Dharmapuri Srinivas (DS)
-
ధర్మపురి శ్రీనివాస్‌కు ప్రముఖుల నివాళి (ఫొటోలు)
-
డీఎస్ పక్కా ప్లాన్! టికెట్ కన్ఫామ్ అయ్యాకే పార్టీ మార్పు.. సంజయ్ పోటీ అక్కడినుంచేనా?
ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్‌లో చేరికతో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీలో వార్ మొదలైందా? అర్బన్ సీటు సంజయ్‌కు కన్ఫామ్ అయిందా? మరి నిజామాబాద్ అర్బన్‌పై ఆశలు పెట్టుకున్నవారు ఏం చేయాలి? పార్టీలో మొదలైన మాటల యుద్ధాన్ని ఎవరు చల్లార్చుతారు? సంజయ్ వల్ల కాంగ్రెస్‌కు లాభమా? నష్టమా? వాచ్ దిస్ స్టోరీ.. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ తన పెద్ద కుమారుడు సంజయ్‌ను ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేర్చారు. సంజయ్ గాంధీభవన్‌లో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఎంతమంది అడ్డుకున్నా ఈ విషయంలో డీఎస్ సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్‌లో తనకున్న పట్టు.. తన రాజకీయ అనుభవం ఏంటో పార్టీలోని ప్రత్యర్థులకు చూపించారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో కొడుకు సంజయ్‌తో కలిసి కాంగ్రెస్‌లో చేరి 24 గంటలు తిరక్కుండానే డీఎస్ పీచేముడ్ అనడంతో ఒక్కసారిగా ధర్మపురి ఫ్యామిలీ పాలిటిక్స్ బట్టబయలయ్యాయి. డీఎస్ ఫ్యామిలీ పొలిటికల్ ఎపిసోడ్ పక్కనపెట్టి.. నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ రాజకీయాలు పరిశీలిస్తే సరికొత్త వార్‌కు తెరతీసినట్లయింది. డీఎస్ పక్కా ప్లాన్ తోనే తన కొడుకు సంజయ్ కు టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకునే తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చారన్న చర్చ ఊపందుకుంది. నిజామాబాద్ అర్బన్‌లో మున్నూరు కాపుల బలమెక్కువగా ఉండటం డీఎస్ కుమారుడికి కలిసొచ్చే అంశం. ఇప్పటికి రెండుసార్లు ఇక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు. అయితే ఆయనకు పార్టీలోను, ప్రజల్లోనూ వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో.. ఈసారి మున్నూరు కాపు బిడ్డను గెలిపించుకోవాలనే గట్టి పట్టుదలతో ఆ సామాజికవర్గీయులంతా ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది. చదవండి: ఎంపీ అర్వింద్‌కు కొత్త టెన్షన్.. నిజామాబాద్‌లో రసవత్తర రాజకీయం! మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన నేతగా.. తనకూ, తన తండ్రికి తమ వర్గంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని ఈసారి నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించాలన్నది సంజయ్ యోచనగా ఉంది. దానికి కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సై అన్నట్టుగా ఇప్పటికైతే ఓ ప్రచారం ఊపందుకుంది. కానీ సంజయ్ మాత్రం ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా.. తన గ్రౌండ్ వర్కంతా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సంజయ్ రాకను ఆది నుంచీ స్థానిక కాంగ్రెస్ నేతలు కొందరు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తమ అభ్యంతరాలను ఏఐసీసీకి కూడా నివేదించారు. సీనియర్ నేత, పార్టీకి ఎంతో సేవ చేసిన డీఎస్ వస్తే పర్లేదు గానీ.. సంజయ్ అవసరమా అన్నట్టుగా బాహాటంగానే వ్యతిరేకిస్తూ వచ్చారు. సంజయ్ రాకను అడ్డుకునేందుకు అంతర్గతంగా పావులు కదిపారు. కానీ డీఎస్ తన పంతం నెగ్గించుకుని కొడుకు సంజయ్‌ను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. చదవండి: కొడవళ్ళకు గులాబీ చిక్కడం లేదా? లెఫ్ట్ పార్టీల వన్ సైడ్ లవ్ ఇంకా ఎన్నాళ్ళు..? దీంతో ఇంతకాలం నిజామాబాద్ అర్బన్‌పై ఆశలు పెట్టుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పరిస్థితేంటన్న చర్చ కాంగ్రెస్‌లో మొదలైంది. సంజయ్‌కు టిక్కెట్ కన్ఫామ్ అయిందంటూ సాగుతున్న ప్రచారాన్ని మహేష్ గౌడ్ కొట్టిపారేస్తున్నారు. టిక్కెట్ ఖరారైందంటూ ఇప్పట్నుంచే ఎవరైనా చెప్పుకుంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ.. పరోక్షంగా సంజయ్ కు చురకలంటించే యత్నం చేశారు. తన తమ్ముడు, బీజేపీ ఎంపీ అరవింద్‌తో కొనసాగుతున్న పొల్టికల్ వార్‌లో భాగంగా.. అవసరమైతే అరవింద్ పైనే పోటీకి దిగుతానంటూ కూడా సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పార్టీలోని సంజయ్ ప్రత్యర్థులు దాన్ని కూడా అడ్వంటేజ్‌గా మార్చుకుంటున్నారు. ఆర్మూర్ అసెంబ్లీ స్థానం నుంచి అరవింద్ పోటీ చేస్తాడన్న ప్రచారం జరుగుతుండటంతో.. సంజయ్‌ను అక్కడే తన తమ్ముడిపై బరిలో దింపాలని కూడా అధిష్ఠానం ముందు తమ సూచనలు ఉంచినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓ వైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వర్గం...మరోవైపు సంజయ్ వర్గం కాంగ్రెస్ బరిలో గిరిగీసి కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీలతో కాకుండా..పార్టీలోని ప్రత్యర్థులతోనే ఎవరికి వారు పోరాడాల్సిన పరిస్థితి ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్‌లో కొనసాగుతోంది. మొత్తం మీద నిజామాబాద్ అర్బన్‌లో ఒకవైపు డీఎస్ ఫ్యామిలీలో అంతర్గత యుద్ధం..మరో వైపు హస్తం పార్టీలో టిక్కెట్ పోరు అక్కడి కేడర్‌లో ఉత్కంఠను రేపుతోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్ -
ఇద్దరు కుమారుల రాజకీయ పంతం.. రీజాయిన్.. రిజైన్!
సాక్షి, హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్ పార్టీకి తిరిగి రాజీనామా చేశారు. తన పెద్ద కుమారుడు సంజయ్‌తో కలసి కాంగ్రెస్ కండువా కప్పుకొన్న మరుసటి రోజే రాజీనామా చేస్తున్నట్టు డీఎస్ ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపింది. సంజయ్ చేరిక నేపథ్యంలో ఆశీస్సులు అందజేయడానికి గాంధీభవన్‌కు వెళ్లానని.. కానీ తనకు కండువా కప్పి పార్టీలో చేరినట్టు ప్రచారం చేశారని రాజీనామా లేఖలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనని.. ఆరోగ్య పరిస్థితుల రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని డీఎస్ పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు డీఎస్ రాసిన లేఖతోపాటు తన భర్తను రాజకీయాల్లోకి లాగవద్దని ఆయన భార్య విజయలక్ష్మి కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ రాసిన లేఖ, ఆమె మాట్లాడుతున్న వీడియో, రాజీనామా లేఖపై డీఎస్ సంతకం పెడుతున్న వీడియోలను మీడియాకు విడుదల చేయడం గమనార్హం. డీఎస్ చిన్నకుమారుడు అరవింద్ బీజేపీ ఎంపీకాగా.. పెద్ద కుమారుడు సంజయ్ తాజాగా కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు, పంతాలే.. డీఎస్ చేరిక, రాజీనామా ఎపిసోడ్‌కు కారణమనే చర్చ జరుగుతోంది. డీఎస్ రాసిన లేఖలో ఏముందంటే.. ‘‘ఈ నెల 26న నా కుమారుడు సంజయ్ కాంగ్రెస్‌లో తిరిగి చేరిన సందర్భంగా ఆశీస్సులు అందజేయడానికి గాంధీభవన్‌కు వెళ్లాను. అప్పుడు నాకు కండువా కప్పి నేను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు మీడియాలో ప్రచారం చేశారు. నేను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే. కానీ ప్రస్తుత నా వయసు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండదల్చుకున్నాను. పార్టీలో నా చేరికకూ, నా కుమారుడు సంజయ్ టికెట్‌కు ముడిపెట్టడం భావ్యం కాదు. కాంగ్రెస్ విధివిధానాలు, సంప్రదాయాలు, ప్రజామోదం మేరకే పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతుందన్న విషయం తెలియనిది కాదు. ఆరోగ్యరీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న నన్ను వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరానని మీరు భావిస్తే.. ఈ లేఖను రాజీనామాగా భావించి ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను’’ అని డీఎస్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ప్రతిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కూడా పంపుతున్నట్టు తెలిపారు. ఈ లేఖపై డీఎస్ సంతకం చేస్తున్న వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖపై సాక్షిగా డీఎస్ భార్య విజయలక్ష్మి చేసిన సంతకం ఉండటం గమనార్హం. డీఎస్ భార్య పేరిట మరో లేఖ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు డీఎస్ రాసిన లేఖతోపాటు ఆయన భార్య విజయలక్ష్మి పేరిట మరో లేఖను, ఆమె మాట్లాడిన వీడియో కూడా మీడియాకు విడుదలైంది. ‘ఇదిగో డీఎస్ రాజీనామా.. ఇది ఎవరికి సంబంధించితే వారికి..’ అంటూ విజయలక్ష్మి సంతకంతో ఈ లేఖను రాశారు. ‘‘ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. ఆయనను మీరు పార్టీలో చేర్చుకునే పద్ధతి కూడా ఇదికాదు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వచ్చింది. దయచేసి మీ రాజకీయాలకు ఆయనను వాడుకోవద్దు. మీరు నిన్న చేసిన ఒత్తిడి వల్ల డీఎస్‌కు రాత్రి ఫిట్స్ కూడా వచ్చాయి. కాంగ్రెస్ వాళ్లకు చేతులు జోడించి దండం పెడుతున్నా. ఇంకోసారి ఇటువైపు రాకండి. ఈ వయసులో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కొంచెం ప్రశాంతంగా బతకనీయండి..’’ అని ఆ లేఖలో విజయలక్ష్మి పేర్కొన్నారు. సాయంత్రానికి హెల్త్ బులెటిన్ డీఎస్, ఆయన భార్య విజయలక్ష్మి పేరిట లేఖలు, వీడియోలతోపాటు సోమవారం సాయంత్రం డీఎస్‌కు వైద్యుల సలహాతో కూడిన లేఖ కూడా మీడియాకు అందింది. డీఎస్ పార్కిన్సన్స్ వ్యాధి, బీపీతో బాధపడుతున్నారని, ఆయన మెదడుకు సర్జరీ అయిందని.. ఇటీవలే గుండెపోటుకు కూడా గురయ్యారని పేర్కొంటూ కన్సల్టెంట్ న్యూరాలజిస్టు బి.చంద్రశేఖర్‌రెడ్డి పేరిట ఈ లేఖను విడుదల చేశారు. డీఎస్ ఒత్తిడికి దూరంగా ఉండాలని, జన సమూహాలు, ప్రయాణాలు, రాజకీయాలు, మీడియాకు దూరంగా ఉండటం అవసరమని ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. కుమారుల రాజకీయ కలహాలతో..! తాను కాంగ్రెస్‌లో చేరేందుకే గాంధీభవన్‌కు వచ్చానని, తాను చనిపోయాక మృతదేహంపై కాంగ్రెస్ జెండా కప్పాలని సోనియాగాంధీని కలిసినప్పుడు కోరానని ఆదివారం పేర్కొన్న డీఎస్ మరునాడే రాజీనామా చేయడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన ఇద్దరు కుమారుల మధ్య రాజకీయ వైరమే దీనికి కారణమని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. డీఎస్ చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు సంజయ్ ఆదివారమే కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా సంజయ్‌తోపాటు డీఎస్ కూడా గాంధీభవన్‌కు వెళ్లారు. అయితే సంజయ్ చేరిక సందర్భంగా డీఎస్ గాంధీభవన్‌కు వెళ్లాలా, వద్దా అన్న విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నట్టు డీఎస్ సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాలా కాలం నుంచీ విడిగా ఉంటున్న డీఎస్ కుమారులు ఇద్దరు చెరో పార్టీలో ఉన్నారు. ఆ ఇద్దరూ ఎవరికి వారు తమకు అనుకూలంగా తండ్రిని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తుండటమే ఈ రాద్ధాంతానికి కారణమని డీఎస్ కుటుంబ సన్నిహితులు చెప్తున్నారు. వాస్తవానికి డీఎస్ కాంగ్రెస్‌లో చేరడం ఎప్పుడో ఖరారైందని.. ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరడానికి ముందు డీఎస్ ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలిసి వచ్చారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. డీఎస్ కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలతో ఇంతకాలం ఆగినట్టు వివరిస్తున్నాయి. చివరికి పెద్ద కుమారుడు సంజయ్ రాజకీయ భవిష్యత్తు వైపు మొగ్గుచూపిన డీఎస్.. ఆదివారం గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. కానీ మరుసటి రోజే రాజీనామా చేశారు. కాగా.. డీఎస్‌కు ప్రాణహాని ఉందని, ఆయనకు రక్షణ కల్పించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ప్రభుత్వాన్ని కోరారు. అరవింద్ బ్లాక్మెయిల్ కారణంగానే..: సంజయ్ డీఎస్ రాజీనామా విషయమై ఆయన పెద్ద కుమారుడు సంజయ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. తన సోదరుడు అరవింద్ దిగజారి వ్యవహరిస్తున్నాడని, బ్లాక్ మెయిల్ చేసి తన తండ్రితో లేఖలు రాయిస్తున్నారని ఆరోపించారు. అరవింద్ రౌడీలను, డబ్బును అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, తన తండ్రి ప్రాణాలకు హాని ఉందని ఆరోపించారు. ‘‘మా నాన్నకు ఫిట్స్ వస్తే ఇంట్లో ఎందుకు ఉంచారు? ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే నేను అరవింద్‌పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎవరి సత్తా ఏమిటో ఎన్నికల్లోనే తేలుతుంది..’’ అని సంజయ్ వ్యాఖ్యానించారు. -
మళ్లీ సొంతగూటికి డీఎస్
సాక్షి, హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) సొంత గూటికి చేరుకున్నారు. తన కుమారుడు సంజయ్‌తో కలిసి ఆదివారం ఉదయం గాంధీభవన్‌కు వచ్చిన డీఎస్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే సమక్షంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డిలు ఆయనకు పార్టీ కండువాలు కప్పారు. ఆయనతో పాటు నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, మేడ్చల్ సత్యనారాయణలు కూడా పార్టీలో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు పొన్నాల లక్ష్మయ్య, రేణుకా చౌదరి, అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు. సంతోషంగా ఉంది: డీఎస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడంపై మాజీ ఎంపీ డీఎస్ మీడియాతో మాట్లాడుతూ తనకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉందన్నారు. తాను కాంగ్రెస్‌ను వీడి తప్పు చేశానని, భవిష్యత్తులో అలాంటి తప్పు చేయనని, తాను చనిపోయినపుడు తన మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండానే ఉంచాలని సోనియాగాంధీని కలిసినప్పుడు చెప్పానని వెల్లడించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ పార్టీ అధికారంలోకి వచ్చేది రానిది ప్రజల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. రాహుల్‌గాంధీకి అండగా నిలబడతామని చెప్పారు. డీఎస్ సారథ్యంలోనే అధికారంలోకి వచ్చాం: రేవంత్ డీఎస్ పార్టీలో చేరిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ డీఎస్ది లక్కీ హ్యాండ్ అని వ్యాఖ్యానించారు. ఆయన పార్టీలో చేరడానికి ప్రాధాన్యత ఉందని, డీఎస్ ఎప్పుడు క్రియాశీలంగా ఉన్నా పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన సారథ్యంలోనే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడు రాహుల్‌గాంధీకి అండగా నిలిచేందుకు డీఎస్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారన్నారు. కాగా, సొంతగూటికి చేరుకున్న డీఎస్‌ను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్, జానారెడ్డిలు డీఎస్‌ను ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా పలకరించారు. డీఎస్ గాంధీభవన్‌లో ఉన్నంతసేపూ ఆయన పార్టీ అభివృద్ధికి చేసిన కృషి గురించి నేతలకు వివరించారు. డీఎస్ ఆరోగ్యం గురించి పలువురు నేతలు వాకబు చేశారు. -
కవిత ఎంట్రీ.. డైలమాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్!
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ డైలమాలో పడ్డారా? తొలిసారి ఎంపీగా గెలిచిన ఆనందం కొనసాగుతుందా? ఇంతటితో ఆగిపోతుందా? ఇంతకీ ఆయన టెన్షన్‌కు కారణం ఏంటి? అసలు ఇందూరు రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రాబోయే ఎన్నికల నాటికి పరిణామాలు ఎలా మారబోతున్నాయి? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మాజీ మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఓ స్థాయిలో చక్రం తిప్పిన తండ్రి అండదండలు ఓపక్క.. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితనే ఓడించిన ఆత్మవిశ్వాసం మరోపక్క.. నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కు మంచి ఇమేజ్ తెచ్చి పెట్టాయి. అయితే కొంత కాలం స్తబ్దుగా ఉన్న కల్వకుంట్ల కవిత మళ్లీ ఇందూర్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో... ధర్మపురి అరవింద్ లో డైలామా మొదలైంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్కువ శాతం అధికార టీఆర్ఎస్ పార్టీ వారే కాబట్టి... వారి అండదండలతో కవిత ఎమ్మెల్సీగా మళ్లీ నిజామాబాద్ రాజకీయాల్లో అడుగు పెట్టారు. దీంతో బీజేపి మళ్లీ ఆమెపై ముప్పేట దాడిని మొదలెట్టినా... కవిత మాత్రం ఇందూరు చుట్టే తన రాజకీయ జీవితాన్ని తిప్పుతుండటంతో... ఎంపీ అరవింద్‌లో ఒకింత టెన్షన్ మొదలైందా అన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ఎంపీలందరినీ.. ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపాలన్న యోచనలో బీజేపి అధిష్ఠానం ఉన్నట్టుగా రాష్ట్ర పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అరవింద్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టే ఆయన పెర్కిట్ లో ఇల్లు కూడా తీసుకుని...అక్కడి నుంచి కార్యకలాపాలు మొదలెట్టడం కూడా ఆ ప్రచారం నిజమే అనిపిస్తోంది. ఎన్ని ఆరోపణలున్నా.. కొంచెం గట్టి పిండమైన జీవన్ రెడ్డి... వాటన్నింటినీ చూసీచూడనట్టుగానే పోతూ... ఇంకోవైపు అరవింద్నూ అంతకంతకూ కౌంటర్ చేస్తుండటంతో... అరవింద్ ఇప్పుడు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడమా? వద్దా అన్న మీమాంసలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఫ్యూచర్ పాలిటిక్స్‌కు చిక్కు అరవింద్ మీమాంసను మరింత బలపర్చేలా... రానున్న ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ పార్లమెంట్‌కు మళ్లీ ఎన్నిక కావాలనుకుంటే నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి లేదా అసెంబ్లీకి వెళ్లాలనుకుంటే ఆర్మూర్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తారంటూ ఇప్పటివరకు ఊహాగానాలు కొనసాగాయి. వచ్చే ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నుంచి లోక్‌సభ సీటుకు పోటీ చేస్తే గనుక.. తనకు గత పార్లమెంట్ ఎన్నికల్లో దక్కిన ఆదరణ మళ్లీ దక్కుతుందో.. లేదోనన్న సందేహాలే ఇప్పుడు అరవింద్ ఫ్యూచర్ పాలిటిక్స్ కు చిక్కుగా మారాయి. అదే సమయంలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గంపైన కూడా అరవింద్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో క్యాడర్లో అస్పష్టత... అరవింద్ బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశించే ఆశావహుల్లో నిస్తేజానికీ ఈ డైలమా కారణమవుతోందన్నది ఇప్పుడు ఇందూరు రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. బరిలోకి అన్న సంజయ్ నిజామాబాద్ అర్బన్ నుంచి డీఎస్ తన పెద్దకుమారుడు సంజయ్‌ను బరిలోకి దించాలని యోచిస్తున్న క్రమంలో... అక్కడి నుంచి అన్నకు పోటీగా దిగే పరిస్థితి అరవింద్ కు ఉండదు. పైగా తనకు ప్రధాన అనుచరుడైన ధన్ పాల్ సూర్యనారాయణ అక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తున్నాడు. ఇక గతంలో ఎమ్మెల్యేగా చేసిన ఎండల లక్ష్మీనారాయణ నుంచి అంత సహకారం అందే పరిస్థితి లేదు. ఇక రూరల్ నియోజకవర్గంలో నిల్చోవడమంటే... ఎదురుగా ఉన్నది బాజిరెడ్డి గోవర్ధన్. తన తండ్రికి ఇందూర్ పాలిటిక్స్ లో ఎంత పట్టుందో... జిల్లాలోని బాన్సువాడ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ వంటి నియోజకవర్గాల నుంచి గెల్చిన చరిత్ర బాజిరెడ్డికుంది. ఈ క్రమంలో ఆయన్ను తట్టుకోవడమూ అంత వీజీ కాదు. ఇక బాల్కొండలో ఇప్పటికైతే మంత్రి ప్రశాంత్ రెడ్డి హవా స్పష్టంగా కనిపిస్తున్న క్రమంలో... అరవింద్ అక్కడి నుంచి బరిలో ఉంటాడా అన్నదీ మళ్లీ డౌటే. అయితే ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కూడా బీజేపి నుంచి బరిలో ఉండటానికి ఉత్సాహం చూపిస్తున్నా... అరవిందే అడ్డుపడుతున్నాడన్న ఒకింత ప్రచారమూ... ఆయన బాల్కొండపై కన్నేశాడా అనే అనుమానాలకు బలమిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలనాటికి.... అరవింద్ నియోజకవర్గ దారేది...? అన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. చదవండి: బీజేపీ ఎమ్మెల్యేకు ఝలక్ ఇచ్చిన గోమాత! -
రాజ్యసభ మాజీ ఎంపీ డీఎస్‌ను పరామర్శించిన వైఎస్ షర్మిల
-
డీఎస్‌ను పరామర్శించిన వైఎస్ షర్మిల.. ఇరువురి మధ్య ఆసక్తికర చర్చ
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ మాజీ ఎంపీ డి.శ్రీనివాస్‌ను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం పరామర్శించారు. డీఎస్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తి కరమైన చర్చ సాగింది. వైఎస్సార్‌తో ఉన్న పాత అనుభవాలను డీస్ గుర్తు చేశారు. వైఎస్సార్‌పై తెలంగాణ ప్రజల అభిమానం చెక్కు చెదరలేదన్నారు. షర్మిలను బలమైన మహిళగా డీఎస్ పేర్కొన్నారు. షర్మిల కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారన్నారు. వైఎస్ సీఎం అవుతారని 2003లోనే చెప్పానని డీఎస్ గుర్తు చేసుకున్నారు. చదవండి: కేసీఆర్‌తో కోల్డ్‌వార్.. గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు -
రాజకీయ జీవితంపై ధర్మపురి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
నిజామాబాద్ అర్బన్: తన రాజకీయ జీవితంపై రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఏ పార్టీలో ఉన్నానో నాకే తెలియదు. కేసీఆర్‌నే అడగండి’ అని డీఎస్ పేర్కొన్నారు. నిజామాబాద్‌లో శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. తన కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడం ఆయన ఇష్టమన్నారు. మరో కుమారుడు అర్వింద్ బీజేపీలో చేరి ఎంపీగా గెలిచాడన్నారు. -
రాజ్యసభకు డీఎస్, కెప్టెన్ ఏకగ్రీవం
ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలు అందజేసిన రిటర్నింగ్ అధికారి సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్), కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉప సంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. రెండు స్థానాలకు రెండే నామినేషన్లు దాఖలు కావడంతో వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా రిటర్నింగ్ అధికారి, శాసనసభ కార్యదర్శి రాజా సదారాం ప్రకటించారు. ఈ మేరకు డీఎస్, కెప్టెన్లకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ ఇద్దరితో రాజ్యసభలో టీఆర్ఎస్ బలం ముగ్గురు ఎంపీలకు చేరింది. ఇప్పటికే కె.కేశవరావు (కేకే) టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.