
కేవీ.ఆనంద్, అట్లీ, రజనీకాంత్, మణికంఠన్
తమిళసినిమా: దక్షిణాది సినిమానే కాదు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు కమలహాసన్, రజనీకాంత్ చుట్టూనే తిరుగుతున్నాయన్నది వాస్తవం. వీరిలో కమలహాసన్ సినిమాలకు గుడ్‌బై చెప్పేశారు. నిర్మాణంలో ఉన్న విశ్వరూపం–2, శభాష్‌నాయుడు చేయనున్నట్లు ప్రకటించినా ఇండియన్ 2 చిత్రాలనే ఆయన నుంచి ఆశించవచ్చు. ఇక రజనీకాంత్ రాజకీయరంగప్రవేశం కార్యక్రమాలు ముమ్మరంగా జరగుతున్నాయి.
ఆయన త్వరలోనే పార్టీ జండా, అజెండాలను వెల్లడించే సమయం ఆసన్నమైంది. రజనీకాంత్ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 2.ఓ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న విషయం తెలిసిందే. శంకర్ ఈ చిత్రాన్ని నభూతోనభవిష్యత్ అనే విధంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. కబాలి చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో తన అల్లుడు, నటుడు ధనుష్ నిర్మాణంలో రజనీకాంత్ మరోసారి దాదాగా నటించిన కాలా చిత్రం ఏప్రిల్ 27న తెరపైకి రావడానికి ముస్తాబుతోంది.
ఇక రజనీకాంత్ మరో చిత్రం చేస్తారా, 2.ఓ చివరి చిత్రం అవుతుందా? అన్న చర్చ జరుగుతున్న సమయంలో ఆయన కోసం ముగ్గురు దర్శకులు కథలు సిద్ధం చేశారు. సూపర్‌స్టార్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం తమ చిత్రాలను పట్టాలెక్కించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. యువ దర్శకుడు అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజారాణి, తెరి, మెర్శల్ చిత్రాలతో తానేమిటో నిరూపించుకున్నారు. ఇక మరో వర్థమాన దర్శకుడు మణికంఠన్ కాక్కాముట్టై చిత్రంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
ఈ ఇద్దరూ రజనీకాంత్ కోసం కథలను సిద్ధం చేసి ఆయనకు వినిపించారు కూడా. మరో ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు కేవీ.ఆనంద్ కూడా సూపర్‌స్టార్ కోసం బ్రహ్మాండమైన కథను సిద్ధం చేశారట. అట్లి, కేవీ.ఆనంద్ రాజకీయ ఇతివృత్తంతో కథలను తయారు చేయగా కాక్కాముట్టై చిత్రం ఫేమ్ మణకంఠన్ వ్యవసాయం నేపథ్యంలో కథను రెడీ చేశారట. ఈ మూడు కథలు రజనీకాంత్‌ను ఇంప్రెస్ చేశాయని, వీరిలో ఏవరికి ఆయన పచ్చజెండా ఊపుతారన్నది ఆసక్తికరంగా మారిందనేది కోలీవుడ్ వర్గాల సమాచారం.