రేమగా తమకు దగ్గరయ్యే అమ్మాయిల పాత్రలు ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘పెళ్లిచూపులు’, ‘ఫిదా’ తదితర సినిమాలలో కనిపించాయి. ‘ఫిదా’లో అమ్మాయి కోసమే అబ్బాయి అమెరికా వదిలి వస్తాడు. ఇది అరుదైన జెస్చర్. అన్ని జీవన, సంఘిక సందర్భాలను స్త్రీ వైపు నుంచి తిరగేస్తే ఇలాంటి జెస్చర్స్ ఇవ్వాల్సిన కథలు ఎన్నో వస్తాయి. వాటిని తెలుగు తెర ఇంకా పట్టుకోవాల్సి ఉంది. – సాక్షి ఫ్యామిలీ -
పాఠాలు నేర్పిన స్త్రీ పాత్రలు
‘చెంపదెబ్బే’ కదా అని అన్ని పాత్రలు అంటాయి. ‘చెంప దెబ్బ అయినా సరే’ అని ‘థప్పడ్’ సినిమాలో తన గౌరవ మర్యాదలకు భంగం కలిగించే భర్త నుంచి విడాకులు తీసుకుంటుంది స్త్రీ పాత్ర. భర్త పండు ముసలివాడైపోయినా సరే అతని కుత్సిత బుద్ధిని క్షమించలేక అతి వృద్ధురాలైన అతని భార్య మరొకరితో వివాహాన్ని కోరుకుంటుంది ‘గులాబో సితాబో’లో. ‘నా మేధను నేను కొనసాగిస్తాను కుటుంబ అడ్డంకులను తొలగించుకునైనా సరే’ అని ‘శకుంతలా దేవి’ పాత్ర మనకు చెబుతుంది. ‘యాసిడ్ దాడి నా భవిష్యత్తుకు ముగింపు కాదు’ అని ఆశను ఇస్తుంది ‘చపాక్’లోని ఒక పాత్ర. బాలీవుడ్ పైకి చూడటానికి నాలుగు డబ్బులు సంపాదించే రంగంగా కనిపించొచ్చు. కాని అది తయారు చేసి వదులుతున్నస్త్రీ పాత్రలు చాలా గట్టి పాఠాలు చెప్పేలా ఉంటున్నాయి. తప్పులు సరిచేసుకోమని పురుషులకు బోధ చేస్తున్నాయి. నేర్చుకోవాలనుకునే మగవారు తక్కువగా ఉన్నా నేర్పే ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి వారికి స్త్రీల గురించి. సమాజం కొన్ని పాఠాలు చెబుతుంది. సాహిత్యం కొన్ని పాఠాలు చెబుతుంది. సినిమా కూడా కొన్ని పాఠాలు చెబుతుంది. స్త్రీని గౌరవించడం, స్త్రీ అభిప్రాయాలకు సమాన భూమికను ఏర్పరచడం, స్త్రీ మనోభావాలను గమనించడం పురుష ఆధిపత్యం ఉండే ఈ సమాజంలో ఎప్పటికప్పటి పాఠాల ద్వారానే సాధ్యమవుతుంది. గత నాలుగైదేళ్లుగా స్త్రీల స్వావలంబనను, స్వేచ్ఛను, స్వతంత్రాన్ని, మూసకు తలవొంచని పట్టుదలను, లైంగిక మర్యాదలను వ్యక్తం చేసే స్త్రీ పాత్రలు బాలీవుడ్లో అనేకం వస్తున్నాయి. స్త్రీలను మరింతగా అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాయి. 2020 కూడా అందుకు మినహాయింపు కాదు. లాక్డౌన్ వల్ల నేరుగా సినిమాలు విడుదల కాకపోయినా ఓటిటిల ద్వారా విడుదలైన సినిమాలు స్త్రీలకు సంబంధించి గట్టి స్టేట్మెంట్లు ఇచ్చాయి. చెంపదెబ్బపై చూపుడువేలు 2020 విడుదలైన సినిమాలలో గట్టి చర్చ లేవదీసిన సినిమా ‘థప్పడ్’. ఇళ్లల్లో అతి సాధారణంగా స్త్రీలు తినే చెంపదెబ్బను వేలెత్తి చూపిన సినిమా ఇది. ఈ సినిమాలో భార్యను భర్త చెంపదెబ్బ కొడతాడు. భర్త మంచివాడే. అత్తామామలు మంచివారే. ఇల్లూ మంచిదే. కాని చెంపదెబ్బ కొట్టడం మాత్రం మంచిది కాదు అనుకుంటుంది ఆ భార్య. విడాకులు కోరుతుంది. ‘చెంపదెబ్బే కదా’ అంటారు అందరూ. ఏ కొడుకూ తన తండ్రిని తల్లిని చెంపదెబ్బ కొట్టడు. భార్యను మాత్రం కొట్టొచ్చు అనుకుంటాడు. తండ్రిని కొట్టి ‘చెంపదెబ్బే కదా’ అనలేనప్పుడు అంతే సమాన గౌరవం ఇవ్వాల్సిన భార్యను మాత్రం ఎందుకు కొట్టాలి. గృహహింస అంటే రాచి రంపాన పెట్టడం కాదని, స్త్రీ తన ఆత్మగౌరవానికి భంగం కలిగిందని భావించే చెంపదెబ్బ కూడా చాలునని ఈ సినిమా చెప్పింది. తాప్సీ పన్ను ఈ పాత్ర పోషించింది. ఎగరడానికి రెక్కలు ‘ఇది పురుషుల స్థలం. ఇక్కడ స్త్రీలకు చోటు లేదు’ అంటాడు ఎయిర్‌ఫోర్స్‌లో ఒక పురుష ఆఫీసర్ గుంజన్ సక్సేనాతో. ఉమన్ పైలెట్ కావాలని ఎయిర్ ఫోర్స్‌లో చేరిన గుంజన్ సక్సేనాకు అక్కడ అంతా పురుష ప్రపంచమే కనిపించడం సవాలుగా మారుతుంది. అసలు ఆ స్థలాన్ని డిజైన్ చేయడమే పురుషుల కోసం చేసి ఉంటారు. స్త్రీల రూములు, బాత్రూములు, యూనిఫామ్ చేంజ్ రూమ్‌లు ఏవీ ఉండవు. స్త్రీలకు ఎగిరే పాఠాలు చెప్పడం నామోషీగా భావిస్తారు మరికొంత మంది ఆఫీసర్లు. అయినప్పటికీ గుంజన్ తాను ఎగరడానికి రెక్కలు మొలిపించుకుంది. ఎయిర్ ఫోర్స్‌లో ఉత్తమ పైలెట్‌గా నిలిచి కార్గిల్ వార్ సమయంలో సేవలు అందించి చరిత్ర లిఖించింది. గుంజన్ సక్సేనా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని చేసిన బయోపిక్ ‘గుంజన్’ భిన్న రంగాల్లో పని చేయాలనుకునే స్త్రీలకు ఒక ధైర్యం ఇచ్చింది. పురుషులను సెన్సిటైజ్ చేసింది. పొగల నుంచి పునరుత్థానం అత్యంత దుర్బలుడైన పురుషుడెవడంటే స్త్రీని దొంగదెబ్బ తీయాలనుకునేవాడే. అత్యంత శిక్షార్హమైన వ్యక్తి కూడా. యాసిడ్ దాడులు స్త్రీకి ‘గుణపాఠం’ అని భావించేవారికి గుణపాఠం చెప్పిన విజేతలు ఉన్నారు. ‘కుళ్లి కుళ్లి చావాలి’ అని యాసిడ్ జల్లినవాడే కుళ్లి కుళ్లి చచ్చేలా ఆ యాసిడ్ విజేతలు తమను తాము కూడదీసుకున్నారు. గౌరవాన్ని తిరిగి పొందారు. జీవికను కూడా పొందారు. ‘ముఖం మాత్రమే దెబ్బతింది. ఆత్మవిశ్వాసం కాదు.. పోరాట పటిమా కాదు’ అని చెప్పారు వీరు. అలా చెప్పిన వారిని వార్తల్లో చదవడం కంటే తెర మీద చూసి స్ఫూర్తి పొందే వీలు కల్పించింది ‘చపాక్’ సినిమా. లక్ష్మీ అగర్వాల్ అనే యాసిడ్ విజేత బయోపిక్‌గా వచ్చిన ఈ సినిమాలో ముఖ్యపాత్రను దీపికా పడుకోన్ పోషించి స్త్రీ చైతన్యంలో తన వంతు భాగస్వామ్యాన్ని కలిపింది. మరోమహిళ మేఘనా గుల్జార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిందని గుర్తు పెట్టుకోవాలి. లెక్క తప్ప కూడదు ‘నువ్వెంత జీనియస్వి అయినా ఒక భర్తకు భార్యవే... ఒక బిడ్డకు తల్లివే’ అని చెబుతుంది సమాజం. అదే భర్త జీనియస్ అయితే ‘ఆయన మానాన ఆయన్ని వదిలిపెట్టి ఇంటి సంగతి నువ్వు చూసుకోమ్మా’ అని స్త్రీకి సుద్దులు చెబుతుంది. తన మేధను చాటడానికి భూభ్రమణం చేసే హక్కు పురుషునికే ఉంది. ‘నాకూ ఉంది’ అని మేథమేటిక్స్ జీనియస్ శకుంతలా దేవి చెప్పింది. భర్తనూ కుటుంబాన్ని ఆమె గౌరవించినా తన మేధను చాటడంలో అవి అడ్డంకిగా మారుతాయని తెలిసినప్పుడు ఆమె ఒక భర్త బంధాన్ని వొదులుకుని కూతురి బంధం కోసం పెనుగులాడుతుంది. ఇలాంటి స్త్రీలను మూస చట్రం వ్యతిరేకంగా చూసేలా చేస్తుంది. ఇలాంటి స్త్రీలను అసలు అర్థం చేయించే ప్రయత్నం కూడా చేయదు. కాని ‘శకుంతలా దేవి’ బయోపిక్ చేసింది. శకుంతలా దేవిగా విద్యాబాలన్ ఈ సంవత్సరం గుర్తుండిపోయింది. బెత్తం ఎత్తాలి కొన్ని ఇండ్లలో పండు ముసలివారై పోయినా ఆ భర్త ఆ భార్య మీద అరవడమూ, కసరడమూ చేస్తూ ఉంటాడు. ఆమె వాటిని సహిస్తూ ఉంటుంది. ఇన్నాళ్లు పడుతున్నది ఇంకొన్నాళ్లు పడితే సరిపోతుంది అనే భావజాలం ఆమెను అలా చేసి ఉంటుంది. కాని ‘గులాబో సితాబో’లోని స్త్రీ పూర్తి భిన్నం. అందులో ఆమెకు 90 దాటి ఉంటాయి. ఆమె జమీందారు. భర్తకు కూడా 90 దాటి ఉంటాయి. కాని అతడు ఆ భార్య ఎప్పుడు చస్తుందా ఆమె పేరున ఉన్న ఆస్తి తనకెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆమె పట్ల ప్రేమ, పక్కన కూచుని కబురు, మంచి చెడ్డలు ఏవీ పట్టవు అతనికి. దురాశ తప్ప. ఆ వయసులో ఏం బావుకుంటాడో కూడా తెలియదు. ఇలాంటి మగవారిని ఏం చేయాలి? ఆమె అస్సలు క్షమించదు. అతనికి విడాకులు ఇచ్చి తన జమిందారీలోని పూచిక పుల్ల ఇవ్వకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. సగటు భారతీయ సమాజంలో అందరూ గుండెలు బాదుకునే విషయమే ఇది. కాని స్త్రీలు తమకు ప్రేమ, గౌరవం దొరకని చోట తాము ఉండరు అని చెప్పదలుచుకున్నది ఈ పాత్ర. నటి ఫరూక్ జాఫర్ ఈ పాత్ర పోషించింది. భర్తగా అమితాబ్ బచ్చన్. లాక్డౌన్ వల్లగాని మరికొన్ని గట్టి పాఠాలు చెప్పే స్త్రీల పాత్రలు కూడా ఈ సంవత్సరం వచ్చేవి. సరే లేండి. వచ్చే సంవత్సరం ఎలాగూ వస్తోందిగా. – సాక్షి ఫ్యామిలీ -
కూచిపూడికి క్రాంతి ఒరవడి
నృత్యంలో సాధారణంగా ఆడపాత్రలను సైతం మగవారే వేయడం కనిపిస్తుంటుంది. అయితే క్రాంతి మగ పాత్రలే ఎక్కువగా పోషించి తనకంటూ ఒక ప్రత్యేకత సాధించారు. అయితే అదొక్కటే ఆమె ప్రత్యేకత కాదు! ►ఉన్నతోద్యోగాన్ని వదులుకుని కూచిపూడి సేవకు అంకితం ►పేదలకు సంప్రదాయ నృత్యాన్ని నేర్పించడమే లక్ష్యం ►‘రూపానురూపకం’ ద్వారా మరింత ప్రత్యేకంగా దేశవిదేశాల్లో ప్రదర్శనలు ►‘మోహినీ భస్మాసుర’ నాట్యానికి సాహిత్యం లేకుండా సంగీతంతో చేసిన సరికొత్త ప్రయోగానికి దేశవిదేశాల్లో స్టాండింగ్ ఒవేషన్ తెలుగు సంప్రదాయ కూచిపూడి నృత్యమే జీవితంగా క్రాంతి నారాయణ తుపాకుల ముందుకెళుతున్నారు. కూచిపూడినే శ్వాసగా భావిస్తున్న ఆమె సాధ్యమైనంత ఎక్కువమంది పేదలకు ఈ నృత్యాన్ని నేర్పించేందుకు తనవంతుగా కృషి చేస్తున్నారు. మన సంప్రదాయ కూచిపూడి నృత్యాన్ని అనేకమంది నాట్య ప్రవీణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టగా, ఆ ఒరవడిని మరింతగా కొనసాగించేందుకు క్రాంతి పాటుపడుతున్నారు. ఇందులో భాగంగా తన గురువు శోభానాయుడు మార్గదర్శకత్వంలో కొందరికే ప్రత్యేకమైన ‘రూపానురూపకం’ ద్వారా మగపాత్రలతో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చి దేశవిదేశాల్లో మంచి పేరు సంపాదించారు. కొన్నేళ్ల క్రితం వరకు ఆడపాత్రలను సైతం మగవారే వేసేవారు. అయితే క్రాంతి మాత్రం మగ పాత్రలే ఎక్కువగా పోషించి తనకంటూ ఒక ప్రత్యేకత సాధించారు. శివుడు, రాముడు, రావణుడు, విష్ణుమూర్తి, గౌతమబుద్ధ, అశోకుడు, నానవలి తదితర పాత్రలతో కూచిపూడి ప్రదర్శిస్తూ ప్రత్యేకత సాధించారు. అదేవిధంగా ‘మోహినీ భస్మాసుర’ నాట్యాంశాన్ని సరికొత్త ప్రయోగంతో ప్రదర్శించి దేశవిదేశాల్లో స్టాండింగ్ ఒవేషన్ పొందారు. సాంప్రదాయ నాట్యం చేసేందుకు సహజంగా సంగీతంతో పాటు సాహిత్యం ఉంటుంది. అయితే క్రాంతి నారాయణ ఈ నృత్య రూపకానికి సాహిత్యం (లిరిక్స్) లేకుండా కేవలం సంగీత వాయిద్యాలను మాత్రమే ఉపయోగించి సరికొత్త ప్రయోగంతో ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలవారికి అర్థమయ్యేలా చేశారు. భరతనాట్యమే ప్రధానంగా భావించే తమిళనాడు నుంచి అనేక ఇతర దేశాల్లోనూ ఈ కూచిపూడి ప్రదర్శనకు స్టాండింగ్ ఒవేషన్ సాధించారు క్రాంతి. సంగీతం అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ కావడంతో దీని ద్వారా ప్రయోగం చేశారు. లాభాపేక్షతో కాకుండా ఎక్కువమంది పేదలకు సంప్రదాయ నృత్య కళ నేర్పించడమే లక్ష్యమని, ఇలా చేస్తే కళ ఎప్పటికీ నిలిచి ఉంటుందని క్రాంతి చెబుతున్నారు. అదేవిధంగా సంస్కృతి, సాంప్రదాయాల పట్ల ప్రేమ, అనురాగం పెరుగుతాయంటున్నారు.ఇప్పటివరకు దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు చేసి తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న క్రాంతికి అనేక అవార్డులు వచ్చాయి. మరోవైపు ఆమెకు అనేక పెద్ద స్థాయి పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఇప్పటివరకు ఆమె సాధించినదాన్ని చూసి అభినందిస్తూనే పెళ్లి అయిన తరువాత కొనసాగించకూడదని నిబంధన పెట్టడంతో క్రాంతి అన్ని సంబంధాలను తిరస్కరించి కూచిపూడిని తన జీవిత సర్వస్వంగా భావించారు. ఈ కళను వదిలేస్తే అన్నివర్గాలకు కూచిపూడిని చేరువ చేయాలనే లక్ష్యాన్ని చేరుకోలేనని ఆమె చెబుతున్నారు. దేవుడు తనను కళారంగంవైపు పిలవడంతోనే ఇటు వచ్చానని అంటున్నారు. శోభానాయుడు సంశయించారు! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంకు చెందిన తుపాకుల క్రాంతి స్థానిక సెయింట్‌మేరీస్ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించారు. నాలుగో తరగతి చదువుతున్నప్పుడు కొన్ని నెలలు కూచిపూడి నేర్చుకున్నారు. ఆ సమయంలో పలు ప్రదర్శనలు చేశారు. తండ్రి మాత్రం వేరే రంగంలో ఎదగాలని సూచించారు. ఈ క్రమంలో అప్పుడు ఆమె నృత్యం ఆపేశారు. అయితే నృత్యం నేర్చుకోవాలనే ఆకాంక్ష బలంగా ఉండడంతో ఉస్మానియా క్యాంపస్‌లో బీఈ మెకానికల్ తృతీయ సంవత్సరంలో శోభానాయుడు వద్దకు వెళ్లి కూచిపూడి నేర్పించమని అడిగారు. ఇంజనీరింగ్ వాళ్లు ఈ రంగాన్ని మధ్యలోనే వదిలేస్తారని శోభానాయుడు నాట్యం నేర్పించేందుకు సంశయించారు. అయితే ఈ రంగంలోనే కొనసాగుతానని మాటిచ్చిన క్రాంతి ఆమె వద్ద నేర్చుకుని ఈ రంగంలోకొచ్చారు. బీఈ తరువాత ఉస్మానియాలో ఎంబీఏ చేస్తూనే క్రాంతి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఎంబీఏ తరువాత మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం సాధించిన క్రాంతి ఆ కంపెనీ ద్వారా రక్షణ విభాగంలో దేశంలో పలుచోట్ల పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు రెండున్నరేళ్లపాటు ఉద్యోగం చేసి దాన్ని మానేశారు. అనంతరం కృష్ణా జిల్లా కూచిపూడిలో ఎంఏ (మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్) కోర్సు చేశారు. వేదాంతం రామలింగశాస్త్రి సారథ్యంలో ఆ కోర్సు పూర్తి చేసి ఈ రంగంలో కొనసాగుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో క్రాంతి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 2013లో హైదరాబాద్‌లో క్రాంతి కూచిపూడి నాట్యాలయ స్థాపించి నృత్యంపై శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా సొంతూరిపై మమకారంతో 2017 నుంచి కొత్తగూడెంలోనూ శని, ఆదివారాల్లో ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నారు. విశ్వభారతి, నాట్య అభినయ కౌముది, కళాంజరి, నటరాజ సంగీత తరంగ్ యువ పురస్కారం, అవుట్‌స్టాండింగ్ యంగ్ ఉమెన్ ఆఫ్ ఇయర్ తదితర అవార్డు, ఇంకా మరెన్నో అవార్డులు అందుకున్నారు. తూమాటి భద్రారెడ్డి, సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా -
అభివృద్ధి కావాలంటే ఆమెను అంగీకరించాల్సిందే!
ప్రపంచం మొత్తం మారిపోయింది. ఉద్యోగాలు, ఉద్యోగాలు చేసే తీరు, పని వాతావరణం అన్నీ మారిపోయాయి. నేటి అభివృద్ధి వేగంలో స్త్రీ పాత్ర చాలా అవసరం. స్త్రీ సమానత్వాన్ని గుర్తించకుండా పోతే ఆమె తన భాగస్వామ్యాన్ని పూర్తిగా నిర్వర్తించలేదు. ఆమె సామర్థ్యాలు వృథా అవుతాయి...కాబట్టి స్త్రీ సమానత్వాన్ని పురుషులు గుర్తించాలని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ సంస్థ అభిప్రాయపడింది. స్పష్టంగా చెప్పాలంటే పురుషులను హెచ్చరించింది. న్యూయార్క్‌లో జరిగిన కమిషన్ ఆన్ విమెన్ స్టేటస్ సభకు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న అధికార వికేంద్రీకరణలో స్త్రీకి సమ ప్రాధాన్యం లేదు. ఇది వెంటనే మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది స్త్రీ కోణం కాదు, అభివృద్ధి కోణం. లేకపోతే సమాజం తన లక్ష్యాలను చేరుకోవడంలో ఆలస్యం అవుతుందని యున్ఎఫ్పీఏ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఒసోతిమెయిన్ చెప్పారు. ‘ఒక పురుషుడు కండోమ్ కొంటే ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక స్త్రీ ఏదైనా గర్భనిరోధక ఉత్పత్తి అడిగితే వింతగా చూస్తారు. ఇదెక్కడి న్యాయం’ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. స్త్రీలు ఏం చేయాలో, ఎలా ఉండాలో పురుషులు నిర్ణయిస్తే ఎలా.. ఇది వెంటనే మార్చుకోవాల్సిన అంశం అని ఆయన సూచించారు. మహిళల హక్కులు-సమానత్వం వేర్వేరు కాదు. స్త్రీకి నిర్ణయ స్వాతంత్య్రం ఇస్తే వారు విజ్ఞానవంతులుగా ఎదుగుతారు, దీనివల్ల వారి ఆర్థిక స్థితితో పాటు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. ఇది సమాజంపై ఒత్తిడి తగ్గిస్తుంది. దీన్ని గుర్తించిన సమాజం ఉన్న దేశాల్లో అభివృద్ధి వేగం చాలా ఎక్కువగా ఉందని పాలసీ డెరైక్టర్ సరస్వతీ మీనన్ సదస్సులో చెప్పారు. అంటే పురుషులు- స్త్రీలకు హక్కులు కల్పించడం అంటే పరోక్షంగా అభివృద్ధికి తోడ్పడినట్లే అని సదస్సు అభిప్రాయపడింది.