డబుల్ ధమాకా! | doublle impact | Sakshi
Sakshi News home page

డబుల్ ధమాకా!

Published Mon, Mar 24 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM

డబుల్ ధమాకా!

డబుల్ ధమాకా!

 ఇద్దరు హీరోలు ఒకేసారి తెరపై కనిపించడం, ఒకే హీరో ఇద్దరులా మారిపోయి అలరించడం.. నిజంగా ప్రేక్షకులకు భలే కిక్కిచ్చే విషయాలు. ముఖ్యంగా అభిమానులకైతే.. కన్నులపంటే. ఓ వైపు మల్టీస్టారర్లు, మరో వైపు ద్విపాత్రాభినయాలు.. ఒకప్పుడు ఇండస్ట్రీ వీటితో కళకళలాడిపోతూ ఉండేది. ఓ ఇరవైఏళ్లుగా వీటి హవా పెద్దగా లేదనే చెప్పాలి. హీరోలందరూ సింగిల్‌గానే  చక్రం తిప్పడం మొదలుపెట్టారు.

భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్లుగా.. ఇప్పుడిప్పుడే మళ్లీ పాత పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. శుభసూచకంగా ముందు తెలుగునాట మల్టీస్టారర్లు ఊపందుకుంటున్నాయి. మరోవైపు తమిళనాట ద్విపాత్రాభినయాలు హవా సాగిస్తున్నాయి. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంతదూరమో... ఆ ఇంటికి ఈ ఇల్లూ అంతే దూరం కదా! ఈ ట్రెండ్ అటు... ఆ ట్రెండ్ ఇటు మారడానికి బహుశా ఎంతో సమయం పట్టదేమో! ప్రస్తుతం దక్షిణాదిన ద్విపాత్రాభినయాల హవా ఎలా ఉందో చూద్దాం..

  కొచ్చడయాన్-రాణాగా...
 
‘కొచ్చడయాన్’... అంటే పొడవాటి జుట్టుగలవాడని అర్థం. ఎనిమిదో శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ పాండ్యరాజు పేరు అది. పేరుకు తగ్గట్టే అద్భుత శక్తిగా ఇందులో రజనీకాంత్ కనిపిస్తారట. ఈ సినిమాలో ‘రాణా’ అనే మరో పాత్రలో కూడా కనిపిస్తారు సూపర్‌స్టార్. ద్విపాత్రాభినయం రజనీకి కొత్తేం కాదు. అయితే... రెండు పాత్రలు ఒకేసారి తెరపై వినోదాన్ని పంచుతాయా? లేక విడివిడిగా కనిపించి అలరిస్తాయా? అనేది తెలియాల్సి ఉంది. త్రీడీలో మోషన్ క్యాప్చర్ కంప్యూటర్ యానిమేటెడ్ టెక్నాలజీతో రజనీ కుమార్తె సౌందర్య తెరకెక్కించిన ఈ చిత్రం ‘విక్రమసింహ’గా తెలుగులో విడుదల కానుంది. తమిళనాట రజనీ అభిమానులు... ‘కొచ్చడయాన్’ ఘనవిజయాన్ని సాధించాలనీ రజనీ ఆరోగ్యం మరింత మెరుగుపడాలనీ ఆకాంక్షిస్తూ అప్పుడే పాద యాత్ర కూడా మొదలుపెట్టారట. వచ్చే నెలలోనే సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.
 రంగస్థల నటునిగా, సినిమా హీరోగా...

 కమల్‌హాసన్ అంటే.. ప్రయోగశాల. ప్రతి సినిమాలోనూ తన పాత్ర ద్వారా ఏదో ఒక కొత్తదనాన్ని చూపించాలని తపిస్తారాయన. త్వరలో ‘విశ్వరూపం-2’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు కమల్. ఈ సినిమా తర్వాత కమల్ నటించే సినిమా ‘ఉత్తమ విలన్’. రమేశ్ అరవింద్ దర్శకుడు. కమల్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తన కెరీర్‌లో లెక్కకు మించి ద్విపాత్రాభినయాలు చేసిన ఘనత కమల్‌ది. ఇక ‘దశావతారం’ గురించి సరేసరి. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఉత్తమ విలన్’ విషయానికొస్తే... 8వ శతాబ్దానికి చెందిన రంగస్థల నటునిగా, 21వ శతాబ్దానికి చెందిన సినిమా హీరోగా రెండు పాత్రల్లో కనిపించనున్నారాయన. కాబట్టి... ఈ రెండు పాత్రలూ తెరపై ఒకేసారి కనిపించడం బహుశా జరగదేమో! క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుందని సమాచారం.

 మళ్లీ విలన్‌గా, హీరోగా...

 తమిళనాట రజనీకాంత్ తర్వాత మళ్లీ అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్. ‘వీరమ్’ విజయంతో మంచి జోష్‌మీదున్నారాయన. తర్వాత అజిత్ చేసే సినిమా గౌతమ్ వాసుదేవ మీనన్‌ది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో అజిత్ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తారని సమాచారం. విలన్‌గా, హీరోగా అజిత్ ద్విపాత్రాభినయం చేసిన తమిళ చిత్రాలు ‘వాలి, విలన్’ అక్కడ ఘన విజయం సాధించాయి. సో... ఇది ఆయనకు బాగా కలిసొచ్చిన ఫీట్. ముచ్చటగా మూడోసారి కూడా అజిత్ నాయకునిగా, ప్రతినాయకునిగా కనిపించనుండటం ఆయన అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. అయితే.. ఈ సమాచారంలో నిజంలేదని కొట్టి పడేసేవారు కూడా ఉన్నారు.

రెండూ స్టైలిష్‌గానే...  కమల్‌హాసన్ తర్వాత ప్రయోగాలను అమితంగా ఇష్టపడే కథానాయకుడు సూర్య. అందుకే... అనతికాలంలోనే తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా పొందగలిగారాయన. ‘పేరళ గన్’ (తెలుగులో ‘సుందరాంగుడు’), వేల్, వారణమ్ ఆయిరమ్(తెలుగులో ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’), ‘7ఆమ్ అరివు’(తెలుగులో ‘సెవెన్త్ సెన్స్), ‘మాట్రాన్’(తెలుగులో ‘బ్రదర్స్’)... సూర్య ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు. ఈ తరంలో ఇంత తక్కువ కాలంలో ఇన్ని ద్విపాత్రాభినయాలు చేసిన హీరో సూర్య ఒక్కరే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘అంజాన్’. లింగుస్వామి దర్శకుడు. ఇందులో కూడా సూర్యది ద్విపాత్రాభినయమే. అయితే... ఇప్పటివరకూ రెండు పాత్రల్లోనూ సాధ్యమైనంత వరకూ వ్యత్యాసాన్ని చూపించిన సూర్య... ఈ దఫా మాత్రం రెండు పాత్రల్లోనూ స్టైలిష్‌గానే సందడి చేస్తారట.

 అమలాపాల్ డబుల్ ధమాకా

 ఇప్పుడున్న కథానాయికల్లో ద్విపాత్రాభినయాలు ఎక్కువగా చేసిన ఘనత అనుష్క సొంతం. ‘అరుంధతి, పంచాక్షరి, వర్ణ’ చిత్రాల్లో డ్యూయెల్‌రోల్స్ చేశారామె. ‘అమ్మాయి బావుంది’లో మీరా జాస్మిన్, ‘చారులత’ చిత్రం కోసం ప్రియమణి కూడా ద్విపాత్రాభినయాలు చేశారు. ఇప్పుడు అమలాపాల్ వంతు వచ్చింది. సముద్రఖని దర్శకత్వంలో రూపొందనున్న ‘కిట్‌నా’(పరిశీలనలో ఉన్న పేరు) సినిమా కోసం ఆమె ద్విపాత్రాభినయం చేయనున్నారు.

 జానపదంలో ద్విపాత్రాభినయం
 
ఇక మన తెలుగు సినిమా విషయానికొస్తే.. నేటి యువహీరోల్లో ఎక్కువ ద్విపాత్రాభినయాలు చేసిన హీరో ఎన్టీఆర్. ఆంధ్రావాలా, అదుర్స్, శక్తి చిత్రాల్లో ఆయన డ్యూ యెల్ రోల్స్ చేశారు. ఈ విషయంలో ఆయన తర్వాతి స్థానం రామ్‌చరణ్‌ది. మగధీర, నాయక్ చిత్రాల్లో డ్యూయెల్‌రోల్స్ చేశారాయన. ప్రస్తుతం ఈ ఫీట్‌ని ‘బాహుబలి’ చిత్రం కోసం ప్రభాస్ చేస్తున్నారు. ఇందులో బాహుబలి, శివుడు పాత్రల్లో కనిపిస్తారాయన. ఇవి తండ్రీకొడుకుల పాత్రలు కావడం గమనార్హం.  ఓ జానపద చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేయడం అనేది దాదాపు పాతికేళ్ల తర్వాత జరుగుతున్న ముచ్చట.

 అంజలి డ్యూయెల్ రోల్

 వీరితో పాటు తెలుగమ్మాయి అంజలి కూడా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. కథ నచ్చడంతో వెంటనే డ్యూయెల్ రోల్‌కి పచ్చజెండా ఊపేశారట అంజలి. పైగా ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం విశేషం. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
 సముద్రఖని దర్శకత్వం వహించిన ‘జెండాపై కపిరాజు’ సినిమా కోసం నాని కూడా ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

 ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్‌లలో ద్విపాత్రాభినయం చేస్తున్న తారలు, సదరు చిత్రాల వివరాలివి. ఈ జాబితా ముందు ముందు మరింత పెరగొచ్చు. రొటీన్ కథలతో విసిగిపోయిన ప్రేక్షకులకు కాస్తంత కొత్తదనంతో పాటు, వినోదాన్ని కూడా అందించాలంటే... రచయితలు, దర్శకులు,  హీరోలు ఈ మాత్రం రిస్క్‌లు చేయాల్సిందే. వీరు ఆ విధంగా ముందుకెళితే... మున్ముందు మరిన్ని మంచి సినిమాలొచ్చే అవకాశం ఉంటుంది. ఏమంటారు?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement