Double role
-
చిరుతో 'విశ్వంభర'.. త్రిష డబుల్ ధమాకా?
హీరోయిన్ త్రిష తెలుగు ప్రేక్షకు లకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. 2006లో విడుదలైన ‘స్టాలిన్’ సినిమా తర్వాత రెండోసారి ‘విశ్వంభర’ కోసం జోడీ కట్టారు చిరంజీవి–త్రిష. కొన్నేళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్ చిత్రమిది. ఇందులోని గ్రాఫిక్స్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని టాక్. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయంపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో త్రిష ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్. ఆమెపాత్రకు కథలో చాలాప్రాధాన్యం ఉందట.. అందుకే డబుల్ రోల్ చేస్తున్నారని భోగట్టా. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. -
కమల్, ప్రభాస్, చరణ్ డబుల్ ధమాకా.. సమంత, ఎన్టీఆర్ ట్రీట్ కూడా ఉందా?
హీరోలు స్క్రీన్‌పై సింగిల్‌గా కనిపించినా అభిమానులు పండగ చేసుకుంటారు. ఇక డబుల్ రోల్స్‌లో కనబడితే పండగే పండగ. ఒకే సినిమాలో డ్యూయల్ రోల్ అంటే స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకానే. ఇలా ఫ్యాన్స్‌ను, ఆడియన్స్‌ను అలరించేందుకు రెండు పాత్రల్లో కనిపించే చిత్రాల్లో నటిస్తున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► కమల్‌హాసన్ కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ఇండియన్’ ఒకటి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సేనాపతిగా, ఆయన కొడుకు చంద్రబోస్‌గా రెండు పాత్రల్లో మెప్పించారు కమల్‌హాసన్. ప్రస్తుతం కమల్, శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కూడా కమల్ రెండు పాత్రలు చేస్తున్నట్లుగా తెలిసింది. ‘ఇండియన్’లో మాదిరిగానే ‘ఇండియన్ 2’లోనూ కమల్ తండ్రీకొడుకుగా కనిపించనున్నారని టాక్. ఈ సినిమా కథ స్వాతంత్య్రానికి పూర్వం ఉంటుందట. ► ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా నుంచి ప్రభాస్‌కు చెందిన రెండు లుక్స్ రిలీజయ్యాయి. దీంతో ‘సలార్’లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. ► శంకర్ దర్శకత్వంలోని ‘గేమ్ చేంజర్’ చిత్రంలో డబుల్ రోల్లో కనిపించనున్నారు హీరో రామ్‌చరణ్. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. ఐఏఎస్ ఆఫీసర్ల బ్యాక్‌డ్రాప్‌లో పొలిటికల్ టచ్ ఉన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ తండ్రీకొడుకుగా నటిస్తున్నారని తెలిసింది. 1920 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఓ రాజకీయ పార్టీ ప్రతినిధిగా, సమకాలీన పరిస్థితుల్లో ఐఏఎస్ ఆఫీసర్‌గా రామ్‌చరణ్ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ ఖబర్. అలాగే రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్ అన్నదమ్ముల పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ట్రీట్ ఉందా? అధికారిక ప్రకటన రాలేదు కానీ ఓ సినిమాలో ఎన్టీఆర్, ఒక హిందీ చిత్రంలో సమంత రెండు పాత్రల్లో కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. మరి.. ఈ ఇద్దరి నుంచి డబుల్ ట్రీట్ ఉందా? అనేది త్వరలో తెలుస్తుంది. ► దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం విడుదలైన ‘ఆంధ్రావాలా’ సినిమాలో తండ్రీకొడుకుగా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. మరోసారి తండ్రీకొడుకుగా ఎన్టీఆర్ డబుల్ రోల్ చేయనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లోనే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ► ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్‌తో హిందీ ఆడియన్స్‌లో క్రేజ్ దక్కించుకున్నారు సమంత. ఇప్పుడు ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారామె. ఇక సమంత నటించనున్న తొలి హిందీ చిత్రంపై ఇప్పటికే పలు వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా హిందీ హిట్ ‘స్త్రీ ’(2018) ఫేమ్ అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఓ హారర్ ఫిల్మ్ తెరకెక్కనుందని, ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్’ టైటిల్‌తో తెరపైకి వెళ్లనున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తారని టాక్. ఈ ఏడాది చివర్లో సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రంలో సమంత డ్యూయల్ రోల్ చేయనున్నారని సమాచారం. ఓ పాత్రలో సమంత ప్రేతాత్మగా కనిపిస్తారట. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. -
హీరోయిన్ ధన్సిక తొలిసారి డబుల్ రోల్
'మనోహరి' చిత్రం ద్వారా నటి ధన్సిక తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. గీత రచయిత స్నేహాన్ భార్య కన్నిక స్నేహాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య ఫిలిం ప్రొడక్షన్ పతాకంపై మహేశ్వరన్ నందగోపాల్ నిర్మిస్తున్నారు. నవాజ్ మహ్మద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కేవీ మణి ఛాయాగ్రహణం, కార్తీక్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. -
డబుల్ బొనాంజా?
మహేశ్‌బాబు ఇప్పటివరకూ ఒకే పాత్రలో రెండు షేడ్స్‌లో కనిపించిన సినిమాలు ఉన్నాయి. అయితే రెండు పాత్రలు చేయలేదు. తన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’లో డబుల్ యాక్షన్ చేయనున్నారు అనేది ఫిల్మ్‌నగర్ టాక్. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటించనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. 14రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మించనున్నాయి. బ్యాంక్ నుంచి భారీ అప్పులు తీసుకునే బిజినెస్మ్యాన్లు, వాళ్ల వల్ల నష్టపోయే సామాన్యులు అనే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇందులో బ్యాంక్ అధికారిగా క్లాస్ పాత్రలో, బ్యాక్ రుణాలను తప్పుడు దారిలో మంజూరి చేయించే మధ్యవర్తిగా మాస్ పాత్రలో కనిపిస్తారట మహేశ్. అమెరికాలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. -
డబుల్ ట్రీట్
సాధారణంగా హీరోలు డబుల్ యాక్షన్ చేయడం చూస్తూ ఉంటాం. హీరోయిన్లు డబుల్ యాక్షన్ చేసిన సినిమాలు తక్కువే అని చెప్పాలి. తాజాగా పూజా హెగ్డే ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. ఆమె ఫాన్స్‌కు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారట. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్’. రాధా కష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1970 కాలంలో ఇటలీ బ్యాక్ డ్రాప్లో జరిగే ప్రేమ కథ ఇదని సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్. కవలలుగా పూజా హెగ్డే పాత్ర ఉంటుందని సమాచారం. ఆల్రెడీ విదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకూ పూర్తి చేశారు. మిగతా భాగాన్ని హైదరాబాద్ లోనే సెట్స్ వేసి పూర్తి చేయాలని భావిస్తోంది చిత్రబందం. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాలో కష్ణం రాజు, ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ కీలక పాత్రలు చేస్తున్నారు. -
నువ్వా? నేనా?
ఓటీటీలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండటంతో సినిమా ఇండస్ట్రీ దృష్టి ఇప్పుడు వాటిపై పడింది. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్లు, ప్రముఖ దర్శకులు, పేరున్న నిర్మాణ సంస్థలు సైతం డిజిటల్ వేదికవైపు అడుగులేస్తున్నారు. సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లు ఇప్పటికే వెబ్ సిరీస్‌లకు సై అన్నారు. ఈ జాబితాలోకి తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ చేరనున్నారని సమాచారం. ఆమె ఓ వెబ్ సీరీస్‌లో నటించేందుకు పచ్చజెండా ఊపారని టాక్. ఇందులో రకుల్ ద్విపాత్రాభినయం చేయనున్నారట. అది కూడా కవలలుగా నటించనున్నారని తెలిసింది. ప్రతి విషయంలోనూ ఈ కవలలు నువ్వా? నేనా? అన్నట్టు ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారని, ఆ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా సాగుతాయని టాక్. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ రకుల్ డబుల్ రోల్ చేయలేదు. సో.. ఆమె రెండు పాత్రల్లో కనిపిస్తే అభిమానులకు పండగలా ఉంటుంది. -
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు, ఇంట్రస్టింగ్ అప్డేట్?
