ఒక ఖైదీ ప్రేమకథ | Funday Story On 21st July 2019 | Sakshi
Sakshi News home page

ఒక ఖైదీ ప్రేమకథ

Published Sun, Jul 21 2019 8:35 AM | Last Updated on Sun, Jul 21 2019 8:35 AM

Funday Story On 21st July 2019 - Sakshi

దొంగతనానికి ఇంట్లో జోరబడ్డాడని కేసు పెట్టి, అతడికి ఒక్క సంవత్సరం శిక్ష వేశారు. కోర్టులో ఆ ముసలివాడి ధోరణీ, నేరం జరిగిన పరిస్థితులూ వింతగా తోచినందున ఖైదీని చూడడానికి అనుమతిని సంపాదించాను. మొట్టమొదట్లో అయితే నీతో నాకేమిటి పొమ్మన్నాడుగాని, చాలా అనునయించిన తర్వాత, తన జీవితకథను చెప్పడానికి అంగీకరించాడు.
‘‘మీ ఊహ నిజమే. నేను బ్రతికి చెడినవాణ్ణి. బాగా చదువుకున్నాను. ఇంజనీరింగ్‌ నా వృత్తి. కుర్రతనంలో చేతిలో కాస్తో కూస్తో పైసా ఆడుతూ ఉండేది. అది పెట్టి సరదాగా బతుకుతూవుండేవాణ్ణి. ప్రతిసాయంత్రం తప్పకుండా విందుకుగాని, డాన్సుకుగాని పోతూ వుండేవాణ్ణి.
రాత్రి అయ్యేసరికి తప్పతాగి ఈ లోకంలో వుండేవాణ్ణికాదు.

ఆరోజు నాకు మహాజ్ఞాపకం.
అప్పటి అతిసామాన్య విషయాలు సైతం పూర్తిగా గుర్తున్నాయి. అయినా, నా స్మృతిపథంలో కొంత వెలితి ఉంది. దాన్ని పూడ్చుకోవడానికి నా క్షుద్ర జీవిత శేషాన్ని వినియోగిస్తాను. నైనాతో సంబంధం వున్న ప్రతి విషయాన్నీ జ్ఞాపకం తెచ్చుకోవాలనే నా యత్నం.
ఆవిడ పేరు నైనా.  సందేహం లేదండీ, నైనాయే ఆవిడ పేరు! నైనా భర్తకు రైల్వేలో చిన్న ఉద్యోగం. వాళ్ళు పేదవాళ్ళు. అయితేనేమి? తన బుద్ధిసూక్ష్మత కొద్దీ దారిద్య్రముద్రాంకితులైన స్వీయజీవితపరిసరాలను నైనా సుమధురం చేసుకునేది.

ఇంటి పనులన్నింటినీ స్వయంగా చక్కబెట్టుకునేది. అయినా, నైనా చేతులు పల్లవకోమలంగా వుండేవి. అతి సామాన్యమైన దుస్తులు ధరించేది. అయినా అవి స్వప్నజగత్తును స్ఫురింపజేసేవి. మీరు నమ్మండి, నమ్మకపోండి ఈ ప్రపంచం కూడా ఆమె సన్నిధానంలో స్వర్గతుల్యం అయ్యేది.
నేను సైతం ఆవిడ పరిచయం ఏర్పడ్డ తర్వాత కొత్తవాణ్ణి అయిపోయాను. ఆ పుణ్యమూర్తి సందర్శన భాగ్యం వల్ల నాలోని మాలిన్యం తొలిగిపోయింది.
‘ఈ దౌర్భాగ్యుణ్ణి ప్రేమించిన పాపం ఆవిడకు చుట్టకోకుండా వుండాలి! దుర్భరమైన పరిసరాలలో, మొరటు మానవుల మధ్య బతుకుతూ వున్న నైనా,  అందచందాలు, యవ్వనమూ వున్న నన్ను, ఎన్నో ప్రేమగీతాలు కంఠస్థంగా వచ్చిన నన్ను...ప్రేమించకుండా వుండలేకపోయింది.
ఎప్పుడు, ఎక్కడ, ఏవిధంగా నాకు ఆవిడతో ప్రథమ పరిచయం కలిగిందో చెప్పమంటే సరిగా చెప్పలేను. విస్తృతి తమస్సును చీల్చుకుని, ఒకదానితో ఒకటి సంబంధం లేని ఆవిడ జ్యోతిర్మయ చిత్రాలు మాత్రం నాకు కనబడుతూ వుంటాయి.

ఇదిగో చూడండి..
సంతోషంగా, ఆనందంగా వుంది. తన్మయత్వంలో నాటకాన్ని చూస్తూవుంది. నాపై దరహాస మధువు చిలుకుతూ వుంది...
ఆ దరహాసం నాకు బాగా జ్ఞాపకం. ఆ తర్వాత ఇద్దరమూ కలిసి ఎక్కడికో వెళ్లాము. ఆవిడ నా ముఖంలో ముఖం పెట్టి ‘నాకు తెలుసు, నా ఈ సుఖస్వప్నం త్వరలోనే తెగిపోతుంది. అయినా జీవించాననే సంతృప్తి మిగులుతుందిగా! అంతేచాలు’ అని అంది. ఈ మాటలు నాకు బాగా గుర్తు. కాని ఆ తరువాత ఏంజరిగిందో తెలియదుగానీ, నైనాతో కలిసి వుండగానే ఇదంతా జరిగిందా అని అడిగితే మాత్రం ఖండితంగా ఏమిచెప్పలేను.
సందేహం లేదండి, నేనే నైనాను పరిత్యంజించాను. ఇది నా దృష్టికి అతి సహజంగా కనబడింది. అప్పటి నా స్నేహితులందరూ సరిగ్గా ఇలాగే ప్రవర్తించేవారు. ఎవతో ఒక వివాహితతో నాలుగురోజుల పాటు కులాసాగా గడపడం, ఆ తర్వాత ఆవిణ్ణి తోసిపారవెయ్యడం!

అందరిలా నేను కూడా నడుచుకున్నాను.
తప్పు చేస్తున్నాను కదా అని అప్పటిలో నాకు తోచనైనా లేదు. డబ్బు దొంగిలించడం, అప్పులు ఎగవెయ్యడం, సి.ఐ.డీగా పనిచెయ్యడం తప్పుగాని, ప్రేమించిన వనితను పరిత్యజించడం మామూలే!
నా జీవితం, నా భవిష్యత్తు  వదులుకుని, ప్రేమాగీమా అంటూ ఎవర్తెనో ఒకర్తెను కనిపెట్టుకుని వుంటానా? తెగతెంపులు చేసుకుపోవడం నిజంగా బాధగా అనిపించింది. అయినా గుండె రాయి చేసుకున్నాను.
నైనా భర్తకు దక్షిణాదికి ఎక్కడికో బదిలీ అయ్యిందనీ, అక్కడికి వెళ్లిన కొద్దిరోజులకే ఆవిడ చనిపోయిందని విన్నాను. అయితే, నైనాతో గడిపిన ఆ రోజులు జ్ఞాపకం వస్తే అతి బాధాకరంగా వుండేది. అంచేత, ఆవిణ్ణి గురించిన వార్తలు నా చెవిన పడకుండా తప్పించుకు తిరిగేవాణ్ణి. ఆవిణ్ణి గురించి ఆలోచించకుండా వుండాలని కూడా ప్రయత్నించేవాణ్ణి.
ఆవిడ బొమ్మను దేన్నీ దగ్గర వుంచుకోలేదు.
ఆవిడ రాసిన ఉత్తరాలను తిరిగి ఆవిడకే ఇచ్చేశాను.
మమ్మల్ని పరస్పరం ఎరిగున్న మిత్రులు ఎవ్వరూ లేరు. ఈ కారణాల వల్ల నైనా చిత్రం క్రమక్రమంగా నా హృదయఫలకం నుంచి చెరిగిపోయింది.

ఈ చోద్యం విన్నారా?
క్రమక్రమంగా నైనాను నేను మరిచిపోయాను!
ఆవిడ ముఖాన్నీ, ఆవిడ పేరునూ అన్నింటిని మరిచిపోయాను.
ఆవిడ నా హృదయకవాటాలను తెరుచుకొని, అసలు ఎన్నడూ లోనికి తొంగైనా చూడనట్లే అయిపోయింది. ఇంత సంపూర్ణంగా విస్మరించగల తన శక్తిని చూసుకుని పురుషుడు  నిజంగా సిగ్గు పడాలి సుమండీ!
సంవత్సరాలు దొర్లిపోయాయి. నా వృత్తిలో ఎలా ప్రవేశించానో, ఎలా నెగ్గుకు వచ్చానో...ఆ వివరాలు మీకు అనవసరం. నైనా లేకపోయిన తర్వాత లౌకికవ్యవహారాల్ని గురించి, ధనార్జన్ని గురించీ మాత్రమే నా కలలన్నీ!
ఒక సమయంలో నేను ఆశించిన విజయాన్ని దాదాపుగా పొందాను కూడా!
వేలకు వేలు ఖర్చుపెట్టగలిగాను. విదేశ పర్యటన సైతం చెయ్యగలిగాను. వివాహం చేసుకున్నాను. సంతానం కూడా కలిగింది. ఆ తర్వాత చేపట్టిన ప్రతిపనీ మసికాసాగింది. వేసిన ప్లానులన్నీ తప్పిపోయాయి. భార్య చనిపోయింది. ఒంటిగాణ్ణి. పిల్లల్ని సాకలేక, వాళ్లను బంధువుల పైకి తోలివేశాను. వాళ్లు బతికి బట్టకట్టిందీ, లేందీ అయినా నాకు తెలియదు.
నా అంతటి పాపాత్ముడు మరి వుండబోడుకదండీ! తర్వాత నేనేమి చేసింది వేరే చెప్పాలా?
తప్ప తాగేవాణ్ణి...ఏజెన్సీ అంటూ ప్రారంభించాను. కాని దాని వల్ల ఏమీ లాభించలేదు. అప్పటికి మిగిలి వున్న కొంచెం ధనాన్ని, శక్తినీ అది మింగివేసింది.

వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవాలనీ, తిరిగి పూర్వస్థితికి రావాలనీ జూదానికి దిగాను. దానిలో అబ్బింది ఏమిలేదు సరికదా, జైల్లో పడవలసిన యోగం కొద్దిలో తప్పిపోయింది. ఉన్న స్నేహితులు మోసం చేశారు.
అక్కడి నుంచి అథఃపతనం ప్రారంభం!
నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు మీరు వచ్చి చూశారే, ఈ స్థితికి దిగజారాను. ఉన్నత సంఘంలో నుంచి ఈ అగాథంలోకి తలకిందులుగా పడిపోయాను. కుళ్లు బట్టలతో ఉండే నేను ఏ మొహం పెట్టుకుని నలుగురిలో తిరగ్గలను?
ఇటీవల కొన్ని సంవత్సరాల పాటు, తాగుడు లేని రోజుల్లో అప్పుడప్పుడూ ఫ్యాక్టరీలలో కూలీ చేస్తూ వచ్చాను. ఇలా కూలి చేస్తూ వుండగా, పురుగు తొలిస్తే చాలు, తిరిగి నేనూ నా తాగుడూ తయ్యార్‌. ఈ స్థితిలో వుండి కూడా నా పరిచయాల్ని చూస్తే నాకు అసహ్యమే!
హఠాత్తుగా ఎప్పుడో అదృష్టచక్రం తిరుగుతుందనీ, తిరిగి సంపన్నుడనౌతాననీ కలలుగంటూ వుండేవాణ్ని. ఆకాశం నుంచి ఏదైనా వారసత్వం ఊడిపడుతుందనీ, ఇలాంటిదే మరేదైనా విచిత్రసంఘటన జరుతుందనీ ఊహలు పోతూవుండేవాణ్ణి.

సరే, ఒకనాడు ఆకలిదప్పులతో నకనకలాడుతూ...అలా ఎందుకు వెడుతున్నానో కూడా తెలియకుండా ఒక పెరట్లోకి వెళ్లాను. వెళ్లేసరికి...‘ఇదిగో అబ్బీ! తాళాలు బాగు చేసేవాడివా?’ అని వంటమనిషి అడిగాడు. ఔనన్నాను. ఆ ఇంటి వారి రైటింగ్‌ టేబుల్‌ తాళం చెడిపోయింది, దాన్ని బాగు చేసేవాడు కావలసి వచ్చాడు. ఆ గది చిత్రపటాలతో,  ఇతర అలంకారాలతో శోభయమానంగా ఉంది. పని ప్రారంభించి రిపేర్‌ పూర్తి చేశాను. ఇంటి ఇల్లాలు ఒక రుబుల్‌ ఇచ్చింది. డబ్బు చేతిలో వేయించుకున్నానో లేదో చిన్ని తెల్లటి పీఠం మీద పెట్టి ఉన్న స్ఫటికవిగ్రహం నాకంటబడింది. ఎంచేతనోగాని వెంటనే తలతిరిగినట్టయ్యింది. రెప్ప వాల్చకుండా అలాగే చూశాను. చూసి, నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను...నైనా!!

నైనాను పూర్తిగా మరిచిపోయానని ఇదివరకే మనవి చేశాను కదా! అయితే ఆవిణ్ణి మరిచిపోయిన సంగతిని మొట్టమొదటిసారిగా గ్రహించినది ముఖ్యంగా అప్పుడే! ఆ క్షణంలోనే! ఒక్కసారిగా ఆవిడ అమృతమూర్తి నా మనోనేత్రం ఎదుట ప్రత్యక్షమైంది. నిద్రాణాలై, నిర్జీవాలై వున్న తలపులు, స్వప్నాలు, భావనలు ఒక్కుమ్మడిగా తిరిగి లేచాయి. జీవించాయి! ఆపాదమస్తకం కంపించిపోతూ ఆ స్ఫటిక విగ్రహానికి కళ్ళు రెంటినీ అప్పగించి, ‘అమ్మా! అది ఎవరి ప్రతిమో అడగవచ్చునా?’ అని వినయపూర్వకంగా ప్రశ్నించాను.

‘అదేనా? అది అమూల్యమైంది. అయిదువందల సంవత్సరాల క్రితం, పదిహేనో శతాబ్దిలో దాన్ని చెక్కారు. చెక్కిన వాడి పేరు కూడా  ఆవిడ చెప్పింది. కాని, సరిగ్గా వినబడ లేదు. ఆవిడ భర్త దాన్ని ఇటలీ నుంచి తెచ్చాడట. దాన్ని గురించి ఇటాలియన్, రష్యన్‌ ప్రభుత్వాల మధ్య చాలా ఉత్తరప్రత్యుత్తరాలు కూడా నడిచాయట. అయితే ఈ విగ్రహం నీ మెప్పు పొందినట్టుందే! ఖర్మం!’ అంటూ ఆవిడ చరచర వెళ్ళిపోయింది.

ఉక్కిరిబిక్కిరి అవుతున్నవాడిలా బయటికి వచ్చి పడ్డాను. ఇది వట్టి పోలిక కాదు. కేవలం అచ్చు! అంతేకాదు దాన్ని స్ఫటికశిలలో పునఃసృష్టి చెయ్యడం! నేను ఎరిగున్న ఆ స్త్రీ వదనబింబాన్ని పదిహేనో శతాబ్దంనాటి శిల్పి ఏ విధంగా సృష్టించగలిగాడో మీరు రవ్వంత చెప్పలగలరా? అచ్చంగా ఒక మాదిరినే ఉండే స్త్రీలు, ఒకరు పదిహేనో శతాబ్దంలోనూ, ఒకరు మన జీవితకాలంలోనూ వుండడం ఎలా సాధ్యం? ఏమీ సందేహం లేదు. శిల్పి చెక్కిన ఆ స్త్రీ నైనాయే! ఇద్దరూ సరిగ్గా ఒక్కటే! ఈ పోలికలు బాహ్యాకృతిలోనే కాదు...ప్రవృత్తిలోనూ, అంతరంగంలోను కూడా!

ఆరోజు నా జీవితాన్ని మార్చివేసింది. నా పూర్వజీవితంలోని నైచ్యాన్నీ, నా పతనం యొక్క పరిమితినీ గ్రహించాను. పరమేశ్వరుడు నైనా అనే దేవతను పంపిస్తే, ఆవిణ్ణి గుర్తించలేకపోతినిగదా! అని తెలుసుకున్నాను. గతించినదానికి వగచి లాభం లేదు. అంచేత, అమూల్యమైన పుష్పధామం పగిలిపోతే, ఆ ముక్కల్ని చేర్చుకునేవాడిలా నైనా స్మృతి ఖండాలను పోగు చేసుకోవడం ప్రారంభించాను. అబ్బో! ఆ స్మృతిఖండాలు ఎంత స్వల్పం! ఎన్ని విధాల ప్రయత్నించినా, సంపూర్ణకృతి కుదర్నేలేదు. అన్నీ ముక్కలు, పెంకులు! కాని, వాటితోనే నా భావనావీధిలో కొత్తకొత్త ఆకృతుల్ని కల్పించుకోగలిగినప్పుడు ఎంత పొంగిపోతూవుండేవాణ్ణి!

వీటిని గురించి ఆలోచిస్తూ, వీటిని జ్ఞాపకం తెచ్చుకుంటూ గంటలకొద్దీ అలా గడిపి వేసేవాణ్ణి! నన్ను చూసి ప్రజలు నవ్వేవారు. కాని నా ఆనందం వారికేమి తెలుసు? నేను ముసలివాడినైపోయాను. తిరిగి జీవితాన్ని ప్రారంభించలేను. కాని, కనీసం నా అంతరాత్మ మాలిన్యాన్ని అయినా కడిగి వేసుకోలేకపోతానా?

ఎలాగైనా సరే, ఇంకొక్కసారి ఆ శిలావిగ్రహాన్ని చూడాలనే కోరిక కలిగింది. ఆ ఇంటి చుట్టూ ఎన్నో ప్రదక్షిణాలు చేశాను. కిటికీలకు దూరంగా పెట్టారు ఆ విగ్రహాన్ని. అంచేత అది ఎన్నడూ నా కంట బడలేదు. ఎన్నో రాత్రులు ఆ ఇంటి ముందు గడిపేశాను. అక్కడ ఎవరెవరు నివసిస్తున్నారో ఏయే గది ఎలా వుంటుందో అంతా నాకు తెలుసు. ఇంటి నౌఖర్లలో ఒకడితో  స్నేహం కూడా చేశాను. వేసవిలో ఇంటి ఇల్లాలు బంధుమిత్రులను చూసి రావడానికి కాబోలు వెళ్లింది. అప్పటికి నా ప్రగాఢవాంఛను ప్రతిఘటించలేకపోయాను.

ఇంకొక్కసారి నైనా విగ్రహాన్ని చూడగలిగితే సర్వం జ్ఞాపకం తెచ్చుకోగలననిపించింది. అలా జ్ఞాపకం తెచ్చుకోగలిగితే ఇక నా జీవితం తరించినట్టేగా! అంచేత, నన్ను ఏ పనికైతే శిక్షించారో దాన్ని చెయ్యడానికి నిర్ణయించుకున్నాను. నా ప్రయత్నంలో నెగ్గలేక పోయానన్న సంగతి మీకూ తెలుసు! హాల్లో పట్టుకున్నారు. తాళాలు బాగు చేసేవాడిననే నెపంతో మొదట్లో ఇంట్లోకి వచ్చానని, తర్వాత ఇంటి చుట్టూ పదేపదే తిరిగాననీ, చివరకు ఎవ్వరూ లేకుండా చేసి తాళం పగలగొట్టి...ఏమైతేనేమి లెండి...కథ కంచికి వెళ్లింది!

‘‘అలా అంటే కాదు! మేము నీ తరపున అప్పీలు చేస్తాము. నిన్ను తప్పకుండా వదిలివేస్తారు’’ అని నేనన్నాను.
‘‘వృథా శ్రమ ఎందుకు బాబూ!’’ అని ముసలివాడు అభ్యంతరం చెప్పాడు.
‘‘నాకు జైలు ప్రాప్తి అయిందిగదా’’ అని ఏడ్చేవాడు. ఎవ్వడూ లేడు. పైగా, నాకు జామీను ఎవ్వరుంటారు? ఇంతేకాకుండా నైనా స్మరణ చెయ్యడానికి బయట వుంటే ఎంతో, జైల్లో వున్నా అంతే!
ఇందుకు ఏమి జవాబు  చెప్పాలో నాకు తోచలేదు. ఇంతలో ముసలివాడు విలక్షణమైన తన శుష్కనేత్రాలతో నన్ను తదేకంగా చూస్తూ ఇలా అన్నాడు:
‘‘ఒక్క సందేహమే నన్ను బాధిస్తుంది. నైనా అంటూ అంటూ అసలు ఒకవ్యక్తి లేదేమో! తాగుడు వల్ల కలిగిన మతిభ్రమణ కారణంగా, ఆ శిలావిగ్రహాన్ని చూసిన క్షణంలో ఈ ప్రణయగాథ అంతా నా పుర్రెలో పుట్టిందేమో!!’’
రష్యన్‌ మూలం : వెలెరీ బ్రూసోవ్‌
తెలుగు: నార్ల వెంకటేశ్వరరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement