
ఆయన అడిగితే కాదంటానా!
కమలహాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో 1990 ప్రాంతంలో నటించి ప్రముఖ కథానాయకిగా వెలుగొందిన నటి అమల. తెలుగులోనూ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ ప్రముఖ కథానాయకులతో నటించిన అమల నాగార్జునను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపట్టారు. ఆ తరువాత పలువురు దర్శక నిర్మాతలు అమలను మళ్ల నటింపజేయాలని ప్రయత్నించినా ఆమె సుముఖత వ్యక్తం చేయలేదు. రెండు దశాబ్దాల తరువాత ఆ మధ్య లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే చిత్రంలో మెరిశారు. అమల లాంటి ప్రతిభావంతురాలు రీఎంట్రీ అయితే ఇక మన దర్శక నిర్మాతలు చూస్తూ ఊరుకుంటారా? అంత వరకూ ఎందుకు విశ్వ నటుడు కమలహాసనే అమలను తన చిత్రంలో నటించమని కోరారు. అంతటి గొప్ప నటుడు అడిగితే అమల ఎలా కాదనగలరు. కథ, తన పాత్ర బాగుంటే. ఆమె త్వరలో కమలహసన్‌తో కలిసి అప్పా అమ్మా విళైయాట్టు చిత్రంలో నటించనున్నారు. దీనిగురించి అమల ఏమంటున్నారో చూద్దాం.
'మళ్లీ కమలహాసన్‌తో కలిసి నటిస్తానని ఊహించలేదు. ఒక కార్యక్రమంలో కలిసిన ఆయన తనతో నటిస్తారా అని అడిగారు. నేనూ ఓకే అన్నాను. అంతే దర్శకుడు రాజీవ్‌కుమార్ పంపి కథ వినిపించారు. కథ బాగుంది. పాత్ర తనకు తగినట్లు ఉంది. చిత్ర షూటింగ్ అమెరికాలో చిత్రీకరించనున్నారు. ఇందులో నేను కమల్‌కు భార్యగా నటించనున్నాను. షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. బహూశా ఫిబ్రవరిలో ప్రారంభం కావచ్చు. అయితే నేను ఇప్పటికే చాలా బిజీగా ఉన్నాను. పనులు చాలా ఉన్నాయి. అందువల్ల కమలహాసన్‌కు జంటగా ప్రత్యేక పాత్రలోనే నటించనున్నాను. ఎక్కువ రోజులు కాల్‌షీట్స్ కేటాయించలేను. సినిమాలో నేను చాలా నేర్చుకున్నాను. అందుకే మళ్లీ నటించడానికి సిద్ధమయ్యాను. అయితే నాకు తగిన పాత్ర అయితేనే అంగీకరిస్తాను' అని అమల పేర్కొన్నారు. ఈ చిత్రంలోనే నటి శ్రుతిహాసన్ నటించనున్నారు.