చిట్టా వస్తోంది జాగ్రత్త! | Anti-corruption corruption log is coming....kamalhasanwarning | Sakshi
Sakshi News home page

చిట్టా వస్తోంది జాగ్రత్త!

Published Fri, Jul 21 2017 3:19 AM | Last Updated on Mon, Sep 17 2018 4:55 PM

చిట్టా వస్తోంది జాగ్రత్త! - Sakshi

చిట్టా వస్తోంది జాగ్రత్త!

మంత్రులకు కమల్‌ హెచ్చరిక
వెబ్‌సైట్లలో అభియోగాలు నమోదు

‘అవినీతి ఆరోపణలపై ఆధారాలు కావాలన్నారు కదా.. ఇదిగో చిట్టా వస్తోంది జాగ్రత్త’ అని నటుడు కమల్‌హాసన్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన అవినీతిని ప్రభుత్వ వెబ్‌సైట్లలో నమోదు చేయాల్సిందిగా అభిమానులకు పిలుపునిస్తూ బుధవారం ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై : అవినీతిని నిరూపించాలని మంత్రుల సవాల్‌కు కమల్‌హాసన్‌ స్పందించారు. అభిమానుల చేతికి అస్త్రం అందించారు. గత కొంతకాలంగా రాజకీయ విమర్శలు చేస్తూ వస్తున్న కమల్‌ ఇటీవల అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయడం రాష్ట్ర రాజకీయాలను మరో మలుపుతిప్పింది. అధికార, ప్రతిపక్షాలు కమల్‌ వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డాయి.

అన్నాడీఎంకే అవినీతిమయమంటూ సుమారు వారం రోజల క్రితం కమల్‌చేసిన విమర్శలపై రాజకీయం ఇంకా రగులుతూనే ఉంది. అధికారపక్షంపై విపక్షాలన్నీ ఏకమై ప్రతిరోజూ ఏదో ఒక మూల చర్చాగోష్టిలో మునిగితేలుతున్నాయి. విమర్శలతో ఆత్మరక్షణలో పడిపోయిన ప్రభుత్వం ఆధారాలు చూపాలంటూ సవాలు విసిరి కమల్‌ను మరింత రెచ్చగొట్టాయి. మంత్రుల సవాలును స్వీకరించిన కమల్‌హాసన్‌ దీటుగా స్పందించారు.

‘ప్రభుత్వ అవినీతిపై రాష్ట్రమంతా కోడై కూస్తున్నా, మీడియాలు ప్రధాన శీర్షికల్లో ప్రచురిస్తున్నా ఇంకా ఆధారాలు కావాలా?’ అని ఆయన ఎద్దేవా చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు గుర్తించని మంత్రులు తెలిసో తెలియకో అవాకులు చవాకులు పేలుతున్నారని కమల్‌ విమర్శించారు. రాష్ట్రంలో అసలు అవినీతే లేదని సమర్థించుకున్నంటున్న మంత్రులకు అభిమానులు సరైన సమాధానం చెబుతారని ఆయన తెలిపారు. అవినీతిని ఆధారాలతో నిరూపించు అని మంత్రి జయకుమార్‌ కవ్వింపు చేష్టలకు డిజిటల్‌ విధానంలో చరమగీతం పాడండని అభిమానులను కోరారు.

ఆమేరకు బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఉత్తరాలు, పోస్టు కార్డులు, పోస్టర్లు ద్వారా ప్రచారం చేస్తే చెరిగిపోతాయి, చిరిగిపోతాయి, ఇది డిజిటల్‌ యుగం, ఇంటర్నెట్‌ ద్వారా ప్రభుత్వంపై అవినీతి ఆధారాలను సంధించండి’ అని కోరారు. రాష్ట్రప్రభుత్వ మంత్రుల అధికారిక వెబ్‌సైట్‌ చిరునామాను అభిమానులకు అందజేశారు. కమల్‌ ఇచ్చిన పిలుపునకు వెంటనే స్పందించిన అభిమానులు పెద్ద ఎత్తున అవినీతి సమాచారం వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. మదురై జిల్లాకు చెందిన అభిమానులు రేషన్‌దుకాణాల అవకతవకలపై వివరాలను నమోదుచేశారు. రెండువేల మంది రేషన్‌కార్డుదారుల నుంచి సంతకాలు సేకరించి హోంశాఖకు పంపుతున్నారు. డీవైఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలు గురువారం నగరంలో కమల్‌కు మద్దతుగా ర్యాలీ జరిపాయి.

శశికళ ఆదేశాల మేరకు ప్రభుత్వం..
ఇదిలా ఉండగా, అవినీతిపరురాలిగా ముద్రపడి జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ ఆదేశాల ప్రకారం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటూ కమల్‌ సోదరుడు చారుహాసన్‌ సైతం మంత్రి జయకుమార్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. మంత్రి విజయభాస్కర్‌ ఇంటిలో ఐటీ దాడులు అవినీతికి రుజువులు కావా అని ప్రశ్నించారు. బరిలోకి దిగితే కమలే బిగ్‌బాస్‌ అంటూ సినీ హాస్యనటుడు దాడి బాలాజీ అన్నారు. అవినీతి ప్రభుత్వానికి కమల్‌ను విమర్శించే అర్హత లేదని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement