సాక్షి, చెన్నై: తమిళనాట ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజకీయ రంగప్రవేశం ఖరారైంది.తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్దామని అభిమానులకు కమల్ పిలుపునిచ్చారు. వారితో ఎప్పటికప్పుడు సంప్రదింపుల కోసం తన 63 వ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 7న ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం చెన్నై శివారులోని కేలంబాక్కంలో దాదాపు పదిహేను వందల మంది అభిమానులతో కమల్ హాసన్ సమావేశమయ్యారు. అభిమానుల సంక్షేమ సంఘం 39 వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ భేటీలో అవినీతి నిర్మూలన, నదీ జలాల పరిరక్షణ, తమిళనాడు ప్రగతిపై కమల్ మాట్లాడారు. అనంతరం అభిమానులతో విడిగా కొద్దిసేపు మంతనాలు జరిపారు.
‘నేను రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా. పార్టీ ఏర్పాటుచేసి ప్రజల్లోకి వెళ్దాం. పార్టీ పెట్టాలంటే కోట్లు అవసరమంటున్నారు. విరాళాలు ఇచ్చేందుకు, సేకరించేందుకు సిద్ధమా!’ అని వారిని ప్రశ్నించారు. విరాళాల కోసం తమిళనాడు ప్రజల ముందు చేతులు చాపేందుకు సిగ్గుపడనని ఆయన చెప్పారు. ‘పార్టీ ఏర్పాటు చేయడం ఒక్క రోజు పని. కానీ అంతకుముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ దిశగా ముందుకు సాగుదాం’ అని అభిమానులకు సూచించారు. అణిచివేత రాజకీయాల్లో ఒక భాగమని, ఎంత మంది నిన్ను బెదిరిస్తున్నారు అన్నది ముఖ్యం కాదని, నువ్వు ఏం చేయబోతున్నావు అన్నదే ముఖ్యమని కమల్ పేర్కొన్నారు. దెబ్బలు తినేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే అదే సమయంలో పదే పదే దెబ్బలు తినేందుకు తాను మృదంగం కానని చెప్పారు. చెన్నై వరదలను ప్రస్తావిస్తూ.. ‘ప్రకృతి విపత్తులకు ధనిక, పేద భేదం ఉండదు. మనం ప్రేమించిన వ్యక్తుల్ని కోల్పోయాక మేల్కొనడం కంటే ముందస్తుగా విపత్తు నివారణ చర్యలు తీసుకోవాలి’ అని కమల్‌హాసన్ సూచించారు. «
Comments
Please login to add a commentAdd a comment