
రామన్నపేట్ సంతోష్ కాలనీ వాసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
సాక్షి,మోర్తాడ్(బాల్కొండ): మాకు మద్యం, డబ్బు వద్దు మేము సూచించిన సమస్యలను పరిష్కరించడానికి తగు హమీ ఇచ్చే వారికే తమ ఓటు అంటు ప్రజలు ముందస్తు ఎన్నికల వేళ సమస్యలను అభ్యర్థుల ముందు ఉంచుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మెనిఫెస్టోలను రూపొందించి వాటిని ఓటర్ల ముందు ఉంచుతు ఆకర్షించడానికి ప్రయత్నించడం సాధారణ విషయం. అయితే ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రజలే తమ సమస్యలతో ఒక మెనిఫెస్టోను రూపొందించుకుని వాటికి సానుకూలంగా స్పందించిన వారికే ఓటు వేస్తామని స్పష్టం చేస్తుండటం గమనార్హం.
బాల్కొండ నియోజకవర్గంలోని వన్నెల్(బీ), రామన్నపేట్ సంతోష్ కాలనీ ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం లభించడానికి ముందస్తు ఎన్నికలను ఒక వేదికగా ఎంచుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్సిలను ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలు ముగిసి ఏడాదిలోగా సమస్యలు పరిష్కరించేవారికి ఓటు వేస్తామని ప్రజలు వెల్లడిస్తున్నారు. కాగా రాజకీయ నాయకుల హమీలపై నమ్మకంలేని ప్రజలు రాత పూర్వకంగా హమీని కోరుతుండటం విశేషం. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు, అభ్యర్థుల మెనిఫెస్టోలకు ధీటుగా ప్రజలే ప్రత్యేక మెనిఫెస్టోలను రూపొందించి అభ్యర్థుల ముందుంచుతుండటం వల్ల అభ్యర్థులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.