సాక్షి, హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్ పార్టీకి తిరిగి రాజీనామా చేశారు. తన పెద్ద కుమారుడు సంజయ్‌తో కలసి కాంగ్రెస్ కండువా కప్పుకొన్న మరుసటి రోజే రాజీనామా చేస్తున్నట్టు డీఎస్ ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపింది.
సంజయ్ చేరిక నేపథ్యంలో ఆశీస్సులు అందజేయడానికి గాంధీభవన్‌కు వెళ్లానని.. కానీ తనకు కండువా కప్పి పార్టీలో చేరినట్టు ప్రచారం చేశారని రాజీనామా లేఖలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
అయితే తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనని.. ఆరోగ్య పరిస్థితుల రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని డీఎస్ పేర్కొన్నారు.
ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు డీఎస్ రాసిన లేఖతోపాటు తన భర్తను రాజకీయాల్లోకి లాగవద్దని ఆయన భార్య విజయలక్ష్మి కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ రాసిన లేఖ, ఆమె మాట్లాడుతున్న వీడియో, రాజీనామా లేఖపై డీఎస్ సంతకం పెడుతున్న వీడియోలను మీడియాకు విడుదల చేయడం గమనార్హం.
డీఎస్ చిన్నకుమారుడు అరవింద్ బీజేపీ ఎంపీకాగా.. పెద్ద కుమారుడు సంజయ్ తాజాగా కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు, పంతాలే.. డీఎస్ చేరిక, రాజీనామా ఎపిసోడ్‌కు కారణమనే చర్చ జరుగుతోంది.
డీఎస్ రాసిన లేఖలో ఏముందంటే..
‘‘ఈ నెల 26న నా కుమారుడు సంజయ్ కాంగ్రెస్‌లో తిరిగి చేరిన సందర్భంగా ఆశీస్సులు అందజేయడానికి గాంధీభవన్‌కు వెళ్లాను. అప్పుడు నాకు కండువా కప్పి నేను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు మీడియాలో ప్రచారం చేశారు. నేను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే. కానీ ప్రస్తుత నా వయసు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండదల్చుకున్నాను.
పార్టీలో నా చేరికకూ, నా కుమారుడు సంజయ్ టికెట్‌కు ముడిపెట్టడం భావ్యం కాదు. కాంగ్రెస్ విధివిధానాలు, సంప్రదాయాలు, ప్రజామోదం మేరకే పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతుందన్న విషయం తెలియనిది కాదు. ఆరోగ్యరీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న నన్ను వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.
నేను మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరానని మీరు భావిస్తే.. ఈ లేఖను రాజీనామాగా భావించి ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను’’ అని డీఎస్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ప్రతిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కూడా పంపుతున్నట్టు తెలిపారు.
ఈ లేఖపై డీఎస్ సంతకం చేస్తున్న వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖపై సాక్షిగా డీఎస్ భార్య విజయలక్ష్మి చేసిన సంతకం ఉండటం గమనార్హం.
డీఎస్ భార్య పేరిట మరో లేఖ
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు డీఎస్ రాసిన లేఖతోపాటు ఆయన భార్య విజయలక్ష్మి పేరిట మరో లేఖను, ఆమె మాట్లాడిన వీడియో కూడా మీడియాకు విడుదలైంది. ‘ఇదిగో డీఎస్ రాజీనామా.. ఇది ఎవరికి సంబంధించితే వారికి..’ అంటూ విజయలక్ష్మి సంతకంతో ఈ లేఖను రాశారు. ‘‘ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.
ఆయనను మీరు పార్టీలో చేర్చుకునే పద్ధతి కూడా ఇదికాదు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వచ్చింది. దయచేసి మీ రాజకీయాలకు ఆయనను వాడుకోవద్దు. మీరు నిన్న చేసిన ఒత్తిడి వల్ల డీఎస్‌కు రాత్రి ఫిట్స్ కూడా వచ్చాయి. కాంగ్రెస్ వాళ్లకు చేతులు జోడించి దండం పెడుతున్నా.
ఇంకోసారి ఇటువైపు రాకండి. ఈ వయసులో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కొంచెం ప్రశాంతంగా బతకనీయండి..’’ అని ఆ లేఖలో విజయలక్ష్మి పేర్కొన్నారు.
సాయంత్రానికి హెల్త్ బులెటిన్
డీఎస్, ఆయన భార్య విజయలక్ష్మి పేరిట లేఖలు, వీడియోలతోపాటు సోమవారం సాయంత్రం డీఎస్‌కు వైద్యుల సలహాతో కూడిన లేఖ కూడా మీడియాకు అందింది. డీఎస్ పార్కిన్సన్స్ వ్యాధి, బీపీతో బాధపడుతున్నారని, ఆయన మెదడుకు సర్జరీ అయిందని.. ఇటీవలే గుండెపోటుకు కూడా గురయ్యారని పేర్కొంటూ కన్సల్టెంట్ న్యూరాలజిస్టు బి.చంద్రశేఖర్‌రెడ్డి పేరిట ఈ లేఖను విడుదల చేశారు.
డీఎస్ ఒత్తిడికి దూరంగా ఉండాలని, జన సమూహాలు, ప్రయాణాలు, రాజకీయాలు, మీడియాకు దూరంగా ఉండటం అవసరమని ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం.
కుమారుల రాజకీయ కలహాలతో..!
తాను కాంగ్రెస్‌లో చేరేందుకే గాంధీభవన్‌కు వచ్చానని, తాను చనిపోయాక మృతదేహంపై కాంగ్రెస్ జెండా కప్పాలని సోనియాగాంధీని కలిసినప్పుడు కోరానని ఆదివారం పేర్కొన్న డీఎస్ మరునాడే రాజీనామా చేయడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన ఇద్దరు కుమారుల మధ్య రాజకీయ వైరమే దీనికి కారణమని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. డీఎస్ చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు సంజయ్ ఆదివారమే కాంగ్రెస్‌లో చేరారు.
ఈ సందర్భంగా సంజయ్‌తోపాటు డీఎస్ కూడా గాంధీభవన్‌కు వెళ్లారు. అయితే సంజయ్ చేరిక సందర్భంగా డీఎస్ గాంధీభవన్‌కు వెళ్లాలా, వద్దా అన్న విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నట్టు డీఎస్ సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాలా కాలం నుంచీ విడిగా ఉంటున్న డీఎస్ కుమారులు ఇద్దరు చెరో పార్టీలో ఉన్నారు. ఆ ఇద్దరూ ఎవరికి వారు తమకు అనుకూలంగా తండ్రిని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తుండటమే ఈ రాద్ధాంతానికి కారణమని డీఎస్ కుటుంబ సన్నిహితులు చెప్తున్నారు.
వాస్తవానికి డీఎస్ కాంగ్రెస్‌లో చేరడం ఎప్పుడో ఖరారైందని.. ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరడానికి ముందు డీఎస్ ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలిసి వచ్చారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. డీఎస్ కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలతో ఇంతకాలం ఆగినట్టు వివరిస్తున్నాయి.
చివరికి పెద్ద కుమారుడు సంజయ్ రాజకీయ భవిష్యత్తు వైపు మొగ్గుచూపిన డీఎస్.. ఆదివారం గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. కానీ మరుసటి రోజే రాజీనామా చేశారు. కాగా.. డీఎస్‌కు ప్రాణహాని ఉందని, ఆయనకు రక్షణ కల్పించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ప్రభుత్వాన్ని కోరారు.
అరవింద్ బ్లాక్‌మెయిల్ కారణంగానే..: సంజయ్
డీఎస్ రాజీనామా విషయమై ఆయన పెద్ద కుమారుడు సంజయ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. తన సోదరుడు అరవింద్ దిగజారి వ్యవహరిస్తున్నాడని, బ్లాక్ మెయిల్ చేసి తన తండ్రితో లేఖలు రాయిస్తున్నారని ఆరోపించారు. అరవింద్ రౌడీలను, డబ్బును అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, తన తండ్రి ప్రాణాలకు హాని ఉందని ఆరోపించారు.
‘‘మా నాన్నకు ఫిట్స్ వస్తే ఇంట్లో ఎందుకు ఉంచారు? ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే నేను అరవింద్‌పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎవరి సత్తా ఏమిటో ఎన్నికల్లోనే తేలుతుంది..’’ అని సంజయ్ వ్యాఖ్యానించారు.
ఇద్దరు కుమారుల రాజకీయ పంతం.. రీజాయిన్.. రిజైన్!
Published Tue, Mar 28 2023 1:20 AM | Last Updated on Tue, Mar 28 2023 9:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment