పెళ్లంటే... | Story on funday | Sakshi
Sakshi News home page

పెళ్లంటే...

Published Sun, May 4 2014 12:30 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

పెళ్లంటే...

పెళ్లంటే...

జి.లక్ష్మి
 
ఇల్లంతా పెళ్ళి సందడి. ఇల్లుకి ఇల్లూ మనుషులకి మనుషులూ కళకళలాడిపోతున్నారు. ఎటు చూసినా హడావుడి. వచ్చే అతిథులు పోయే అతిథులు, అతిథులకి భోజన ఏర్పాట్లు ఎంత ఆర్భాటంగా ఉండాలో అంత ఆర్భాటంగానూ ఉంది ఇల్లు. పెళ్ళికూతురు పెద్దమ్మలు, పిన్నమ్మలు, అత్తయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు వగైరా వగైరా అందరూ హాల్లో చేరారు. సోఫాలు, కుర్చీలు, మంచాలు ఎటు చూసినా చీరల రెపరెపలే. అంతకుముందు రోజు రాత్రే ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇంక పెళ్ళి పదంటే పదే రోజులు. ఎంగేజ్‌మెంట్‌లో పెళ్ళికూతురికి కాబోయే అత్తగారు పెట్టిన సరంజామా అంతా హాల్లో ఒక పక్కగా ఉంది. పెళ్ళికూతురికి పెట్టిన చీరలు, నగలు, పెళ్ళికూతురి అమ్మ నాన్నకి పెట్టిన బట్టలు ఒకరి తర్వాత ఒకరి చేతులు మారుతూ గదిలో షికార్లు చేస్తున్నాయి. పెళ్ళికూతురికి పెట్టిన ప్రదానం చీర చూసి మూతి మూడు వంకర్లు తిప్పింది అమ్మమ్మ.
 ‘‘అయ్యో! ఇదేం చీరే. ఇంత సాదాసీదాగా ఉంది. పెళ్ళికూతురికి పెట్టాల్సిన చీరేనా ఇది? పెళ్ళికూతురి చీరంటే ఎంత ధగధగలాడిపోవాలి’’ అంది దీర్ఘం తీస్తూ.
 ‘‘మొన్న మన పద్మ ఆడబిడ్డ పెళ్ళి జరగలా! ఆ పెళ్ళిలో పెళ్ళికూతురి చీర బంగారం ముద్ద అంటే నమ్ము. ఎటు తిరిగినా అటు కళ్లు జిగేల్‌మన్నాయి. ఎంత లేదన్నా ఏ డెబ్భై, ఎనభై వేలో ఉంటుంది. లక్షన్నా ఆశ్చర్యపోను. అంత బాగుంది చీర. చీరంటే అదీ’’ అందుకుంది పెద్దమ్మ.
 ‘‘మరీ అంత కాకపోయినా కొంచెం ఫాస్ట్ కలర్ తీసుకుని ఉండాల్సింది. కలర్ గ్రాండ్‌గా ఉన్నా మంచి రిచ్ లుక్ వచ్చేది. కడితే వెలాతెలా పోయినట్టు లేదూ’’ చిన్నమ్మ అంది.
 ‘‘మనం సూట్ పెట్టాం. డైమండ్ రింగ్ పెట్టాం. ముంజేతి గొలుసు పెట్టాం. అనుకున్న దానికన్నా అన్నీ ఎక్కువలోనే తీశాం. మనం పెట్టినవాటికీ వాళ్లు పెట్టినవాటికీ ఎక్కడన్నా పోలిక ఉందా? పెళ్ళికూతురికి నెక్లెస్ సెట్ కొనే దగ్గరే తేలిక పడిపోయారు. ఏమన్నా మనకి పెట్టేవా? వాళ్ల పిల్లేగా ఇంక. దానికి ఉండేవేగా’’ పెద్ద మేనత్త అంది.
 ‘‘మేం అనడం కాదుగానీ నువ్వే చెప్పవే గీతా. చీర కానీ సెట్ కానీ నీకు నచ్చిందా? మీ అమ్మ ఎప్పుడన్నా అట్లాంటి చీర కట్టిందా? మనుషుల్ని బట్టి అన్నా కొనద్దూ? కొన్నామన్న పేరుకి కొన్నారు. పెట్టామన్న పేరుకి పెట్టారు. అవా పెట్టుపోతలంటే? మీ అమ్మకి చెబుతూనే ఉన్నాను. ఆడపిల్ల గలవాళ్లం. బోలెడు ఖర్చులుంటాయి. కాస్త ముందూ వెనుకా చూడూ అని. వినకుండా ఎంతేసి పెట్టి కొందో చూడు. ఆఖరికి ఊళ్లో పంచడానికి కూడా గ్రాండ్‌గా ఉండాలని ఎంత ఖర్చు పెట్టిందో చూడు. పెళ్ళికొడుకు తరఫువాళ్లు అయివుండీ వాళ్లు కాపీనం చూపించారు’’ చిన్న మేనత్త అంది.
 ‘‘పోనీ ఓ పని చేయవే బుజ్జీ. రేపు పెళ్ళికి ఎలాగూ వాళ్లకి బట్టలు పెట్టాలి కదా. నీకు పెట్టిన చీర మళ్లీ వాళ్లకే పెట్టెయ్ సరిపోతుంది’’ పెద్దమ్మ అక్కసుగా సలహా ఇచ్చింది.
 ‘‘ఛ. ఛ. అట్లా చేస్తే ఏం బాగుంటుంది? వాళ్లేదో పల్లెటూరువాళ్లు. తెలసో తెలియకో ఏదో కొన్నారు. దానికి ఎందుకలా ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? నాలుగుసార్లు కట్టి విడిచే చీర కోసం ఇంత గుంపు చింపులు పడాలా?’’ చిన్నాయనమ్మ పెళ్ళికొడుకు వాళ్లని వెనకేసుకొచ్చింది.
 ‘‘పెళ్ళికొడుకుది దీని అత్తగారి ఊరని చూడవే ఎలా సమర్థించుకొస్తోందో. దాని కొడుకు పెళ్ళి జరిగినప్పుడు అది నచ్చలేదనీ ఇది నచ్చలేదనీ ఎంత తిరణాల చేసిందో మనం మర్చిపోయామనుకుంటోందేమో కర్రిది’’ నానమ్మ చెల్లెల్ని ఎగతాళి చేసింది.
 ‘‘నీ గోల పాడుగానూ, అటు తిరిగి ఇటు తిరిగి నాకు పెడతావేమే? నీ ఊరుకొచ్చానా? నీ సోది కొచ్చానా? ఏదో పెళ్ళిల్లు. నిష్ఠూరాలెందుకు? మనసులు బాధ పెట్టుకోకండల్లా అని అన్నాను గానీ’’ చిన్నాయనమ్మ ఉడుక్కొంది.
 అందరూ ఫక్కుమన్నారు.
 ‘‘అవన్నీ కాదుగానీ గీతమ్మా. ఇప్పటికేదో అయిపోయిందనుకో. పెళ్ళికూతురికి పెట్టాల్సిన నగలూ, చీరలూ పెట్టలా వాళ్లు. ఇదంటే ఏదో నలుగురి మధ్యనా అయిపోయింది. రేపు పెళ్ళి అంటే ఇలా కాదుగా. అందరూ పెళ్ళికూతురు పెళ్ళికూతురు అని ఎగబడి చూస్తారు. ఎలా ఉంది? ఏం నగలు పెట్టింది? ఏ చీర కట్టింది? ఎంత ఖరీదుది కట్టింది అని వంద పరీక్షలు చేస్తారు. ఆ రోజుకి నువ్వే హీరోయిన్‌వి. నువ్వే వీఐపీవి. అందర్లో నువ్వే పెట్రోమాక్సు లైటులా ధగధగలాడాలి. పెళ్ళికొచ్చినాళ్లూ అయ్యే చీరలు కట్టి, పెళ్ళికూతురూ అయ్యే చీరలు కట్టి ఇంక తేడా ఏంటంట? పెళ్ళి కన్నా అట్లా జరక్కుండా చూడు. ఆ అబ్బాయితో అప్పుడప్పుడూ మాట్లాడుతున్నావంటగా. అతనితో గట్టిగా చెప్పెయ్యి. ఇలా వివరం గివరం లేని పనులు చెయ్యొద్దని. మన లెవిలుకి తగ్గట్టు పెట్టమను ఏది పెట్టినా’’ అమ్మమ్మ చిన్నపాటి లెక్చరిచ్చింది.
 పెళ్ళికూతురి మొహం చిన్నబోయింది. మొహం కళ తప్పింది. కోపంతో అదురుతున్న పెదాలతో సెల్ చేతిలోకి తీసుకుంది.
    
 ‘‘ఏదో గొప్ప సంబంధం గొప్ప సంబంధం అంటే కామోసనుకున్నాను. ఇదేం సంబంధమే. ఒక్క సూట్ పెట్టడానికి అన్ని నీల్గుళ్లు నీల్గారు. మొన్న సుబ్బయ్యగారి అచ్యుతరామయ్యగారి కొడుక్కి ప్రదానానికే రెండు సూట్లు పెట్టారు. ప్రదానబ్బట్టలు వెండి పళ్లాలలో పెట్టి అందించారు. పెళ్ళికూతురి తల్లికి ఎంతవరకూ కిందా పైనా చీర సర్దుకోవడమే సరిపోయింది. కనీసం పెళ్ళికొడుకు తరఫువాళ్లని భోజనాలకు లేవండని చెప్పినాళ్లు కూడా లేరు. అదేదో ఎంత బఫేనో డఫేనో అయితే మాత్రం భోజనాలకు రండని అన్నా చెప్పొద్దా?’’ పెళ్ళికొడుకు నాయనమ్మ మొహం ముటముటలాడించింది.
 ‘‘మరేనే అక్కా బాగా చెప్పావు. ఎంతవరకూ వాళ్ల హంగూ ఆర్భాటం చూపించుకోవడమే గానీ అసలు ఏం మర్యాదలు చేశారని. ఆడాళ్లకు గంధం, పసుపు పెట్టడానికి ఒక్కదానికి చేతకాలా! ఊరికే ఇకఇకలూ పకపకలూ. అక్కడికి ఏదో పెద్దపట్నం నుంచీ దిగి వచ్చినట్టు. ప్రదానంలో కార్లు పెట్టేవాళ్లు కూడా ఈళ్లంత బడాయి పోరు’’ ఇరుగింటి సరోజనమ్మ వంత పాడింది.
 ‘‘ఊళ్లో పంచడానికి లెక్కపెట్టి మరీ మూడొందల గడపంటే మూడొందల గిఫ్టులు పంపించారు. జీతగాళ్లు నాతగాళ్లు ఉండరా ఏంటి? ఇంకో పాతికో పరకో అదనంగా పంపుకోరూ? పెళ్ళికూతురి పెద్దమ్మ అనుకుంటా సూరేకాంతంలా ఉంది. మొహం చూసి ముద్ద ఏసేరకం. లెక్కపెట్టి మరీ ఇచ్చిందమ్మా మహాతల్లి. మా బుడ్డది నాక్కూడా ఆ సంచీ కావాలని ఏడ్చి గీపెట్టింది. నా సంచీ ఇవ్వబోతే తీసుకోలా? అంత ఏడుపు చూస్తా కూడా ఇంద తీసుకో అని ఓ సంచీ పిల్ల చేతిలో పెట్టిందేమో చూడు. అయి పిల్లలకు కాదులే పెద్దాళ్లకు అని ఓ మాట అని ఊరుకుంది. ఇంతా చేస్తే అందులో ఏం ఉందని? ఓ బొచ్చె, ఓ లడ్డు, రెండు అరటిపళ్లు. దీనికే అంత కాపీనం పోయింది’’ పెళ్ళికొడుకు పిన్నమ్మ ఎత్తి పొడిచింది.
 ‘‘అయినా నాకు తెలీక అడుగుతానూ. పెళ్ళికొడుకు తల్లనే గానీ దీనికి ఏమంత వయసు మించి పోయిందని? అదెప్పుడు గద్వాల చీరలు కట్టాలి? ఏ ఉప్పాడ పట్టుచీరో పెడితే పోయేదానికి? ఒరే అబ్బడూ ఇప్పుడే చెబుతున్నా. ఏదో ప్రదానం కాబట్టి సరిపోయింది. రేపు పెళ్ళి కూడా ఇట్టాగే జరిగితే నీ ఇంటి గడప కూడా తొక్కనబ్బాయ్. ఇప్పుడే చెబుతున్నా. పెళ్ళికొడుకు వాళ్లం ఆ మాత్రం బెట్టుగా ఉండకపోతే తాటాకులు కట్టేస్తారు తాటాకులు’’ పెళ్ళికొడుకు అమ్మమ్మ హెచ్చరించింది.
 ‘‘అవునే సావిత్రీ. మనూరోళ్లకి మరీ పట్టింపులెక్కువ. మొన్న జానకిరామయ్యగారి మనవరాలి పెళ్ళిలో మర్యాదలు సరిగా లేవని మగపెళ్ళివారు భోజనాలకు లెమ్మన్నా లెగలేదట. వాళ్లని బతిమిలాడి బామాడి భోజనాలకు లేపిచ్చేసరికి తాతలు దిగొచ్చారంట. ఏదన్నా తేడా జరిగిందంటే మనూరోళ్లతో అసలు ఏగలేమే తల్లీ. నీ కొడుకు పెళ్లితో మొదలెట్టి మనవడి పెళ్లి అయ్యేవరకూ దెప్పుతూనే ఉంటారు. ఎకసెక్కాలు ఆడుతూనే ఉంటారు. నీ మంచికే చెబుతున్నా. ఎలాంటి లోటూ జరక్కుండా చూసుకో’’ పెద్దమ్మ సలహా ఇచ్చింది.
 ‘‘అరేయ్. పెళ్ళికూతురు, అదే ఆ పిల్ల గీతమ్మో, రేకమ్మో ఏదో నువ్వు మాట్టాడుతుంటావుగా ఆ పిల్లకు గట్టిగా చెప్పు. రేపు పెళ్ళిలో మర్యాదలు సరిగా లేకపోతే గోలైపోతుందని’’ చిన్నమ్మ హెచ్చరించింది.
 పెళ్ళికొడుకు మొహం కోపంతో ఎర్రబడిపోయింది. ముక్కుపుటాలు అదురుతుండగా కోపంతో సెల్ తీసుకున్నాడు.
 ‘‘హలో, నేను వంశీని.’’
 ‘‘చెప్పండి’’ పెళ్ళికూతురి గొంతులో ఇదివరకటి మార్దవం లేదు.
 ‘‘ఏం లేదు. మీతో ఒక మాట చెప్పాలి. ఫ్రీగా ఉన్నారా?’’
 ‘‘ఫరవాలేదు. చెప్పండి.’’
 ‘‘ఏం లేదు. నిన్న జరిగిన ఎంగేజ్‌మెంట్‌లో సరిగా మర్యాదలు జరగలేదట. పెట్టిన బట్టలూ అవీ అంత బాగులేవుట. మా వాళ్లంతా కోపంగా, అసంతృప్తిగా ఉన్నారు’’ వంశీ అన్నాడు.
 ‘‘మావాళ్లు కూడా అలాగే ఉన్నారు’’ గీత గొంతులో కరుకుదనం.
 ‘‘మీరేం అనుకుంటున్నారు దాని గురించి?’’
 ‘‘అనుకోడానికేముంది? వాళ్లన్నదానిలో నాకేం తప్పు కనిపించలేదు.’’
 ‘‘ఇలా అనుకుంటారనే నేను ఫోన్ చేసింది. నేను మావాళ్లకు ఒకటే చెప్పదలచుకున్నాను. మేం పెళ్లి చేసుకునేది మా కోసం. మా జీవితం కోసం. మేం సంతోషంగా జీవితం గడపడం కోసం. మీకు పెట్టే చీరల కోసం, నగల కోసం కాదు. ఇలా పేచీలు పెడితే నేనసలు పెళ్ళి మండపం గడపే తొక్కను అని. మీరే చెప్పండి. ఇది మన జీవితం. అవునా కాదా?’’ వంశీ ఆవేశంగా అన్నాడు.
 గీతకి ఏం అనాలో తోచలేదు. సగం సంతోషం, సగం దుఃఖంతో గొంతు ఉండచుట్టుకుపోయింది.
 ‘‘అన్నట్టు గీతా, మీకోసం కొన్న చీర నేనే సెలక్ట్ చేశాను. ఆడవాళ్ల చీరల గురించి నాకేం తెలుసు? అందులో ఖరీదైన చీర. నేను సెలక్ట్ చేస్తా, నీకేం తెలీదు నువ్వూరుకో అంది అక్క. కానీ మా ఇంట్లో అడుగుపెడుతున్న మీకు మొట్టమొదటగా మా తరఫున పెడుతున్న చీర. అది నేను సెలక్ట్ చేస్తేనే బాగుంటుందనిపించింది. నిజంగా చెప్పండి. చీర బాగుందా లేదా?’’ వంశీ అడిగాడు.
 ఎండా వానా కలగలిసిన ఇంద్రధనుస్సులా కన్నీళ్లతో నవ్వింది పెళ్ళికూతురు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement