
సాక్షి, సినిమా : ఇండియన్ -2 చిత్ర నిర్మాత మారారా? కోలీవుడ్‌లో తాజాగా వైరల్ అవుతున్న న్యూస్ ఇదే. 1996లో తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని సాధించిన చిత్రం ఇండియన్. విశ్వనటుడు కమలహాసన్ తండ్రి-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఇందులో నటి మనీషా కోయిరాలా, ఊర్మిళ కథానాయికలుగానూ, సుకన్య, కస్తూరి తదితరులు ముఖ్య పాత్రల్లోనూ నటించిన ఈ చిత్రం స్టార్ డైరెక్టర్ శంకర్ అద్భుత సృష్టి. అవినీతిపై కమల్, శంకర్‌లు పూరించిన అస్త్రం. కాగా, ఆ చిత్రానికి సీక్వెల్ పై చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల కమలహాసన్, శంకర్ సమిష్టిగా ఇండియన్ -2 చిత్రం త్వరలో ప్రారంభం అవుతుందని ఒక టీవీ కార్యక్రమంలో వెల్లడించారు. ఆ సమయంలో ప్రముఖ తెలుగు నిర్మాత దిల్‌రాజు కూడా వారితో ఉన్నారు. ఇండియన్-2 చిత్రాన్ని ఈయనే తమిళం, తెలుగు భాషల్లో నిర్మించనున్నారని ప్రకటించారు. చిత్రం జనవరిలో సెట్‌పైకి వెళ్లనుందనే ప్రచారం జరుగుతున్న సమయంలో తాజాగా ఈ చిత్ర నిర్మాత మారనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిత్ర నిర్మాణం నుంచి దిల్ రాజు తప్పుకున్నారని, లైకా సంస్థ ఇండియన్-2 చిత్ర నిర్మాణానికి సిద్ధం అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. లైకా సంస్థ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా 2.ఓ చిత్రాన్ని బ్రహ్మాండంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జనవరి నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతుండగా, వెంటనే ఇండియన్-2 చిత్రం ప్రారంభం అవుతుందనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment