
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన 63వ పుట్టినరోజు అయిన నవంబర్ 7న కొత్త పార్టీని ప్రకటించొచ్చని తమిళనాడు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. వీటికి బలం చేకూరుస్తూ ఆయన బుధవారం తన అభిమానులతో సమావేశమయ్యారు. కమల్ పుట్టిన రోజు వేడుకల నిర్వహణ, తాము చేపట్టబోయే సేవా కార్యక్రమాలపైనే చర్చలు జరిగినట్లు కమల్ హాసన్ సంక్షేమ క్లబ్ సీనియర్ సభ్యుడు తంగవేలు చెప్పారు.
సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని కమల్ సూచించారని తెలిపారు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించినట్లు తెలిసింది. పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని, తొందరపాటుతో ప్రభుత్వం, పార్టీ నేతలపై అసభ్యకర రీతిలో విమర్శలు చేయరాదని అభిమాన సంఘాల నేతలకు కమల్ సూచించారు.