పాపం సీనియర్ నటిని బుక్ చేశారు
చెన్నై: తమిళనాడు లోని రెండు అగ్రపార్టీల మధ్య రాజకీయ పోరులో ఒక సీనియర్ నటి అనూహ్యంగా ఇరుక్కున్నారు. చెన్నైలో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచార హోరులో ఒక ప్రకటన విమర్శల పాలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారంకోసం మీడియాను విరివిగా వాడుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక టీవీ ప్రకటనల్లో ఊదరగొడుతున్న ప్రకటన వివాదస్పదమైంది.
'కన్నబిడ్డలే కూడు పెట్టలేదు, నాకు అన్నం పెట్టింది విప్లవనాయిక అమ్మనే' ఇది అన్నాడీఎంకే ఆధ్వర్యంలో అధినేత్రి పురిచ్చిత్తలైవిని ఆకాశానికెత్తుతూ సాగే ప్రకటన. ఎన్నికల ప్రచారంలో భాగంగా జయలలిత చేపట్టిన 'అమ్మ క్యాంటీన్' పథకం వల్ల తమ కుటుంబం భోజనం చేస్తోందని, అన్నం పెట్టిన అమ్మకు ధన్యవాదాలు చెబుతున్నానంటూ రూపొందించిన యాడ్ ఫిల్మ్.
'ఆకాశంలో ఎగిరేవారికి మన సమస్యలు ఎలా తెలుస్తాయి? ప్రజల గురించి పట్టించుకోని ప్రభుత్వం ఇంకెందుకండి, చాలమ్మా..'. ఇది అధికార పగ్గాల కోసం ఉబలాటపడుతూ ఎలాగైనా, అమ్మను గద్దెదించాలని ఆరాటపడుతున్న డీఎంకే ఎన్నికల ప్రచార ప్రకటన. ఈ రెండు ప్రచార ప్రకటనల దృశ్యాలు టీవీ ఛానెళ్లలో విసృత్తంగా రోజూ ప్రసారమవుతున్నాయి. అయితే ఇక్కడే వుంది అసలు కథ.
ఆ రెండు ప్రచార ప్రకటన దృశ్యాల్లోనూ నటించిన నటి ఒక్కరే కావడం విశేషం. ఒకే వ్యక్తి ఒకసారి జయలలితను ప్రశంసిస్తూ, మరోసారి విమర్శిస్తూ నటించిన ఈ రెండు వేర్వేరు ప్రకటనలను టీవీలు పదేపదే ప్రసారం చేస్తున్నాయి. అంతేకాదు ఈ రెండు వీడియో సన్నివేశాలనూ వాట్సాప్ గ్రూపుల్లో అప్‌లోడ్ చేసారు. దీంతో వివాదం చెలరేగింది. రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ప్రజలతో ఇలాంటి తప్పుడు సందేశాలను ఇప్పిస్తున్నారంటూ పలువురు ఆరోపించడంతో వ్యవహారం కాస్తా ముదిరి పాకానపడింది.
పాపం ఈ రెండు ప్రకనటల్లో నటించిన నటి పేరు కస్తూరి(64) . ముద్దుపేరు కస్తూరి పాటి (అమ్మమ్మ). చెన్నై తేనాంపేటలోని గుడిసెలో నివసించే కస్తూరిని దీనిపై వివరణ కోరగా.. ఆమె ఇలా చెప్పుకొచ్చారు... తాను ఎంత చెప్పినా వినకుండా ఇలా రెండు ప్రకటనల్లోను తనచేత నటింపచేశారని వాపోయింది. 20 రోజుల కిందట అమ్మ ప్రకటన కోసమంటూ నటించడానికి తనను తీసుకెళ్లారనీ, అందుకుగాను తనకు రూ.1,500 ఇచ్చారని తెలిపింది. ఆ తర్వాత కొద్దిరోజులకే మరో యాడ్ ఫిలిమ్‌లో నటించాలంటూ తీసుకెళ్లారని, అక్కడకు వెళ్లాక విషయం తెలిసిన వెంటనే , తన అభ్యంతరాన్ని తెలియజేశానని తెలిపింది.
ఆ ప్రకటన అమ్మజయలలితకు వ్యతిరేకంగా ఉందని, అప్పటికే తాను అమ్మకు సానుకూలంగా ఓ ప్రచార వీడియో నటించానని వాళ్లకు చెప్పినా.... అయినా ఫర్వాలేదులే అని నటింపచేశారని, ఇందుకు గానూ తనకు రూ.1000 ఇచ్చి పంపించి వేశారని చెప్పింది. అయితే తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని వివరణ ఇచ్చుకుంది. ఎన్నికల్లో ఎవరు గెలిచినా తమలాంటి వాళ్లకు మంచి చేయాలని మాత్రం కోరుకుంటానని పేర్కొంది. కాగా ధనుష్ నటించిన మయక్కం ఎన్న, విజయ్ సేతుపతి నటించిన ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమార సంతానం నటించిన ఇనిమే ఇప్పడిదాన్ తదితర చిత్రాల్లో సహాయ నటిగా ఆమె నటించారు.