
ఆరేళ్ల వయసు నుంచి జంతువుల సంక్షేమంలో నా ప్రయాణం ప్రారంభమైందని జంతు ప్రేమికురాలు, సినీ నటి అమల (Amala Akkineni) పేర్కొన్నారు. యానిమల్ ఛారిటీ హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా మిషన్ పేరును హ్యుమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్‌గా మార్చారు. దీనికి సంబంధించిన కొత్త పేరు, లోగోలను నగరంలోని ఓ హోటల్‌లో శనివారం ఆమె ఆవిష్కరించారు.
అదే లక్ష్యంగా పని చేస్తున్నా..
అనంతరం అమల మాట్లాడుతూ.. జంతువుల బాధలను అంతం చేయాలనే లక్ష్యంతో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నానన్నారు. విద్యార్థులు సైతం మాతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చారని తెలిపారు. సర్కస్‌లో వన్యప్రాణులను నిలుపుదల చేయడం నుంచి జంతువులపై ప్రయోగాలు నిర్వహించే ప్రయోగశాలల వరకు అందరితో మాట్లాడామన్నారు.
నా జీవితానికి విలువ లేదు
ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులంతా కలిసి చేసే పనులు, తీసుకు వస్తున్న మార్పులే లేకుంటే నా జీవితానికి విలువ లేదన్నారు. జంతువులు, ప్రకృతి పట్ల ఉన్న ప్రేమ మనల్ని ఒకచోటకు చేరుస్తుందని పేర్కొన్నారు. అన్ని రకాల జంతువుల పట్ల జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ జంతువుల పట్ల మానవత్వం చూపే సంప్రదాయం రావాలని ఆకాంక్షించారు.
హ్యూమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ సంస్థ చేస్తున్న అద్భుతమైన కృషికి ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో హ్యుమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ అధ్యక్షులు, సీఈవో కిట్టి బ్లాక్, పలువురు సంస్థ ప్రతినిధులు, జంతు ప్రేమికులు పాల్గొన్నారు.
చదవండి: 48 ఏళ్ల వయసులో నటుడి రెండో పెళ్లి.. వయసుతో సంబంధం లేదంటూ