సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సురేందర్ కమిట్‌మెంట్ ఉన్న నాయకుడని అన్నారు. పైసలు, పదవుల కోసం సురేందర్ రాజకీయల్లోకి రాలేదని, తెలంగాణ రావాలని కేసీఆర్‌తో కలిసి నడిచారని గుర్తు చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన నాయకులకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు.
కేసీఆర్‌ను, మంత్రులను సురేందర్ ఎప్పుడు కలిసినా మా నియోజకవర్గం వెనుకబడింది, నిధులు కేటాయించాలని అడుగుతారని కేటీఆర్ గుర్తు చేశారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ.20 కోట్ల 31లక్షల నిధులు మంజూరు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే అత్యధికంగా 1లక్షా 3 వేల మందికి రైతు బంధు అందుతోందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం రైతులు అవస్థలు పడ్డారని విమర్శించారు. కరెంట్ లేక సాగునీరు కోసం రైతులు అడుక్కోవాల్సి వచ్చిందన్నారు. విత్తనాలు, ఎరువు పోలీస్ స్టేషన్‌లో పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్‌దని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు 10 సార్లు ఓటేస్తే రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు ఇచ్చారా అని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీవి నీతి లేని మాటలని కేటీఆర్ ధ్వజమెత్తారు. హిందూ, ముస్లిం తప్ప బీజేపీకి మరో ఎజెండా లేదని ఫైర్ అయ్యారు. రాబంధులు రావాలా రైతు బంధు కావాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే మళ్ళీ కుంభకోణాలేనని విమర్శించారు. హస్తం పాలనలో దుర్భిక్షం.. బీఆర్‌ఎస్ పాలనలో సస్యశ్యామలమని తెలిపారు. కాగా 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీచేసిన సురేందర్ సమీప టీఆర్‌ఎస్(ఇప్పటి బీఆర్‌ఎస్) అభ్యర్థిపై 31,000 వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
అంతకముందు మంత్రి వేముల వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.28 కోట్లతో నిర్మించిన ఆరు లేన్ల రహదారి, స్వాగత తోరణం, సెంట్రల్ లైటింగ్, మీడియన్, రోడ్డు డివైడర్లను కేటీఆర్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment