అభివృద్ధి కావాలంటే ఆమెను అంగీకరించాల్సిందే!
ప్రపంచం మొత్తం మారిపోయింది. ఉద్యోగాలు, ఉద్యోగాలు చేసే తీరు, పని వాతావరణం అన్నీ మారిపోయాయి. నేటి అభివృద్ధి వేగంలో స్త్రీ పాత్ర చాలా అవసరం. స్త్రీ సమానత్వాన్ని గుర్తించకుండా పోతే ఆమె తన భాగస్వామ్యాన్ని పూర్తిగా నిర్వర్తించలేదు. ఆమె సామర్థ్యాలు వృథా అవుతాయి...కాబట్టి స్త్రీ సమానత్వాన్ని పురుషులు గుర్తించాలని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ సంస్థ అభిప్రాయపడింది. స్పష్టంగా చెప్పాలంటే పురుషులను హెచ్చరించింది. న్యూయార్క్‌లో జరిగిన కమిషన్ ఆన్ విమెన్ స్టేటస్ సభకు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ హాజరయ్యారు.
ప్రస్తుతం ఉన్న అధికార వికేంద్రీకరణలో స్త్రీకి సమ ప్రాధాన్యం లేదు. ఇది వెంటనే మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది స్త్రీ కోణం కాదు, అభివృద్ధి కోణం. లేకపోతే సమాజం తన లక్ష్యాలను చేరుకోవడంలో ఆలస్యం అవుతుందని యున్‌ఎఫ్‌పీఏ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఒసోతిమెయిన్ చెప్పారు. ‘ఒక పురుషుడు కండోమ్ కొంటే ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక స్త్రీ ఏదైనా గర్భనిరోధక ఉత్పత్తి అడిగితే వింతగా చూస్తారు. ఇదెక్కడి న్యాయం’ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. స్త్రీలు ఏం చేయాలో, ఎలా ఉండాలో పురుషులు నిర్ణయిస్తే ఎలా.. ఇది వెంటనే మార్చుకోవాల్సిన అంశం అని ఆయన సూచించారు.
మహిళల హక్కులు-సమానత్వం వేర్వేరు కాదు. స్త్రీకి నిర్ణయ స్వాతంత్య్రం ఇస్తే వారు విజ్ఞానవంతులుగా ఎదుగుతారు, దీనివల్ల వారి ఆర్థిక స్థితితో పాటు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. ఇది సమాజంపై ఒత్తిడి తగ్గిస్తుంది. దీన్ని గుర్తించిన సమాజం ఉన్న దేశాల్లో అభివృద్ధి వేగం చాలా ఎక్కువగా ఉందని పాలసీ డెరైక్టర్ సరస్వతీ మీనన్ సదస్సులో చెప్పారు. అంటే పురుషులు- స్త్రీలకు హక్కులు కల్పించడం అంటే పరోక్షంగా అభివృద్ధికి తోడ్పడినట్లే అని సదస్సు అభిప్రాయపడింది.