సాక్షి, ముంబై: ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న 'పొన్నియిన్ సెల్వన్' చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతున్నఈ సినిమాలో నటించే దిగ్గజాలపై ఇప్పటికే పలు అంచనాలు అభిమానుల్లో హల్చల్ చేస్తున్నాయి. తాజా సంచలనం ఏమిటంటే హిస్టారికల్ వార్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ద్విపాత్రాభినయం చేయనున్నారట. దక్షిణాది సూపర్స్టార్లు లీడ్ రోల్స్ పోషించనున్న 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో ఐశ్యర్య తల్లీ కూతుళ్లుగా రెండు కీలక పాత్రల్లో అలరించనున్నారు. చోళరాజు పెరియా పజువేట్టరయ్యర్ భార్య నందిని, నందిని తల్లి మందాకిని దేవీ పాత్రలకు మణిరత్నం ఐషును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. జీన్స్ సినిమాలో కవల అక్కా చెల్లెళ్లుగా ఆకట్టుకున్న ఐశ్యర్య ఈసారి తల్లీ కూతుళ్లుగా ఆకట్టుకోనున్నారన్నమాట. కార్తీ, విక్రమ్, మోహన్ బాబు, కీర్తి సురేష్ ఇప్పటికే ఈసినిమాలో ప్రధాన పాత్రలు పోషించనున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న పొన్నియన్ సెల్వన్ సినిమాని మద్రాస్ టాకీస్ అండ్ లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంలో రాసిన కల్కి కృష్ణమూర్తి చారిత్రాత్మక నవల ఆధారంగా 'పొన్నియిన్ సెల్వన్' తెరకెక్కుతోంది. ఇది చోళ రాజు రాజరాజ చోళుని కథను చెబుతుంది. పాన్ ఇండియా ఆడియన్స్ టార్గెట్ గా రూపొందనున్న ఈ సినిమా నవంబరు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ విషయంపై అధికారిక వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉంది. చదవండి : అడవుల్లో వంద రోజులు! -
డబుల్ రజనీ
ఆరుపదులు దాటినా రజనీకాంత్ స్టైల్, వర్కింగ్ స్టైల్లో ఏ మాత్రం తేడా కనిపించడం లేదు. ‘పేట’ చిత్రాన్ని అనుకున్న సమయానికంటే ముందే పూర్తిచేసి అందర్నీ ఆశ్చర్యపరచారు రజనీకాంత్. ఇప్పుడు మండే ఎండల్లో కొత్త షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అయ్యారు. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్ 10న మొదలుపెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారట చిత్ర బృందం. ఏప్రిల్ అంటే ఫుల్‌గా ఎండలు ఉంటాయి కదా అంటే నిజమే... కానీ రజనీకి అవేం పట్టవు. అనుకుంటే ముందుకెళ్లాల్సిందే. అలాగే ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. సామాజికవేత్తగా, పోలీసాఫీసర్‌గా కనిపిస్తారట. ఇక ఈ చిత్రంలో నయనతార, కీర్తీసురేశ్ కథానాయిక పాత్రలు పోషించనున్నారని తెలిసింది. ఈ సినిమా కథ ముంబై నేపథ్యంలో సాగుతుందని, అందుకు తగ్గ సెట్‌వర్క్ ఆల్రెడీ పూర్తయిందని కోడంబాక్కమ్ వర్గాల టాక్. ఈ సినిమాకు అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తారు. సంతోష్ శివన్ కెమెరామ్యాన్. ఇంకా సెట్స్ పైకి వెళ్లని ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుందనే ప్రచారం జరుగుతోంది. -
డబుల్ ధమాకా?
