స్టయిల్ కింగ్‌ను కాను
కోట్లాది అభిమానుల ఆరాధ్యదైవం రజనీకాంత్. నటనా పరంగా ఆయన స్టయిల్‌త ఒక్కో కోణంలో ఒక్కో రకంగా ఉంటుంది. అందుకే అభిమానులందరూ ఆయన్ని స్టయిల్ కింగ్ అంటారు. అయితే రజనీకాంత్ మాత్రం స్టయిల్ కింగ్‌ను తాను కాదంటున్నారు. రజనీకాంత్ టీవీల్లో ఇంటర్వ్యూ ఇచ్చి చాలా కాలం అయ్యింది. ఆయన నటించిన బ్రహ్మాండ చిత్రం కోచ్చడయాన్ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా తమిళ ఉగాదిని పురస్కరించుకుని రజనీ ఒక చానల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు. హాస్యనటుడు వివేక్ అడిగిన ప్రశ్నలకు ఆయన కింది విధంగా బదులిచ్చారు.
మీకు ఇద్దరు అమ్మాయిలే పుట్టారు. అబ్బాయిలు లేరన్న చింత లేదా?
లేదు. ఈ విషయం గురించి నన్నింతకుముందు చాలామంది అడిగారు. నేను నా భార్యను ఈ విషయం గురించి అడిగాను. ఆమె ఎలాంటి బాధా లేదన్నారు.
భారతదేశంలోనే స్టయిల్ కింగ్ అంటే మీరేనటగా?
నేను కాదు. శివాజి గణేశన్‌నే స్టయిల్ కింగ్. ఆయన నటనలో కొత్త స్టయిల్ చూపిస్తారు.
మీ స్టయిల్‌లో ప్రధానమైంది సిగరెట్ తాగడమేగా?
నిజమే. అయితే ఆ వరమే చివరికి శాపంగా మారింది.
సిగరెట్ బానిసలకు మీరిచ్చే సందేశం?
దేనికైనా హద్దులు విధించుకోండి. ఏ అలవాటుకు బానిసలు కాకండి.
మహాభారత కావ్యాన్ని చిత్రంగా తెరకెక్కిస్తే అందులో మీరే పాత్ర పోషిస్తారు?
కర్ణుడి పాత్ర.
యాక్షన్ హీరోగా ఎదిగిన మీరు తిల్లుముల్లు, తంబిక్కు ఎంద ఊరు లాంటి చిత్రాల్లో హాస్య పాత్రల్లో ఎలా మెప్పించగలిగారు?
దీనికి కారణం దర్శకుడు కె.బాలచందర్. నటన, డాన్స్ బాగా చేస్తావు, హాస్యరసాన్ని పండించగలవు. అయితే కామెడీలో నిన్ను ఎవరూ సరిగా ఉపయోగించుకోలేదు. నేను తిల్లుముల్లు చిత్రంలో నిన్ను ఆ కోణంలో ఉపయోగించుకుంటానని బాలచందర్ పేర్కొన్నారు.
మీరు ఇటీవల కోచ్చడయాన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో శత్రువులను జయించడానికి ప్రధాన మార్గం క్షమాపణ అని పేర్కొన్నారు. మీ శత్రువులను క్షమించారా?
చాలాసార్లు చాలా మందిని క్షమించాను. క్షమించడంలో ఎంతో సంతోషం, ప్రశాంతత కలుగుతుంది.
నటులు అజిత్, విజయ్‌లలో మీకు నచ్చిన విషయాలు?
అజిత్‌లో నిర్మొహమాటంగా మాట్లాడే గుణం. విజయ్‌లో నెమ్మది మనస్తత్వం నచ్చుతాయి.