![lawrence says rajini and kamal should work together - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/8/ragava%20lawrence.jpeg.webp?itok=Qkxgri3S)
నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్
పెరంబూరు: నటులు రజనీకాంత్, కమలహాసన్ రాజకీయాల్లో కలిసి పని చేస్తే బాగుంటుందని నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ అన్నారు. ఇటీవల జల్లికట్టు క్రీడలో ప్రాణాలు కోల్పోయిన సేలానికి చెందిన యోగేశ్వరన్ కుటుంబానికి ఈయన ఇల్లు నిర్మించి ఇచ్చారు. బుధవారం ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి సేలం వెళ్లిన లారెన్స్ మీడియాతో మాట్లాడారు. యేగేశ్వరన్ జల్లికట్టు పోటీల్లో ప్రాణాలు కోల్పోయాడన్న విషయం తెలిసి తాను అతని అంత్యక్రియలకు హాజరయ్యానన్నారు. ఆ సమయంలో యోగేశ్వరన్ తల్లిదండ్రుల కంటతడి తనను కదిలించదన్నారు. వారి పెద్ద కొడుకులా యోగేశ్వరన్ బాధ్యతలను నెరవేర్చుతానని వారికి మాట ఇచ్చానని చెప్పారు. ఆ ప్రకారం వారికి ఇల్లు నిర్మించి ఇచ్చినట్టు తెలిపారు.
తాను రాజకీయాల్లోకి రావాలన్న కాంక్షతోనే ఇలాంటివి చేస్తున్నానని కొందరు అంటున్నారన్నారు. అయితే గత పదేళ్ల నుంచి తాను వివిధ రకాలుగా సేవలందిస్తున్నానన్నారు. వృద్ధ, అనాథ ఆశ్రమాలను నిర్వహణ, 142 మందికి గుండె శస్త్ర చికిత్సలకు సాయం చేశానని గుర్తు చేశారు. రాజకీయం అంటే సేవ అని మా అమ్మకు అర్థం అయ్యాకే తాను రాజకీయాల్లోకి వస్తానని లారెన్స్ వెల్లడించారు. నటుడు రజనీకాంత్ తన గురువన్నారు. రజనీకాంత్, కమలహాసన్ ప్రజలకు సేవ చేయాలన్న భావంతోనే రాజకీయరంగప్రవేశం చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment