హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). 1996లో విడుదలైన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఇండియన్’కి సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ సినిమాలు రూసొందాయి. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్స్‌లో ముందు ‘ఇండియన్ 2’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో సేనాపతిగా కమల్‌హాసన్ కొన్ని మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు.
అయితే ‘ఇండియన్’ సినిమాలో సేనాపతికి 75 సంవత్సరాలు. ఈ ప్రకారం 2024లో ఆయన వయస్సు 103కి చేరుతుంది. అలాంటప్పుడు అంత వయసులో సేనాపతి మార్షల్ ఆర్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఎలా చేయగలుగుతున్నాడు అనే సందేహాలను వ్యక్తపరచారు కొందరు నెటిజన్లు. ఈ విషయంపై ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో శంకర్ స్పందించారు.
‘‘నా దృష్టిలో సేనాపతి ఓ సూపర్ హీరో. ‘భారతీయుడు’ కథ రాసుకున్నప్పుడు సేనాపతిని ఓ స్వాతంత్య్ర సమరయోధుడిగా చూపించాలని అప్పుడు సేనాపతికి 75 సంవత్సరాలు అన్నట్లుగా చూపించాం. అప్పుడు సీక్వెల్ ఆలోచన లేదు. ఇప్పుడు ‘భారతీయుడు 2’లో చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా సేనాపతి కనిపిస్తాడు.
అత్యధిక వయసు కలిగిన ఫైటర్స్ చైనాలో ఉన్నారు. 108 సంవత్సరాలు ఉన్న లు జీజీయన్ అనే చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నారు. వారి సాధన, క్రమశిక్షణ వారిని అలా తీర్చిదిద్దుతుంది. సేనాపతి కూడా అలాంటివాడే’’ అని చెప్పుకొచ్చారు శంకర్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ‘ఇండియన్ 3’ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment