సినిమాల జాతర
Published Fri, Jan 10 2014 1:33 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM
ఎప్పుడైనా సినిమా ఒక కాలక్షేప మాధ్యమమే. కాలానుగుణంగా వచ్చే మార్పులతో దాని రూపం మారుతుండవచ్చుగానీ సినిమా జీవితం కాదు. జీవితాల్లోని కొన్ని సంఘటనలు దీనికి ముడి పదార్థం అయినా కల్పితం లేకుండా అది కథ కాలేదు. అలాంటి కథలకు ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించి వెండితెరపై అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. ఒకప్పుడు కథ, కథనాలను నమ్ముకున్న సినిమా రూపకర్తలు ఇప్పుడు కంప్యూటర్ వంటి ఆధునిక పరిజ్ఞానం వెంట పరుగెడుతున్నారు. అలాంటి సిత్రాల జోరును ఈ ఏడాది ఎక్కువగానే చూడవచ్చు. అదే విధంగా భారీ చిత్రాల బజానా కూడా 2014లో అధికంగానే ఉంది. 2012 కంటే 2013లో అధిక చిత్రాలు తెరపైకి వచ్చాయి. ఇది ఆహ్వానించదగ్గ విషయమే అయినా, విజయాల శాతం 15 దాట లేదు. అరుుతే ఈ ఏడాది ప్రథమార్థంలో రెండు చిత్రాల గురించే సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవి కోచ్చడయాన్, విశ్వరూపం-2.
విశ్వరూపం కంటే ఎక్కువగా
విశ్వనాయకుడు కమల్ హాసన్ విశ్వరూపం-2పై భారీ అంచనాలున్నాయి. సెల్యులాయిడ్‌పై సంచలనాలు సృష్టించిన విశ్వరూపానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ కమల్ హాసన్. విశ్వరూపంలో అలరించిన పూజా కుమార్, ఆండ్రియాలే ఈ చిత్రంలోను తమ అందం, అభినయాలతో అభిమానుల్ని ఓలలాడించనున్నారు. ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో నిపుణులయిన సాంకేతిక పరివా రం పని చేస్తున్నారు. కమల్ సాంకేతిక దాహానికి ఈ విశ్వరూపం-2 నిదర్శనంగా నిలవనుంది. విశ్వరూపంను మించి ఈ చిత్రం ఉంటుందని స్వయంగా కమల్‌నే వెల్లడించారు. ఈ చిత్రం జనవరిలోనే విడుదలవుతుందని ప్రచారం జరిగింది. ఇది ఫిబ్రవరిలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
కోచ్చడయాన్‌లో ప్రత్యేకతలు
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అత్యంత భారీ చిత్రం కోచ్చడయాన్. ఇందులో ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. రజనీ ద్విపాత్రాభినయం, హాలీవుడ్ చిత్రం అవతార్ తరహాలో మోషన్ కాప్సరింగ్ ఫార్మెట్‌తో పాటు 3డీలో రూపొందుతున్న తొలి భారతీయ చిత్రం ఇది. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్, జాకీష్రాఫ్, శరత్ కుమార్, ఆది, శోభన, నాజర్ వంటి నట దిగ్గజాలు నటిస్తున్న చిత్రం. సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కథ, కథనాలు అందించారు. చిత్ర గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్‌ను ఆస్ట్రేలియా, లాస్ ఏంజిల్స్‌లోని సాంకేతిక నిపుణులతో రూపొందిస్తున్న చిత్రం. రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య, అశ్విన్ అద్భుత సృష్టి కోచ్చడయాన్. పాటలను గత ఏడాది డిసెంబర్ 12న, చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయమన్నట్లు ప్రకటించారు. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో చిత్ర ఆడియోను ఫిబ్రవరి 15న, చిత్రాన్ని ఏప్రిల్‌లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
గ్రామీణ ‘వీరం’
ఈ ఏడాది ఆదిలో శుభారంభాన్ని పలుకుతున్న రెండు చిత్రాలపై భారీ అంచనాలున్నాయి. వాటిలో ఒకటి అజిత్ నటించిన వీరం. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్ పతాకంపై బి.నాగిరెడ్డి ఆశీస్సులతో బి.వెంకట్రామిరెడి, భారతీ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటించారు. చిరుత్తైఫేమ్ శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విదార్థ్, బాలా వంటి యువ హీరోలు నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో అజిత్ గెటప్, స్టైల్స్, యాక్టింగ్ డిఫరెంట్‌గా ఉంటాయంటున్నారు చిత్ర వర్గాలు. పూర్తి గ్రామీణ వాతావరణంలో రూపొందిన వీరం భారీ స్థాయిలో శుక్రవారం తెరపైకి రానుంది.
భారీ అంచనాలతో ‘జిల్లా’
విజయ్ నటించిన జిల్లా చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్‌బి చౌదరి నిర్మించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ఉన్నారు. తుపాకి తరువాత విజయ్, కాజల్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి నేశన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ముఖ్యపాత్రను పోషించడం విశేషం. చాలాకాలం తరువాత సమకాలిక నటుడు అజిత్, విజయ్ నటించిన చిత్రాలు ఒకే రోజున తెరపైకి రావడం మరో విశేషం. వీటితోపాటు విశాల్ నటిస్తున్న నాన్ శివప్పు మనిదన్, జయం రవి నటించిన నిమిర్న్‌ందునిల్ వంటి మరికొన్ని కమర్షియల్ చిత్రాలు ఈ ఏడాది ప్రథమార్థంలోనే తెరపైకి రానున్నాయి.
మరో బ్రహ్మాండం
బ్రహ్మాండాలకు మారు పేరు శంకర్ చిత్రాలు. తన తొలి చిత్రం జెంటిల్మన్ నుంచి దీన్ని నిరూపించుకుంటున్న శంకర్ గత చిత్రం ఎందిరన్‌తో దాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. ఆ తరువాత చిత్రం నన్బన్ కాస్త నిరాశపరిచినా తాజాగా ఐ చిత్రంతో తన బ్రహ్మాండాల యాత్రను కొనసాగించనున్నారు. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారనే చెప్పాలి. ఇందులో ఈయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఎమిజాక్సన్ హీరోయిన్. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆస్కార్ ఫిలింస్ నిర్మిస్తున్న అత్యంత భారీ చిత్రం ఐ. పై చిత్రాల స్థాయిలో ఉండే మరో గొప్ప విజువల్ ట్రిట్ ఇది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే ఈ చిత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
Advertisement
Advertisement