రణ్‌బీర్ కపూర్, సంజయ్ దత్, వాణీ కపూర్ ముఖ్యతారలుగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘షంషేరా’. ఆదిత్యాచోప్రా నిర్మిస్తున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అడవిలో ఉన్న ఓ తెగ ఏ విధంగా పోరాటం చేసిందనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇందులో బందిపోటు పాత్రలో నటిస్తున్నారు రణ్‌బీర్‌కపూర్. డబుల్ యాక్షన్... అంటే తండ్రీకొడుకుల పాత్రల్లో నటిస్తున్నారట రణ్‌బీర్. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ రణ్‌బీర్ ద్విపాత్రాభినయం చేయలేదట. మరి.. ప్రచారంలో ఉన్నట్లుగా రణ్‌బీర్ రెండు పాత్రలు చేస్తున్నారా? లేదా అనేది వచ్చే ఏడాది జూలైలో తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అప్పుడే. ఇక ఈ సినిమా కాకుండా పీరియాడికల్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో నటిస్తున్నారు రణ్‌బీర్. వ్యక్తిగత విషయాని కొస్తే.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌తో రణ్‌బీర్ ప్రేమలో ఉన్నారని తెలిసిందే. -
10న తెరపైకి నాయకి
ఎవర్గ్రీన్ హీరోయిన్ త్రిష జూన్ 10వ తేదీన నాయకిగా తెరపైకి రానున్నారన్న విషయం ఆమె అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎన్నైఅరిందాల్,భూలోకం,తూంగావనం వంటి వరుస విజయాలు కథానాయకిగా త్రిష స్థానాన్ని సుస్థిరం చేశాయని చెప్పవచ్చు.ఆ తరువాత వచ్చిన అరణ్మణై-2 చిత్రం పెద్దగా విజయం సాధించక పోయినా త్రిష క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.తాజాగా నటిస్తున్న నాయకి చిత్రంపై ఇటు కోలీవుడ్‌లోనూ అటు టాలీవుడ్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. కారణం త్రిష ఇందులో తొలి సారిగా ద్విపాత్రాభినయం చేయడం.ఇది లేడీ ఓరియెంటెడ్ హారర్ కథా చిత్రం కావడం లాంటి పలు విశేషాలు చోటు చేసుకోవడం అని పేర్కొనవచ్చు.తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిషకు జంటగా గణేశ్వెంకట్రామ్ నటించారు.ఇతర ముఖ్య పాత్రల్లో సుష్మాస్వరాజ్,మనోబాలా,కోవైసరళ,జయప్రకాశ్ తదితరులు నటించారు. టాలీవుడ్ దర్శకుడు గోవి దర్శకత్వం వహించిన నాయకి చిత్రం జూన్ 10వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోందని సినీ వర్గాల సమాచారం.ప్రస్తుతం త్రిష ధనుష్ సరసన కొడి చిత్రంలో నటిస్తున్నారు.దీని తరువాత మరో హారర్ చిత్రంలో ఇంకోసారి ద్విపాత్రాభినయం చేయడానికి సిద్ధం అవుతున్నారు.అధిక భాగం విదేశాలలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి మాదేష్ దర్శకత్వం వహించనున్నారు. -
పాపం సీనియర్ నటిని బుక్ చేశారు
చెన్నై: తమిళనాడు లోని రెండు అగ్రపార్టీల మధ్య రాజకీయ పోరులో ఒక సీనియర్ నటి అనూహ్యంగా ఇరుక్కున్నారు. చెన్నైలో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచార హోరులో ఒక ప్రకటన విమర్శల పాలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారంకోసం మీడియాను విరివిగా వాడుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక టీవీ ప్రకటనల్లో ఊదరగొడుతున్న ప్రకటన వివాదస్పదమైంది. 'కన్నబిడ్డలే కూడు పెట్టలేదు, నాకు అన్నం పెట్టింది విప్లవనాయిక అమ్మనే' ఇది అన్నాడీఎంకే ఆధ్వర్యంలో అధినేత్రి పురిచ్చిత్తలైవిని ఆకాశానికెత్తుతూ సాగే ప్రకటన. ఎన్నికల ప్రచారంలో భాగంగా జయలలిత చేపట్టిన 'అమ్మ క్యాంటీన్' పథకం వల్ల తమ కుటుంబం భోజనం చేస్తోందని, అన్నం పెట్టిన అమ్మకు ధన్యవాదాలు చెబుతున్నానంటూ రూపొందించిన యాడ్ ఫిల్మ్. 'ఆకాశంలో ఎగిరేవారికి మన సమస్యలు ఎలా తెలుస్తాయి? ప్రజల గురించి పట్టించుకోని ప్రభుత్వం ఇంకెందుకండి, చాలమ్మా..'. ఇది అధికార పగ్గాల కోసం ఉబలాటపడుతూ ఎలాగైనా, అమ్మను గద్దెదించాలని ఆరాటపడుతున్న డీఎంకే ఎన్నికల ప్రచార ప్రకటన. ఈ రెండు ప్రచార ప్రకటనల దృశ్యాలు టీవీ ఛానెళ్లలో విసృత్తంగా రోజూ ప్రసారమవుతున్నాయి. అయితే ఇక్కడే వుంది అసలు కథ. ఆ రెండు ప్రచార ప్రకటన దృశ్యాల్లోనూ నటించిన నటి ఒక్కరే కావడం విశేషం. ఒకే వ్యక్తి ఒకసారి జయలలితను ప్రశంసిస్తూ, మరోసారి విమర్శిస్తూ నటించిన ఈ రెండు వేర్వేరు ప్రకటనలను టీవీలు పదేపదే ప్రసారం చేస్తున్నాయి. అంతేకాదు ఈ రెండు వీడియో సన్నివేశాలనూ వాట్సాప్ గ్రూపుల్లో అప్లోడ్ చేసారు. దీంతో వివాదం చెలరేగింది. రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ప్రజలతో ఇలాంటి తప్పుడు సందేశాలను ఇప్పిస్తున్నారంటూ పలువురు ఆరోపించడంతో వ్యవహారం కాస్తా ముదిరి పాకానపడింది. పాపం ఈ రెండు ప్రకనటల్లో నటించిన నటి పేరు కస్తూరి(64) . ముద్దుపేరు కస్తూరి పాటి (అమ్మమ్మ). చెన్నై తేనాంపేటలోని గుడిసెలో నివసించే కస్తూరిని దీనిపై వివరణ కోరగా.. ఆమె ఇలా చెప్పుకొచ్చారు... తాను ఎంత చెప్పినా వినకుండా ఇలా రెండు ప్రకటనల్లోను తనచేత నటింపచేశారని వాపోయింది. 20 రోజుల కిందట అమ్మ ప్రకటన కోసమంటూ నటించడానికి తనను తీసుకెళ్లారనీ, అందుకుగాను తనకు రూ.1,500 ఇచ్చారని తెలిపింది. ఆ తర్వాత కొద్దిరోజులకే మరో యాడ్ ఫిలిమ్‌లో నటించాలంటూ తీసుకెళ్లారని, అక్కడకు వెళ్లాక విషయం తెలిసిన వెంటనే , తన అభ్యంతరాన్ని తెలియజేశానని తెలిపింది. ఆ ప్రకటన అమ్మజయలలితకు వ్యతిరేకంగా ఉందని, అప్పటికే తాను అమ్మకు సానుకూలంగా ఓ ప్రచార వీడియో నటించానని వాళ్లకు చెప్పినా.... అయినా ఫర్వాలేదులే అని నటింపచేశారని, ఇందుకు గానూ తనకు రూ.1000 ఇచ్చి పంపించి వేశారని చెప్పింది. అయితే తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని వివరణ ఇచ్చుకుంది. ఎన్నికల్లో ఎవరు గెలిచినా తమలాంటి వాళ్లకు మంచి చేయాలని మాత్రం కోరుకుంటానని పేర్కొంది. కాగా ధనుష్ నటించిన మయక్కం ఎన్న, విజయ్ సేతుపతి నటించిన ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమార సంతానం నటించిన ఇనిమే ఇప్పడిదాన్ తదితర చిత్రాల్లో సహాయ నటిగా ఆమె నటించారు. -
మాయలో ఇద్దరిగా...
నయన సంచలన తారే కాదు...క్రేజీ బిజీ తార కూడా. రెండు సార్లు ప్రేమ బెడిసి కొట్టినా... రెండేళ్లు నటనకు దూరంగా ఉన్నా ...తాజాగా మళ్లీ పూర్వ వైభవం సాధించుకున్న నాయకి నయనతార. తమిళంలో నెంబర్ ఒన్ హీరోయిన్గా వెలుగొందుతున్న ఈ భామ చాలా గ్యాప్ తర్వాత సొంత గడ్డపై మోహన్‌లాల్‌తో జతకడుతున్నారు. కాగా, టాలీవుడ్‌లోని ఒక భారీ అవకాశం ఈ బ్యూటీ కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం తమిళంలో సూర్యతో మాస్, ఉదయనిధి స్టాలిన్ సరసన నన్బెండా... విజయ్ సేతుపతితో నానుం..రౌడీదాన్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా, మాజీ ప్రియుడు శింబుతో లవ్ పెయిల్యూర్ తర్వాత నటిస్తున్న ఇదు నమ్మ ఆలు చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. వీటితో పాటుగా నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మాయ. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేయడం విశేషం. అంతే కాదు, ఓ పాత్రలో తల్లిగా నటిస్తున్నారు. ఇది హర్రర్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈమె హర్రర్ చిత్రంలో నటించడం, ద్విపాత్రాభినయం చేయడం ఇదే తొలి సారి అన్నది గమనార్హం. కాగా, ఈ చిత్రం తమిళంతో పాటుగా తెలుగు, మలయాళంలో మయూర్పేరుతో ఏక కాలంలో సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో తెరమీదకు రానున్నది. -
డబుల్ ధమాకా!
ఇద్దరు హీరోలు ఒకేసారి తెరపై కనిపించడం, ఒకే హీరో ఇద్దరులా మారిపోయి అలరించడం.. నిజంగా ప్రేక్షకులకు భలే కిక్కిచ్చే విషయాలు. ముఖ్యంగా అభిమానులకైతే.. కన్నులపంటే. ఓ వైపు మల్టీస్టారర్లు, మరో వైపు ద్విపాత్రాభినయాలు.. ఒకప్పుడు ఇండస్ట్రీ వీటితో కళకళలాడిపోతూ ఉండేది. ఓ ఇరవైఏళ్లుగా వీటి హవా పెద్దగా లేదనే చెప్పాలి. హీరోలందరూ సింగిల్‌గానే చక్రం తిప్పడం మొదలుపెట్టారు. భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్లుగా.. ఇప్పుడిప్పుడే మళ్లీ పాత పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. శుభసూచకంగా ముందు తెలుగునాట మల్టీస్టారర్లు ఊపందుకుంటున్నాయి. మరోవైపు తమిళనాట ద్విపాత్రాభినయాలు హవా సాగిస్తున్నాయి. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంతదూరమో... ఆ ఇంటికి ఈ ఇల్లూ అంతే దూరం కదా! ఈ ట్రెండ్ అటు... ఆ ట్రెండ్ ఇటు మారడానికి బహుశా ఎంతో సమయం పట్టదేమో! ప్రస్తుతం దక్షిణాదిన ద్విపాత్రాభినయాల హవా ఎలా ఉందో చూద్దాం.. కొచ్చడయాన్-రాణాగా... ‘కొచ్చడయాన్’... అంటే పొడవాటి జుట్టుగలవాడని అర్థం. ఎనిమిదో శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ పాండ్యరాజు పేరు అది. పేరుకు తగ్గట్టే అద్భుత శక్తిగా ఇందులో రజనీకాంత్ కనిపిస్తారట. ఈ సినిమాలో ‘రాణా’ అనే మరో పాత్రలో కూడా కనిపిస్తారు సూపర్‌స్టార్. ద్విపాత్రాభినయం రజనీకి కొత్తేం కాదు. అయితే... రెండు పాత్రలు ఒకేసారి తెరపై వినోదాన్ని పంచుతాయా? లేక విడివిడిగా కనిపించి అలరిస్తాయా? అనేది తెలియాల్సి ఉంది. త్రీడీలో మోషన్ క్యాప్చర్ కంప్యూటర్ యానిమేటెడ్ టెక్నాలజీతో రజనీ కుమార్తె సౌందర్య తెరకెక్కించిన ఈ చిత్రం ‘విక్రమసింహ’గా తెలుగులో విడుదల కానుంది. తమిళనాట రజనీ అభిమానులు... ‘కొచ్చడయాన్’ ఘనవిజయాన్ని సాధించాలనీ రజనీ ఆరోగ్యం మరింత మెరుగుపడాలనీ ఆకాంక్షిస్తూ అప్పుడే పాద యాత్ర కూడా మొదలుపెట్టారట. వచ్చే నెలలోనే సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. రంగస్థల నటునిగా, సినిమా హీరోగా... కమల్‌హాసన్ అంటే.. ప్రయోగశాల. ప్రతి సినిమాలోనూ తన పాత్ర ద్వారా ఏదో ఒక కొత్తదనాన్ని చూపించాలని తపిస్తారాయన. త్వరలో ‘విశ్వరూపం-2’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు కమల్. ఈ సినిమా తర్వాత కమల్ నటించే సినిమా ‘ఉత్తమ విలన్’. రమేశ్ అరవింద్ దర్శకుడు. కమల్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తన కెరీర్లో లెక్కకు మించి ద్విపాత్రాభినయాలు చేసిన ఘనత కమల్‌ది. ఇక ‘దశావతారం’ గురించి సరేసరి. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఉత్తమ విలన్’ విషయానికొస్తే... 8వ శతాబ్దానికి చెందిన రంగస్థల నటునిగా, 21వ శతాబ్దానికి చెందిన సినిమా హీరోగా రెండు పాత్రల్లో కనిపించనున్నారాయన. కాబట్టి... ఈ రెండు పాత్రలూ తెరపై ఒకేసారి కనిపించడం బహుశా జరగదేమో! క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుందని సమాచారం. మళ్లీ విలన్‌గా, హీరోగా... తమిళనాట రజనీకాంత్ తర్వాత మళ్లీ అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్. ‘వీరమ్’ విజయంతో మంచి జోష్మీదున్నారాయన. తర్వాత అజిత్ చేసే సినిమా గౌతమ్ వాసుదేవ మీనన్‌ది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో అజిత్ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తారని సమాచారం. విలన్‌గా, హీరోగా అజిత్ ద్విపాత్రాభినయం చేసిన తమిళ చిత్రాలు ‘వాలి, విలన్’ అక్కడ ఘన విజయం సాధించాయి. సో... ఇది ఆయనకు బాగా కలిసొచ్చిన ఫీట్. ముచ్చటగా మూడోసారి కూడా అజిత్ నాయకునిగా, ప్రతినాయకునిగా కనిపించనుండటం ఆయన అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. అయితే.. ఈ సమాచారంలో నిజంలేదని కొట్టి పడేసేవారు కూడా ఉన్నారు. రెండూ స్టైలిష్‌గానే... కమల్‌హాసన్ తర్వాత ప్రయోగాలను అమితంగా ఇష్టపడే కథానాయకుడు సూర్య. అందుకే... అనతికాలంలోనే తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా పొందగలిగారాయన. ‘పేరళ గన్’ (తెలుగులో ‘సుందరాంగుడు’), వేల్, వారణమ్ ఆయిరమ్(తెలుగులో ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’), ‘7ఆమ్ అరివు’(తెలుగులో ‘సెవెన్త్ సెన్స్), ‘మాట్రాన్’(తెలుగులో ‘బ్రదర్స్’)... సూర్య ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు. ఈ తరంలో ఇంత తక్కువ కాలంలో ఇన్ని ద్విపాత్రాభినయాలు చేసిన హీరో సూర్య ఒక్కరే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘అంజాన్’. లింగుస్వామి దర్శకుడు. ఇందులో కూడా సూర్యది ద్విపాత్రాభినయమే. అయితే... ఇప్పటివరకూ రెండు పాత్రల్లోనూ సాధ్యమైనంత వరకూ వ్యత్యాసాన్ని చూపించిన సూర్య... ఈ దఫా మాత్రం రెండు పాత్రల్లోనూ స్టైలిష్‌గానే సందడి చేస్తారట. అమలాపాల్ డబుల్ ధమాకా ఇప్పుడున్న కథానాయికల్లో ద్విపాత్రాభినయాలు ఎక్కువగా చేసిన ఘనత అనుష్క సొంతం. ‘అరుంధతి, పంచాక్షరి, వర్ణ’ చిత్రాల్లో డ్యూయెల్రోల్స్ చేశారామె. ‘అమ్మాయి బావుంది’లో మీరా జాస్మిన్, ‘చారులత’ చిత్రం కోసం ప్రియమణి కూడా ద్విపాత్రాభినయాలు చేశారు. ఇప్పుడు అమలాపాల్ వంతు వచ్చింది. సముద్రఖని దర్శకత్వంలో రూపొందనున్న ‘కిట్నా’(పరిశీలనలో ఉన్న పేరు) సినిమా కోసం ఆమె ద్విపాత్రాభినయం చేయనున్నారు. జానపదంలో ద్విపాత్రాభినయం ఇక మన తెలుగు సినిమా విషయానికొస్తే.. నేటి యువహీరోల్లో ఎక్కువ ద్విపాత్రాభినయాలు చేసిన హీరో ఎన్టీఆర్. ఆంధ్రావాలా, అదుర్స్, శక్తి చిత్రాల్లో ఆయన డ్యూ యెల్ రోల్స్ చేశారు. ఈ విషయంలో ఆయన తర్వాతి స్థానం రామ్‌చరణ్‌ది. మగధీర, నాయక్ చిత్రాల్లో డ్యూయెల్రోల్స్ చేశారాయన. ప్రస్తుతం ఈ ఫీట్‌ని ‘బాహుబలి’ చిత్రం కోసం ప్రభాస్ చేస్తున్నారు. ఇందులో బాహుబలి, శివుడు పాత్రల్లో కనిపిస్తారాయన. ఇవి తండ్రీకొడుకుల పాత్రలు కావడం గమనార్హం. ఓ జానపద చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేయడం అనేది దాదాపు పాతికేళ్ల తర్వాత జరుగుతున్న ముచ్చట. అంజలి డ్యూయెల్ రోల్ వీరితో పాటు తెలుగమ్మాయి అంజలి కూడా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. కథ నచ్చడంతో వెంటనే డ్యూయెల్ రోల్‌కి పచ్చజెండా ఊపేశారట అంజలి. పైగా ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం విశేషం. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ‘జెండాపై కపిరాజు’ సినిమా కోసం నాని కూడా ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్‌లలో ద్విపాత్రాభినయం చేస్తున్న తారలు, సదరు చిత్రాల వివరాలివి. ఈ జాబితా ముందు ముందు మరింత పెరగొచ్చు. రొటీన్ కథలతో విసిగిపోయిన ప్రేక్షకులకు కాస్తంత కొత్తదనంతో పాటు, వినోదాన్ని కూడా అందించాలంటే... రచయితలు, దర్శకులు, హీరోలు ఈ మాత్రం రిస్క్‌లు చేయాల్సిందే. వీరు ఆ విధంగా ముందుకెళితే... మున్ముందు మరిన్ని మంచి సినిమాలొచ్చే అవకాశం ఉంటుంది. ఏమంటారు?