
సాక్షి, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి మరణం యావత్ భారతాన్ని శోకంలో ముంచేసింది. సినిమా వాళ్లు ఏం చేసినా స్వార్థం ఉంటుందనే అపవాదు ఉంది. అందులో మానవత్వం ఉన్న వాళ్లు, స్నేహానికి గౌరవం ఇచ్చేవారూ ఉన్నారు. అందుకు నిదర్శనం శ్రీదేవి. 2011లో రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన చికిత్స నిమిత్తం సింగపూర్‌కు వెళ్లారు. అప్పుడు రజనీ త్వరగా కోలుకోవాలని శ్రీదేవి వారం రోజులు వ్రతం ఆచరించి పూజలు చేశారు. రజనీ కోలుకున్న తరువాత షిర్డీ సాయిబాబా ఆలయానికి వెళ్లి వ్రతాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.
ఆ సమయంలో శ్రీదేవి మాట్లాడుతూ.. ‘కమల్, రజనీలు ఇద్దరు నాకు మంచి మిత్రులు. రజనీ మా అమ్మతో ఎప్పుడూ అభిమానంగా ఉంటాడు. మా అమ్మకు కూడా రజనీ అంటే చాలా అభిమానం. కమల్ లాగే పెద్ద స్టార్ కావాలని, అందుకు ఏంచేయాలని రజనీ మా అమ్మను అడిగేవారు. నువ్వు కచ్చితంగా పెద్ద స్టార్‌వు అవుతావని అమ్మ రజినీకి తెలిపేది. ఆ సమయంలో రూ. 30 వేలు జీతం తీసుకోవాలనేది తన ఆశ అని రజనీ తెలుపుతుండేవారు. అది తలచుకుంటే ఇప్పుడు కూడా నవ్వొస్తుంది’’ అని శ్రీదేవి ఇంటర్వ్యూలో తెలిపింది.