కమల్‌, ప్రభాస్‌, చరణ్‌ డబుల్‌ ధమాకా.. సమంత, ఎన్టీఆర్‌ ట్రీట్‌ కూడా ఉందా? | Tollywood stars dual roles in their films | Sakshi
Sakshi News home page

కమల్‌, ప్రభాస్‌, చరణ్‌ డబుల్‌ ధమాకా.. సమంత, ఎన్టీఆర్‌ ట్రీట్‌ కూడా ఉందా?

Published Sun, Apr 16 2023 12:42 AM | Last Updated on Sun, Apr 16 2023 7:21 AM

Tollywood stars dual roles in their films - Sakshi

హీరోలు స్క్రీన్‌పై సింగిల్‌గా కనిపించినా అభిమానులు పండగ చేసుకుంటారు. ఇక డబుల్‌ రోల్స్‌లో కనబడితే పండగే పండగ. ఒకే సినిమాలో డ్యూయల్‌ రోల్‌ అంటే స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌కు డబుల్‌ ధమాకానే. ఇలా ఫ్యాన్స్‌ను, ఆడియన్స్‌ను అలరించేందుకు రెండు పాత్రల్లో కనిపించే చిత్రాల్లో నటిస్తున్న స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.

► కమల్‌హాసన్‌ కెరీర్‌లో వన్నాఫ్‌ ది బెస్ట్‌ హిట్స్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ఇండియన్‌’ ఒకటి. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సేనాపతిగా, ఆయన కొడుకు చంద్రబోస్‌గా రెండు పాత్రల్లో మెప్పించారు కమల్‌హాసన్‌. ప్రస్తుతం కమల్, శంకర్‌ కాంబినేషన్‌లోనే ‘ఇండియన్‌’కు సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కూడా కమల్‌ రెండు పాత్రలు చేస్తున్నట్లుగా తెలిసింది. ‘ఇండియన్‌’లో మాదిరిగానే ‘ఇండియన్‌ 2’లోనూ కమల్‌ తండ్రీకొడుకుగా కనిపించనున్నారని టాక్‌. ఈ సినిమా కథ స్వాతంత్య్రానికి పూర్వం ఉంటుందట.  

► ప్రభాస్‌ నటిస్తున్న లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా నుంచి ప్రభాస్‌కు చెందిన రెండు లుక్స్‌ రిలీజయ్యాయి. దీంతో ‘సలార్‌’లో ప్రభాస్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబరు 28న రిలీజ్‌ కానుంది.

► శంకర్‌ దర్శకత్వంలోని ‘గేమ్‌ చేంజర్‌’ చిత్రంలో డబుల్‌ రోల్‌లో కనిపించనున్నారు హీరో రామ్‌చరణ్‌. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌. ఐఏఎస్‌ ఆఫీసర్ల బ్యాక్‌డ్రాప్‌లో పొలిటికల్‌ టచ్‌ ఉన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ తండ్రీకొడుకుగా నటిస్తున్నారని తెలిసింది. 1920 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో ఓ రాజకీయ పార్టీ ప్రతినిధిగా, సమకాలీన పరిస్థితుల్లో ఐఏఎస్‌ ఆఫీసర్‌గా రామ్‌చరణ్‌ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్‌ ఖబర్‌. అలాగే రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ స్పోర్ట్స్‌ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్‌ అన్నదమ్ముల పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.   

ట్రీట్‌ ఉందా?
అధికారిక ప్రకటన రాలేదు కానీ ఓ సినిమాలో ఎన్టీఆర్, ఒక హిందీ చిత్రంలో సమంత రెండు పాత్రల్లో కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. మరి.. ఈ ఇద్దరి నుంచి డబుల్‌ ట్రీట్‌ ఉందా? అనేది త్వరలో తెలుస్తుంది.

► దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం విడుదలైన ‘ఆంధ్రావాలా’ సినిమాలో తండ్రీకొడుకుగా ఎన్టీఆర్‌ డ్యూయల్‌ రోల్‌ చేశారు. మరోసారి తండ్రీకొడుకుగా ఎన్టీఆర్‌ డబుల్‌ రోల్‌ చేయనున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లోనే ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానుంది.

► ‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’ వెబ్‌ సిరీస్‌తో హిందీ ఆడియన్స్‌లో క్రేజ్‌ దక్కించుకున్నారు సమంత. ఇప్పుడు ఇండియన్‌ వెర్షన్‌ ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారామె. ఇక సమంత నటించనున్న తొలి హిందీ చిత్రంపై ఇప్పటికే పలు వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా హిందీ హిట్‌ ‘స్త్రీ ’(2018) ఫేమ్‌ అమర్‌ కౌశిక్‌ దర్శకత్వంలో ఓ హారర్‌ ఫిల్మ్‌ తెరకెక్కనుందని, ‘వాంపైర్స్‌ ఆఫ్‌ విజయ్‌నగర్‌’ టైటిల్‌తో తెరపైకి వెళ్లనున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటిస్తారని టాక్‌. ఈ ఏడాది చివర్లో సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రంలో సమంత డ్యూయల్‌ రోల్‌ చేయనున్నారని సమాచారం. ఓ పాత్రలో సమంత ప్రేతాత్మగా కనిపిస్తారట. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement