Koccadayan
-
మళ్లీ వాయిదా
తమిళసినిమా, న్యూస్‌లైన్ : కోచ్చడయాన్ చిత్రం విడుదల అనూహ్యంగా మరోసారి వాయిదాపడింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కోచ్చడయాన్. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించారు. భారతదేశంలోనే తొలిసారిగా కాప్చరింగ్ ఫార్మెట్లో రూపొందిన 3డి యానిమేషన్ చిత్రం ఇది. హాలీవుడ్ చిత్రాలు అవతార్ టిన్టిన్ చిత్రాల తరహాలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రం విడుదల ఇప్పటికే పలుసార్లు వాయిదాపడుతూ వచ్చింది. అయితే మే నెల 9న చిత్రాన్ని ఖచ్చితంగా విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఆ విధంగా పబ్లిసిటీ కూడా చేస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితిలో బుధవారం అనూహ్యంగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. కోచ్చడయాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆరువేల ప్రింట్లతో 2డి, 3డి ఫార్మెట్లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు అయితే కొన్ని సాంకేతిక కారణాల వలన చిత్రాన్ని ఈ నెల 9న కాకుండా 23న విడుదల చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో సూపర్‌స్టార్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురయ్యిందనే చెప్పాలి. -
స్టయిల్ కింగ్‌ను కాను
కోట్లాది అభిమానుల ఆరాధ్యదైవం రజనీకాంత్. నటనా పరంగా ఆయన స్టయిల్త ఒక్కో కోణంలో ఒక్కో రకంగా ఉంటుంది. అందుకే అభిమానులందరూ ఆయన్ని స్టయిల్ కింగ్ అంటారు. అయితే రజనీకాంత్ మాత్రం స్టయిల్ కింగ్‌ను తాను కాదంటున్నారు. రజనీకాంత్ టీవీల్లో ఇంటర్వ్యూ ఇచ్చి చాలా కాలం అయ్యింది. ఆయన నటించిన బ్రహ్మాండ చిత్రం కోచ్చడయాన్ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా తమిళ ఉగాదిని పురస్కరించుకుని రజనీ ఒక చానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. హాస్యనటుడు వివేక్ అడిగిన ప్రశ్నలకు ఆయన కింది విధంగా బదులిచ్చారు. మీకు ఇద్దరు అమ్మాయిలే పుట్టారు. అబ్బాయిలు లేరన్న చింత లేదా? లేదు. ఈ విషయం గురించి నన్నింతకుముందు చాలామంది అడిగారు. నేను నా భార్యను ఈ విషయం గురించి అడిగాను. ఆమె ఎలాంటి బాధా లేదన్నారు. భారతదేశంలోనే స్టయిల్ కింగ్ అంటే మీరేనటగా? నేను కాదు. శివాజి గణేశన్‌నే స్టయిల్ కింగ్. ఆయన నటనలో కొత్త స్టయిల్ చూపిస్తారు. మీ స్టయిల్లో ప్రధానమైంది సిగరెట్ తాగడమేగా? నిజమే. అయితే ఆ వరమే చివరికి శాపంగా మారింది. సిగరెట్ బానిసలకు మీరిచ్చే సందేశం? దేనికైనా హద్దులు విధించుకోండి. ఏ అలవాటుకు బానిసలు కాకండి. మహాభారత కావ్యాన్ని చిత్రంగా తెరకెక్కిస్తే అందులో మీరే పాత్ర పోషిస్తారు? కర్ణుడి పాత్ర. యాక్షన్ హీరోగా ఎదిగిన మీరు తిల్లుముల్లు, తంబిక్కు ఎంద ఊరు లాంటి చిత్రాల్లో హాస్య పాత్రల్లో ఎలా మెప్పించగలిగారు? దీనికి కారణం దర్శకుడు కె.బాలచందర్. నటన, డాన్స్ బాగా చేస్తావు, హాస్యరసాన్ని పండించగలవు. అయితే కామెడీలో నిన్ను ఎవరూ సరిగా ఉపయోగించుకోలేదు. నేను తిల్లుముల్లు చిత్రంలో నిన్ను ఆ కోణంలో ఉపయోగించుకుంటానని బాలచందర్ పేర్కొన్నారు. మీరు ఇటీవల కోచ్చడయాన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో శత్రువులను జయించడానికి ప్రధాన మార్గం క్షమాపణ అని పేర్కొన్నారు. మీ శత్రువులను క్షమించారా? చాలాసార్లు చాలా మందిని క్షమించాను. క్షమించడంలో ఎంతో సంతోషం, ప్రశాంతత కలుగుతుంది. నటులు అజిత్, విజయ్‌లలో మీకు నచ్చిన విషయాలు? అజిత్‌లో నిర్మొహమాటంగా మాట్లాడే గుణం. విజయ్‌లో నెమ్మది మనస్తత్వం నచ్చుతాయి. -
డబుల్ ధమాకా!
ఇద్దరు హీరోలు ఒకేసారి తెరపై కనిపించడం, ఒకే హీరో ఇద్దరులా మారిపోయి అలరించడం.. నిజంగా ప్రేక్షకులకు భలే కిక్కిచ్చే విషయాలు. ముఖ్యంగా అభిమానులకైతే.. కన్నులపంటే. ఓ వైపు మల్టీస్టారర్లు, మరో వైపు ద్విపాత్రాభినయాలు.. ఒకప్పుడు ఇండస్ట్రీ వీటితో కళకళలాడిపోతూ ఉండేది. ఓ ఇరవైఏళ్లుగా వీటి హవా పెద్దగా లేదనే చెప్పాలి. హీరోలందరూ సింగిల్‌గానే చక్రం తిప్పడం మొదలుపెట్టారు. భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్లుగా.. ఇప్పుడిప్పుడే మళ్లీ పాత పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. శుభసూచకంగా ముందు తెలుగునాట మల్టీస్టారర్లు ఊపందుకుంటున్నాయి. మరోవైపు తమిళనాట ద్విపాత్రాభినయాలు హవా సాగిస్తున్నాయి. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంతదూరమో... ఆ ఇంటికి ఈ ఇల్లూ అంతే దూరం కదా! ఈ ట్రెండ్ అటు... ఆ ట్రెండ్ ఇటు మారడానికి బహుశా ఎంతో సమయం పట్టదేమో! ప్రస్తుతం దక్షిణాదిన ద్విపాత్రాభినయాల హవా ఎలా ఉందో చూద్దాం.. కొచ్చడయాన్-రాణాగా... ‘కొచ్చడయాన్’... అంటే పొడవాటి జుట్టుగలవాడని అర్థం. ఎనిమిదో శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ పాండ్యరాజు పేరు అది. పేరుకు తగ్గట్టే అద్భుత శక్తిగా ఇందులో రజనీకాంత్ కనిపిస్తారట. ఈ సినిమాలో ‘రాణా’ అనే మరో పాత్రలో కూడా కనిపిస్తారు సూపర్‌స్టార్. ద్విపాత్రాభినయం రజనీకి కొత్తేం కాదు. అయితే... రెండు పాత్రలు ఒకేసారి తెరపై వినోదాన్ని పంచుతాయా? లేక విడివిడిగా కనిపించి అలరిస్తాయా? అనేది తెలియాల్సి ఉంది. త్రీడీలో మోషన్ క్యాప్చర్ కంప్యూటర్ యానిమేటెడ్ టెక్నాలజీతో రజనీ కుమార్తె సౌందర్య తెరకెక్కించిన ఈ చిత్రం ‘విక్రమసింహ’గా తెలుగులో విడుదల కానుంది. తమిళనాట రజనీ అభిమానులు... ‘కొచ్చడయాన్’ ఘనవిజయాన్ని సాధించాలనీ రజనీ ఆరోగ్యం మరింత మెరుగుపడాలనీ ఆకాంక్షిస్తూ అప్పుడే పాద యాత్ర కూడా మొదలుపెట్టారట. వచ్చే నెలలోనే సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. రంగస్థల నటునిగా, సినిమా హీరోగా... కమల్‌హాసన్ అంటే.. ప్రయోగశాల. ప్రతి సినిమాలోనూ తన పాత్ర ద్వారా ఏదో ఒక కొత్తదనాన్ని చూపించాలని తపిస్తారాయన. త్వరలో ‘విశ్వరూపం-2’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు కమల్. ఈ సినిమా తర్వాత కమల్ నటించే సినిమా ‘ఉత్తమ విలన్’. రమేశ్ అరవింద్ దర్శకుడు. కమల్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తన కెరీర్లో లెక్కకు మించి ద్విపాత్రాభినయాలు చేసిన ఘనత కమల్‌ది. ఇక ‘దశావతారం’ గురించి సరేసరి. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఉత్తమ విలన్’ విషయానికొస్తే... 8వ శతాబ్దానికి చెందిన రంగస్థల నటునిగా, 21వ శతాబ్దానికి చెందిన సినిమా హీరోగా రెండు పాత్రల్లో కనిపించనున్నారాయన. కాబట్టి... ఈ రెండు పాత్రలూ తెరపై ఒకేసారి కనిపించడం బహుశా జరగదేమో! క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుందని సమాచారం. మళ్లీ విలన్‌గా, హీరోగా... తమిళనాట రజనీకాంత్ తర్వాత మళ్లీ అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్. ‘వీరమ్’ విజయంతో మంచి జోష్మీదున్నారాయన. తర్వాత అజిత్ చేసే సినిమా గౌతమ్ వాసుదేవ మీనన్‌ది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో అజిత్ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తారని సమాచారం. విలన్‌గా, హీరోగా అజిత్ ద్విపాత్రాభినయం చేసిన తమిళ చిత్రాలు ‘వాలి, విలన్’ అక్కడ ఘన విజయం సాధించాయి. సో... ఇది ఆయనకు బాగా కలిసొచ్చిన ఫీట్. ముచ్చటగా మూడోసారి కూడా అజిత్ నాయకునిగా, ప్రతినాయకునిగా కనిపించనుండటం ఆయన అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. అయితే.. ఈ సమాచారంలో నిజంలేదని కొట్టి పడేసేవారు కూడా ఉన్నారు. రెండూ స్టైలిష్‌గానే... కమల్‌హాసన్ తర్వాత ప్రయోగాలను అమితంగా ఇష్టపడే కథానాయకుడు సూర్య. అందుకే... అనతికాలంలోనే తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా పొందగలిగారాయన. ‘పేరళ గన్’ (తెలుగులో ‘సుందరాంగుడు’), వేల్, వారణమ్ ఆయిరమ్(తెలుగులో ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’), ‘7ఆమ్ అరివు’(తెలుగులో ‘సెవెన్త్ సెన్స్), ‘మాట్రాన్’(తెలుగులో ‘బ్రదర్స్’)... సూర్య ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు. ఈ తరంలో ఇంత తక్కువ కాలంలో ఇన్ని ద్విపాత్రాభినయాలు చేసిన హీరో సూర్య ఒక్కరే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘అంజాన్’. లింగుస్వామి దర్శకుడు. ఇందులో కూడా సూర్యది ద్విపాత్రాభినయమే. అయితే... ఇప్పటివరకూ రెండు పాత్రల్లోనూ సాధ్యమైనంత వరకూ వ్యత్యాసాన్ని చూపించిన సూర్య... ఈ దఫా మాత్రం రెండు పాత్రల్లోనూ స్టైలిష్‌గానే సందడి చేస్తారట. అమలాపాల్ డబుల్ ధమాకా ఇప్పుడున్న కథానాయికల్లో ద్విపాత్రాభినయాలు ఎక్కువగా చేసిన ఘనత అనుష్క సొంతం. ‘అరుంధతి, పంచాక్షరి, వర్ణ’ చిత్రాల్లో డ్యూయెల్రోల్స్ చేశారామె. ‘అమ్మాయి బావుంది’లో మీరా జాస్మిన్, ‘చారులత’ చిత్రం కోసం ప్రియమణి కూడా ద్విపాత్రాభినయాలు చేశారు. ఇప్పుడు అమలాపాల్ వంతు వచ్చింది. సముద్రఖని దర్శకత్వంలో రూపొందనున్న ‘కిట్నా’(పరిశీలనలో ఉన్న పేరు) సినిమా కోసం ఆమె ద్విపాత్రాభినయం చేయనున్నారు. జానపదంలో ద్విపాత్రాభినయం ఇక మన తెలుగు సినిమా విషయానికొస్తే.. నేటి యువహీరోల్లో ఎక్కువ ద్విపాత్రాభినయాలు చేసిన హీరో ఎన్టీఆర్. ఆంధ్రావాలా, అదుర్స్, శక్తి చిత్రాల్లో ఆయన డ్యూ యెల్ రోల్స్ చేశారు. ఈ విషయంలో ఆయన తర్వాతి స్థానం రామ్‌చరణ్‌ది. మగధీర, నాయక్ చిత్రాల్లో డ్యూయెల్రోల్స్ చేశారాయన. ప్రస్తుతం ఈ ఫీట్‌ని ‘బాహుబలి’ చిత్రం కోసం ప్రభాస్ చేస్తున్నారు. ఇందులో బాహుబలి, శివుడు పాత్రల్లో కనిపిస్తారాయన. ఇవి తండ్రీకొడుకుల పాత్రలు కావడం గమనార్హం. ఓ జానపద చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేయడం అనేది దాదాపు పాతికేళ్ల తర్వాత జరుగుతున్న ముచ్చట. అంజలి డ్యూయెల్ రోల్ వీరితో పాటు తెలుగమ్మాయి అంజలి కూడా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. కథ నచ్చడంతో వెంటనే డ్యూయెల్ రోల్‌కి పచ్చజెండా ఊపేశారట అంజలి. పైగా ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం విశేషం. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ‘జెండాపై కపిరాజు’ సినిమా కోసం నాని కూడా ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్‌లలో ద్విపాత్రాభినయం చేస్తున్న తారలు, సదరు చిత్రాల వివరాలివి. ఈ జాబితా ముందు ముందు మరింత పెరగొచ్చు. రొటీన్ కథలతో విసిగిపోయిన ప్రేక్షకులకు కాస్తంత కొత్తదనంతో పాటు, వినోదాన్ని కూడా అందించాలంటే... రచయితలు, దర్శకులు, హీరోలు ఈ మాత్రం రిస్క్‌లు చేయాల్సిందే. వీరు ఆ విధంగా ముందుకెళితే... మున్ముందు మరిన్ని మంచి సినిమాలొచ్చే అవకాశం ఉంటుంది. ఏమంటారు? -
సినిమాల జాతర
ఎప్పుడైనా సినిమా ఒక కాలక్షేప మాధ్యమమే. కాలానుగుణంగా వచ్చే మార్పులతో దాని రూపం మారుతుండవచ్చుగానీ సినిమా జీవితం కాదు. జీవితాల్లోని కొన్ని సంఘటనలు దీనికి ముడి పదార్థం అయినా కల్పితం లేకుండా అది కథ కాలేదు. అలాంటి కథలకు ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించి వెండితెరపై అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. ఒకప్పుడు కథ, కథనాలను నమ్ముకున్న సినిమా రూపకర్తలు ఇప్పుడు కంప్యూటర్ వంటి ఆధునిక పరిజ్ఞానం వెంట పరుగెడుతున్నారు. అలాంటి సిత్రాల జోరును ఈ ఏడాది ఎక్కువగానే చూడవచ్చు. అదే విధంగా భారీ చిత్రాల బజానా కూడా 2014లో అధికంగానే ఉంది. 2012 కంటే 2013లో అధిక చిత్రాలు తెరపైకి వచ్చాయి. ఇది ఆహ్వానించదగ్గ విషయమే అయినా, విజయాల శాతం 15 దాట లేదు. అరుుతే ఈ ఏడాది ప్రథమార్థంలో రెండు చిత్రాల గురించే సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవి కోచ్చడయాన్, విశ్వరూపం-2. విశ్వరూపం కంటే ఎక్కువగా విశ్వనాయకుడు కమల్ హాసన్ విశ్వరూపం-2పై భారీ అంచనాలున్నాయి. సెల్యులాయిడ్‌పై సంచలనాలు సృష్టించిన విశ్వరూపానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ కమల్ హాసన్. విశ్వరూపంలో అలరించిన పూజా కుమార్, ఆండ్రియాలే ఈ చిత్రంలోను తమ అందం, అభినయాలతో అభిమానుల్ని ఓలలాడించనున్నారు. ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో నిపుణులయిన సాంకేతిక పరివా రం పని చేస్తున్నారు. కమల్ సాంకేతిక దాహానికి ఈ విశ్వరూపం-2 నిదర్శనంగా నిలవనుంది. విశ్వరూపంను మించి ఈ చిత్రం ఉంటుందని స్వయంగా కమల్‌నే వెల్లడించారు. ఈ చిత్రం జనవరిలోనే విడుదలవుతుందని ప్రచారం జరిగింది. ఇది ఫిబ్రవరిలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కోచ్చడయాన్‌లో ప్రత్యేకతలు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అత్యంత భారీ చిత్రం కోచ్చడయాన్. ఇందులో ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. రజనీ ద్విపాత్రాభినయం, హాలీవుడ్ చిత్రం అవతార్ తరహాలో మోషన్ కాప్సరింగ్ ఫార్మెట్‌తో పాటు 3డీలో రూపొందుతున్న తొలి భారతీయ చిత్రం ఇది. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్, జాకీష్రాఫ్, శరత్ కుమార్, ఆది, శోభన, నాజర్ వంటి నట దిగ్గజాలు నటిస్తున్న చిత్రం. సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కథ, కథనాలు అందించారు. చిత్ర గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్‌ను ఆస్ట్రేలియా, లాస్ ఏంజిల్స్‌లోని సాంకేతిక నిపుణులతో రూపొందిస్తున్న చిత్రం. రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య, అశ్విన్ అద్భుత సృష్టి కోచ్చడయాన్. పాటలను గత ఏడాది డిసెంబర్ 12న, చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయమన్నట్లు ప్రకటించారు. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో చిత్ర ఆడియోను ఫిబ్రవరి 15న, చిత్రాన్ని ఏప్రిల్‌లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామీణ ‘వీరం’ ఈ ఏడాది ఆదిలో శుభారంభాన్ని పలుకుతున్న రెండు చిత్రాలపై భారీ అంచనాలున్నాయి. వాటిలో ఒకటి అజిత్ నటించిన వీరం. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్ పతాకంపై బి.నాగిరెడ్డి ఆశీస్సులతో బి.వెంకట్రామిరెడి, భారతీ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్ సరసన తమన్నా హీరోయిన్గా నటించారు. చిరుత్తైఫేమ్ శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విదార్థ్, బాలా వంటి యువ హీరోలు నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో అజిత్ గెటప్, స్టైల్స్, యాక్టింగ్ డిఫరెంట్‌గా ఉంటాయంటున్నారు చిత్ర వర్గాలు. పూర్తి గ్రామీణ వాతావరణంలో రూపొందిన వీరం భారీ స్థాయిలో శుక్రవారం తెరపైకి రానుంది. భారీ అంచనాలతో ‘జిల్లా’ విజయ్ నటించిన జిల్లా చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్బి చౌదరి నిర్మించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఉన్నారు. తుపాకి తరువాత విజయ్, కాజల్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి నేశన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ముఖ్యపాత్రను పోషించడం విశేషం. చాలాకాలం తరువాత సమకాలిక నటుడు అజిత్, విజయ్ నటించిన చిత్రాలు ఒకే రోజున తెరపైకి రావడం మరో విశేషం. వీటితోపాటు విశాల్ నటిస్తున్న నాన్ శివప్పు మనిదన్, జయం రవి నటించిన నిమిర్న్ందునిల్ వంటి మరికొన్ని కమర్షియల్ చిత్రాలు ఈ ఏడాది ప్రథమార్థంలోనే తెరపైకి రానున్నాయి. మరో బ్రహ్మాండం బ్రహ్మాండాలకు మారు పేరు శంకర్ చిత్రాలు. తన తొలి చిత్రం జెంటిల్మన్ నుంచి దీన్ని నిరూపించుకుంటున్న శంకర్ గత చిత్రం ఎందిరన్తో దాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. ఆ తరువాత చిత్రం నన్బన్ కాస్త నిరాశపరిచినా తాజాగా ఐ చిత్రంతో తన బ్రహ్మాండాల యాత్రను కొనసాగించనున్నారు. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారనే చెప్పాలి. ఇందులో ఈయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఎమిజాక్సన్ హీరోయిన్. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆస్కార్ ఫిలింస్ నిర్మిస్తున్న అత్యంత భారీ చిత్రం ఐ. పై చిత్రాల స్థాయిలో ఉండే మరో గొప్ప విజువల్ ట్రిట్ ఇది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే ఈ చిత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉంది.