చందా అడగటమంటే భిక్షమడగటమే కదా! | Story On Drama Artists Dialogue Delivery | Sakshi
Sakshi News home page

నేపథ్యంలోని నటుడు

Published Sun, Aug 18 2019 10:47 AM | Last Updated on Sun, Aug 18 2019 10:47 AM

Story On Drama Artists Dialogue Delivery - Sakshi

ఇంతకు ముందు ఎన్నోమార్లు అతనిని నేను చూశాను కానీ ఆరోజు అతనిని చూసి కలవరపడిపోయాను. ఆశ్చర్యచకితుడినయ్యాను. అదనుగాని సమయంలో కాసిన పండునో, పూసిన పువ్వునో చూసినట్లు అనిపించింది. శ్రావణ భాద్రపద మాసాల్లో నిరంతరం వర్షం కురుస్తున్న ఈ చిత్తడి రోజుల్లో ఎక్కడినుంచి ఊడిపడ్డాడో, ఏమో?
నేనే కాదు, అతన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. కొంతమందైతే అతని టేబుల్‌ వద్దకు వెళ్లి ఏమో అడుగుతున్నారు. దానికి అతను మామూలుగా క్లుప్తంగా జవాబిస్తున్నాడు. ‘ఫార్‌బిస్‌గంజ్‌లోని ఈ చిన్న టీకొట్టులో ఒక చెయ్యివిరిగిన కుర్చీలో కూర్చున్న అతన్ని చూసి అందరూ ఆశ్చర్యచకితులవడం నేను గమనిస్తున్నాను. ఎందుకో?

నేను కారణాన్ని వెతుక్కుంటూ ఆలోచించసాగాను– దాదాపు ముప్పయి ఏళ్ల కిందట నేను మొట్టమొదటిగా ఈ వ్యక్తిని చూశాను– బహుశ అది 1929 సంవత్సరం కావచ్చు. అదే సంవత్సరం ప్రప్రథమంగా ‘గులాబ్‌బాగ్‌’ ఉత్సవంలో చాలా కిందుగా పోతున్న విమానాన్ని చూశాను. అందువల్లనే ఆ సంవత్సరం నాకిప్పటికీ గుర్తు. 1929 సంవత్సరం అంటే అప్పుడు నా వయసు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుంటుంది. ఆ సంవత్సరమే కలకత్తా నుంచి పేరు పొందిన నాటక కంపెనీ గులాబ్‌ బాగ్‌ ఉత్సవానికి వచ్చింది. ఎక్కడ చూసినా జనమే– ఇసుకవేస్తే రాలనంత జనం! రంగస్థలంపైనే రైలుబండి వస్తూ పోతూ ఉంది. ఇంజను పొగ వదులుతూ, విజిలేస్తూ నడుస్తుంది. రంగురంగుల కాంతుల్లో దేవకన్యలు నాట్యం చేశాయి... ఆహా!

జీవితంలో మొట్టమొదటిసారి నాటకం చూసి ఎంత ఉత్తేజితుడినయ్యానో– ఈరోజు కూడా నాకు ఆ దృశ్యం కళ్లకు కట్టినట్టుంటుంది. ఎంత అద్భుతం! ఎంత ఆశ్చర్యం!
స్కూలు తెరిచిన తర్వాత నాతో పాటు చదువుకునే బకుల్‌ బెనర్జీ తన మాటలతో నన్ను కించపరచాడు. అతను కూడా ఎనిమిది తొమ్మిదేళ్ల వయసు వాడు. కాని చాలా చలాకీగా ఉంటాడు. జన్మతః ‘ఆర్ట్‌ క్రిటిక్‌’గా ఉండేవాడు. అతనేమన్నాడంటే– ‘పోయిన సంవత్సరం నాగేశర్‌బాగ్‌ తిరనాళ్లకి వచ్చిన అసలైన నాటక కంపెనీ నుంచి వెళ్లగొట్టబడిన వాళ్లే ఈ నకిలీ కంపెనీలోకి వచ్చి చేరారు’ అని! నేను చిన్నబుచ్చుకోవడం చూసి బకుల్‌ మళ్లా అందుకున్నాడు– ‘‘అయినా, ఈ కంపెనీలో ప్రత్యేకత ఉందిలే! ఈ కంపెనీ నాటకంలో రైల్వే పోర్టరుగా నటించినవాడు నాగేశరబాగ్‌ తిరనాళ్లకి వచ్చిన కంపెనీలో కూడా ఇదే పాత్ర ధరించాడు. అంటే వెయిటింగ్‌ రూమ్‌లో నిద్రపోతున్న అబ్బాయిని కత్తితో పొడుస్తాడు. ఇతన్ని నకిలీ అనలేము!’’

ఇప్పటికీ ఆనాటి మాటలు నాకు గుర్తున్నాయి– గులాల్‌బాగ్‌ తిరానళ, పంజాబ్‌ మెయిల్‌లోని రైల్వే పోర్టరు– హత్య– బకుల్‌ మాటలన్నీ.
నాలుగైదు సంవత్సరాల తర్వాత ‘సింహేశ్వర్‌’ తిరనాళకి వచ్చిన ‘ఉమాకాంత్‌ ఝా’ కంపెనీలో మరలా ఈ వ్యక్తిని చూడగలిగాను. ‘బిల్వమంగళ’ నాటకంలో చింతాబాయి బృందంలో బోథియా బాబాగారి వేషంలో– ‘కాయాకా పింజరా డోలేరే, సాంస్‌కా పంఛీ బోలే’ (దేహపంజరంలో ఊగిసలాడే ఊపిరి పక్షి) అంటూ! చాలా మధురంగా పాడాడు. గులాల్‌బాగ్‌ తిరనాళలో ప్రదర్శించిన నాటకంలోని అమ్మాయిని హత్య చేసినవాడు, హంతకుని పాత్ర ధరించినవాడు, కాషాయ వస్త్రాలతో బాబాగా దర్శనమిచ్చాడు. కాని అతను తన మాటల సరళిని చాలాసేపు దాచుకోలేకపోయాడు– అతని మాటలను బట్టి నేను అతన్ని కనుక్కోగలిగాను.

పారశీ నాటక కంపెనీలోని ఒక దృశ్యంలో కవిత్వం పాడుతున్నప్పుడు– మృదంగం ‘దిల్తై అంటుంటే అందెలు ఎవరికి ఎవరికి?’ అని మోగుతుండగా అప్పుడు వేశ్య నాట్యం చేస్తూ, ‘ఇతనికి ఇతనికి’ అంటూ ఉంటే అప్పుడు నిస్సందేహంగా అతనే ఇతనని తెలిసిపోయింది. ఈ బాబాగారిని గుర్తుపట్టాను. గులాల్‌బాగ్‌ తిరనాళ్లలోని కంపెనీ నాటకంలో, వెయిటింగ్‌ రూములో నిద్రపోతున్న అబ్బాయిని కత్తితో పొడుస్తున్నప్పుడు తన చెయ్యి వణకటం చూసి పిచ్చివాని మాదిరి గొణిగాడు– ‘‘ఏమిటి నా చేతులిలా వణుకుతున్నాయి? ఈ చేతులు యజమాని ఆజ్ఞ ప్రకారమే పని చేయాలిగదా! వణకకే నా కత్తీ! సమయాన్ని వృథా చేయకు. ఎవర్ని చంపాలో వాడు దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నాడు. నీ పని నువ్వు చేసెయ్యి’’ ఇంతలోనే డోలు గట్టిగా మోగింది. అందరూ ఉలిక్కిపడ్డారు. అంతా క్షణంలో అయిపోయింది.

తర్వాత మూడోసారి ఆద్యాప్రసాద్‌ నాటక కంపెనీలో ‘శ్రీమతి మంజరి’ నాటకంలో ఇంగ్లిష్‌ జడ్జి వేషం ధరించి టేబులుపై సుత్తిని కొడుతూ ‘ఆర్డర్, ఆర్డర్‌!’ అంటూ వెల్, మంజరీబాయి మేము నీకు ‘శ్రీమతి మంజరి’ అని బిరుదు ఇస్తాము. ఈరోజు నుంచి నిన్ను శ్రీమతి మంజరి అని పిలుస్తాము. నేను పిలిస్తే అందరూ నిన్ను అలాగే పిలుస్తారు’ అంటాడు. ఈ దృశ్యం ముగిసిన కొద్ది క్షణాలకు అతడే ‘ఈ శరీర పంజరం ఊగిసలాడెలే’ అని పాత టోనులో పాడుకుంటూ స్టేజిపైన కనపడతాడు.
అతన్ని గుర్తుపట్టడంలో నేనెక్కడా పొరబడలేదు. అన్నిచోట్లా అతన్ని పసిగట్టాను.
టీ దుకాణంలో కుర్చీలో కూర్చొని ఉన్నాడు కాని, ఏదో ఎక్కడో ఆలోచిస్తూ అన్యమనస్కుడై చాలా దిగాలుగా కూర్చున్నాడు. ఆకాశంపైన మేఘపంక్తిని కన్నార్పకుండా చూస్తున్నాడు. అతను పోర్టరు వేషంలోని హంతకుడు– బాబాగారు– ఇంగ్లిష్‌ జడ్జి– ఉపదేశకుడు– పోలీసు సిపాయి– గజదొంగ– గుడ్డోడు– ఫకీరు వంటి వేషాలెన్నో ధరించిన ఏకైక వ్యక్తి!
కొద్దిసేపటికి నా దృష్టి అతను తొడుక్కున్న బుష్‌షర్ట్‌పై పడింది. రంగు వెలిసిన బుష్‌షర్ట్‌ మట్టి కొట్టుకుపోయి ఉంది. తెగిపోయిన కొత్త డిజైను చెప్పులు. అతను ఉన్నట్టుండి టీ ఇచ్చేవానివైపు చూసి, ‘ఒక టీ ఇక్కడ’ గట్టిగా అరిచాడు. అతని అరుపు విని పోర్టరు వేషంలో ఉండే హంతకుడు, కంపరం కలిగించే గజదొంగ, పవర్‌ఫుల్‌ ఇంగ్లిష్‌ జడ్జి, ప్రశాంతచిత్తుడైన ఉపదేశకుడిగా నటించిన అతను ఇప్పుడు ముసలివాడయ్యాడని స్పష్టంగా తెలిసిపోతుంది.

ఫార్‌బిస్‌గంజ్‌ తిరనాళ్లలోని నాటక కంపెనీకి చెందిన నటుల వెనుక నేను నడుస్తున్నాను. ఒక కిళ్లీ దుకాణం దగ్గర అందరూ నిలబడగా నేను వాళ్ల వెనుక నిలబడ్డాను. నటులు చాలామంది అక్కడ గుమిగూడి ఉన్నారు. లైలా–మజ్నూ, ఫర్‌హాద్, రాజు, గజదొంగ భార్య నుంచి రాజకుమారిని విడిపించిన రాకుమారుడు, అవసరం వచ్చినప్పుడు ఉరితీసే వాడి వేషం వేసేవాడు, వీరందరితో పాటు ‘ఈ శరీరపంజరము ఊగిసలాడెలే’ అని పాడేవాడు. నేను వాళ్ల వెనుక నడవడం చూసి ‘‘ఏమిరా! మా వెంట ఎందుకు పడుతున్నావు? జేబులు కొట్టాలని చూస్తున్నావా?’’ అని అతను నన్ను గద్దించాడు.
ఆ చిన్న వయసులో కూడా అతని మాటలు నా ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టాయి. నాకు పౌరుషమొచ్చింది. ‘‘ఏ జేబులో ఏముందనీ, నీ జేబు కొట్టేయడానికి?’’ అని నేను అతన్ని ఎదిరించాను.
అతను గాభరాపడి ‘‘నీకు ఎలా తెలుసురా, నా జేబు ఖాళీ అని’’ అన్నాడు.

ఆ రోజుల్లో మాస్కూల్‌లో నేను ఫైనల్‌ క్లాసులో చదువుతూ ఉండేవాడిని. మా టీచరు ఆజ్ఞ మేరకు ప్రతి అపరిచితునితోనూ ఇంగ్లిష్‌లో మాట్లాడేవాడిని, కాని అతనికి నేను హిందీలోనే జవాబిచ్చాను– ‘‘నాకెందుకు తెలీదు. రాత్రి నువ్వు అడుక్కుంటున్నావు కదా, ‘బాబూ ధర్మం చేయండి’ అని’’ అంటూనే అందరూ బిగ్గరగా నవ్వి ‘‘ఫర్వాలేదే ఈ పిల్లోడు!’’ అన్నాడు.
అప్పుడు నేను ఇంగ్లిష్‌లో మొదలుపెట్టాను– ‘‘యూ సీ మిస్టర్‌– రైల్వేపోర్టర్‌ యాక్టర్‌– డోంట్‌ సే మీ పిల్లోడు, ఐయామ్‌ మెట్రిక్‌ స్టూడెంట్‌ యూ నో?’’
ఎన్నో ఏళ్ల కిందటి ఈ సంఘటన గుర్తుకు రాగానే నాకు నవ్వొచ్చింది. ఇప్పుడు అతను ఏ కంపెనీలో పని చేస్తున్నాడో? ఇప్పుడు కూడా అప్పటి మాదిరే బ్రహ్మాండమైన డైలాగులు చెప్పగలడా? అదే మాదిరి వెయిటింగ్‌ రూములో నిద్రపోతున్న అబ్బాయిని కత్తితో పొడుస్తాడా? ముందుమాదిరే! ఎన్నో ప్రశ్నలు నా మదిలో మెదిలాయి.

నేను తేరుకొనేలోగానే అతను టీ తాగేసి నా టేబులు వద్దకు వచ్చి నిలబడి ‘‘ఏం సేఠుగారూ! నన్ను మీరు గుర్తుపట్టారా?’’ అన్నాడు.
‘‘నేను సేఠ్‌ను కాను. మామూలు మనిషిని. ఇప్పుడు మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? నాటకాల సీజనుగాని ఈ రోజుల్లో ఈ ప్రాంతంలో మిమ్మల్ని చూసి నాకు ఆశ్చర్యంగా ఉంది’’ అంటూ అతని చేతులు పట్టుకుని కూర్చోబెట్టాను.
‘‘బాబుగారూ! ఇప్పుడెక్కడున్నాయి కంపెనీలు? ఎక్కడున్నాయి ఆ నాటకాలు? సినిమా అన్నింటినీ మింగేసింది’’ అంటూ పెదవి విరిచాడతను.
‘‘మీరు ఇంతవరకు ఎన్ని కంపెనీల్లో పనిచేశారు?’’
‘‘ఎన్ని కంపెనీలంటారా? పదిహేను కంపెనీలు’’ అతని వాలకం చూస్తే పాత సంగతులన్నీ దాచుకుంటూ ఉన్నట్లుంది. నిమిషం ఆగి శూన్యంలోకి చూస్తూ మళ్లీ ‘‘తొమ్మిదేళ్ల ప్రాయంలో తొలిసారి నాటకాల్లో ప్రవేశించాను బాలకృష్ణుని వేషంలో..’’ అని అన్నాడు.
గడచిన కాలంలోని ఒక కాలఖండం నా ముందర నిలబడ్డట్లు నాకనిపించింది– పారశీ నాటక కంపెనీకి చెందిన శిథిలమైన ఒక నటుడు! సిగరెట్టు అతనికందిస్తూ, ‘‘అయితే ఇప్పుడేం చేస్తుంటావు?’’ అన్నాను.
కొంతసేపు నన్ను చూస్తూ అతను ఊరుకున్నాడు. సిగరెట్టు వెలిగించుకుని చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘ఏముంది చెయ్యడానికి బాబుగారు? ఎవరో ఒక కవి అన్నాడు చూడు: ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు’ అన్నట్లు నాటక కంపెనీలో పడి పాడైపోయాను. పదేళ్ల తర్వాత ఈ ప్రాంతానికొచ్చాను. ఈ ప్రాంతాన్ని ఏమో అంటారట– ఆ! మిథిలాప్రదేశ్‌! బాబుగారూ! ఇక్కడ నాటకాలంటే మోజున్న వాళ్లున్నారు కదా... నేను సినిమాల్లో కూడా నటించాను. కానీ అక్కడ మనసొప్పలేదు’’ ఈ మాటలు చెప్పి అటూ ఇటూ ఓరకన్నుతో పరికించి తిరిగి నావైపు దీనంగా చూస్తూ నెమ్మదిగా అన్నాడు, ‘‘బాబుగారూ! ఎక్స్‌క్యూజ్‌మీ.. ఫర్‌ లాస్ట్‌ టూడేస్‌ అయామ్‌ హంగ్రీ, వెరీ హంగ్రీ! ఎవరినైనా అడగాలంటే ధైర్యం చాలడంలేదు.’’

అతని ఈ ఇంగ్లిష్‌ డైలాగు నాటకీయంగా లేదు. నేను మాట్లాడేలోపలే అతను నా ఆజ్ఞను శిరసావహిస్తున్నట్లు దీనంగా మొదలుపెట్టాడు– ‘‘మీ ఆజ్ఞ అయితే నా విద్యను మీ ముందు ప్రదర్శిస్తాను. ఇప్పుడు నా వద్ద మిగిలిందల్లా ఈ విద్య ఒక్కటే. అప్పుడప్పుడూ నాటకాలంటే అభిమానించే వాళ్లు కనబడతారు. నా డైలాగ్సు ప్రదర్శించి తృప్తిపడతాను. నాకు కొద్దో గొప్పో ఇస్తే..’’ అతను తన వాక్యాన్ని ముగించకుండానే ఒక మూల ఉంచిన తన సూట్‌కేసును పరుగున వెళ్లి తీసుకొచ్చాడు. ఒక నల్లని లుంగీ బయటకు తీసి ముఖానికి కప్పుకున్నాడు. లుంగీ ముసుగు తొలగించగానే కోరమీసాలతో ఒక విచిత్రవేషం కనిపించింది.

‘భగ్న ప్రేమికుడైన యువకుని డైలాగిది’ అని నెమ్మదిగా అంటూ గొంతు సవరించుకుని డైలాగు చెప్పసాగాడు: ‘‘నమ్మకద్రోహి! చపలా!! నీకిది తగునా? నీవు నా హృదయాన్ని వెయ్యి ముక్కలుగా చీల్చి చెండాడావు! నమ్మకద్రోహీ!! ఎంత అనర్థం చేశావే! చపలా.. చపలా నన్ను వదిలి వెళ్లిపోయావటే! నన్ను దిక్కులేనివానిగా చేసి వెళ్లిపోవుట తగునా..!!’’ తర్వాత వెక్కివెక్కి ఏడుస్తూ మరి కొన్ని డైలాగులు వల్లె వేశాడు. అతను చెప్పిన డైలాగ్సును నేనిక్కడ వెల్లడించలేను.
టీకొట్టులో జనం మూగారు. నాలుగు వైపుల నుంచి అందరూ తొంగి తొంగి చూస్తున్నారు. అందరి ముఖాల్లో ఏదో కుతూహలం! కానీ అందరూ స్తబ్దులై తమాషా చూసేవాళ్లే. బయట మేఘాలు గర్జిస్తున్నాయి. మరల అతను లుంగీలో తన ముఖాన్ని కప్పుకున్నాడు. తను గ్రీన్‌రూములోకి ప్రవేశించినట్లు.. ఈసారి లుంగీని తొలగించుకుని పెద్ద గడ్డం, మీసాలు గల సర్దారు బయటికొచ్చాడు. లుంగీ కింద పడిన వెంటనే అతను గర్జించాడు. ‘‘ఏమిరా దుర్మార్గుడా! రాకుమారులెక్కడ? ఎక్కడున్నాడు ఆ నికృష్టుడు?’’

భావావేశంతో చెప్పిన ఈ డైలాగు వల్ల నోట్లో ఉన్న కట్టుడు పండ్ల సెట్టు విరిగి కింద పడింది. 
ఈ విధంగా అతను ఎన్నో వేషాలు వేశాడు. ఎన్నో డైలాగులు చెప్పాడు. ఆఖరులో తన టోపీని భిక్షాపాత్ర మాదిరి చాపి అందరి వద్దా ‘‘బాబూ! దానం చేయండి. అణా, బేడా, పైసా–పరకో దానం చేయండి బాబూ! మీకు పుణ్యం ఉంటుంది’’ అని అడుక్కున్నాడు.
నాకు ఏదో లోకం నుంచి ఊడిపడ్డట్లనిపించింది. ఈ మనిషి తన కళానైపుణ్యంతో ఎన్నో సంవత్సరాల వెనక్కు నన్ను తీసుకువెళ్లాడు. నేను మళ్లీ వర్తమానానికి తిరిగి వచ్చాను. బకుల్‌ బెనర్జీ నావైపు తదేక దృష్టితో చూస్తున్నాడు. లోలోపల నవ్వుకుంటూనే.
బకుల్‌ అతన్ని గద్దించి అడిగాడు– ‘‘ఏం యాక్టరు మహాశయా! నిన్న చాలా శ్రమపడి సంపాదించిన చందా పైసలేమయ్యాయి? అన్నీ రాత్రి ఏ బట్టీలో కాల్చేశావు. భలే గొప్పోడివే?’’
పుట్టుకతోనే ఆర్ట్‌క్రిటిక్‌గా పేరుపొందిన నా సహాధ్యాయి బకుల్‌ బెనర్జీ ఇప్పటికీ కళను, కళాకారులను గుర్తించే పని చేస్తున్నాడు. మొదటి నుంచి ఇంతే వీడు. ‘‘ఏమోయ్‌! నీవు కూడా వీడి మాటల్లో చిక్కుకున్నావా? ఇతను నిన్న నాతో కూడా ఫర్‌ టూ డేస్‌ అయామ్‌ హంగ్రీ అన్నాడు’’ బకుల్‌ నావైపు చూసి అన్నాడు.

ఎందుకో బకుల్‌ మాట నాకు అప్పుడు నచ్చలేదు. వాణ్ణి అడ్డుకుని అతని చెవిలో ‘‘బకుల్‌! ఊగిసలాడే ఈతని శరీర పంజరంలో ఉన్న పక్షి ఏమంటుందో వినగలవా? అది విని నీకు ఏమనిపిస్తోందో నాకు స్పష్టంగా వివరించి చెప్పు’’ అని అన్నాను.
బకుల్‌ నిశ్చేష్టుడయ్యాడు. నిమిషం సేపు ఊరుకుండి మళ్లీ ఇలా అన్నాడు. ‘‘ఏమీ అనిపించకపోతే నిన్నంతా అతని వెంట తిరిగి భిక్షాటన ఎందుకు చేశాను? చందా అడగటమంటే భిక్షమడగటమే కదా! ఒక నిట్టూర్పు వదిలి మళ్లీ ఏం చెప్పను? ఏమనిపించిందని? నీతో, నీలాంటి ఇతర స్నేహితులతో కలిసి హాస్టలు నుంచి తప్పించుకుని పారిపోయి రాత్రంతా నాటకం చూసినట్టు అనిపించింది’’ అన్నాడు.
‘‘నిజంగానే బకుల్‌ నాకూ అలాగే అనిపించింది’’ అన్నాను. ఇంతలో ఆ ముసలి నటుడు తనకిష్టమైన పాత పాటలోని మొదటి పంక్తులను ఆలపించడం ప్రారంభించాడు.
‘‘తెల్లవారగానే చుక్కలన్నీ మటుమాయమయ్యాయి– అయిన వాళ్లంతా నన్ను వదిలిపోయారు’’
అకస్మాత్తుగా మళ్లీ మా స్మృతిపథంలో తిరనాళ్ల సంబరం మెదలసాగింది.
- హిందీ మూలం : ఫణీశ్వరనాథ్‌ రేణు
- తెలుగు: పి.విజయరాఘవ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement