సాక్షి, నిజామాబాద్‌అర్బన్: ఎన్నికలకు మూడు రోజుల ముందు నుంచే ప్రలోభాల పర్వం జోరందుకుంది. ఓటర్లపై మందు, విందులతో పాటు డబ్బుల వర్షం కురుస్తోంది. నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుంది. అయితే, మంగళవారం నుంచే ప్రలోభాల పర్వానికి తెర లేపారు అభ్యర్థులు. విచ్చలవిడిగా డబ్బుల వర్షం కురిపిస్తున్నారు. అన్ని చోట్లా తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఎలాగైనా గట్టెక్కాలని అభ్యర్థులు ఓటర్లకు గాలం వేసే పనిలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజక వర్గాల్లో మంగళవారం నుంచి విందులు, డబ్బుల పంపిణీ ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో లెక్కకు మించి ఖర్చు చేస్తున్నారు. ఓటర్లపై డబ్బులు వెదజల్లుతున్నారు. ఏలాగైనా ఓటర్లను ఆకట్టుకోవాలని ప్రలోభాలకు తెర లేపారు. గ్రామీణ ప్రాంతాల్లో విందులు విపరీతంగా నడుస్తున్నాయి. ఇంటింటికీ మాంసం, మద్యం పంపిణీ కొనసాగుతోంది.
ఓటర్ల డిమాండ్‌ను బట్టి..
జిల్లాలోని ఐదు నియోజక వర్గాల్లో ప్రచారం తీవ్ర స్థాయికి చేరింది. నిన్నటివరకూ రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలు చేపట్టిన అభ్యర్థులు మంగళవారం గేర్ మార్చారు. పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో ఓవైపు ప్రచారం నిర్వహిస్తూనే, మరోవైపు ప్రలోభాల పర్వానికి తెర లేపారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వారు పెట్టే డిమాండ్లకు తలొగ్గుతున్నారు. ఖర్చులను లెక్క చేయకుండా అభ్యర్థులు రూ.కోట్ల డబ్బు కుమ్మరిస్తున్నారు. మంగళవారం నుంచి దాదాపు అన్ని గ్రామాల్లో విందులు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ ప్రాంతంలో ప్రతీ గ్రామానికి మేకలను పంపించి, విందులు ఏర్పాటు చేయించారు. మరో అభ్యర్థి విందు భోజనాలను గ్రామాలకు పంపుతున్నారు. రాత్రివేళ ఇంటింటికి చికెన్, మటన్‌ను పంపిస్తున్నారు. అలాగే, కుల సంఘాలను కలుస్తూ, వారికి కావల్సిన డిమాండ్లను అంగీకరిస్తూ కుల పెద్దలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిచేత పూర్తి స్థాయి ఓట్లు పడేలా తీర్మానాలు చేసేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒక్క ఆర్మూర్ నియోజకవర్గానికే పరిమితం కాలేదు, మిగతా అన్ని చోట్లా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.
డబ్బుల పంపిణీ..
కొన్ని ప్రాంతాల్లో డబ్బుల పంపిణీ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం రూ.200 నుంచి రూ.300 ముట్టజెబుతున్నారు. పోలింగ్ రోజున రూ.వెయ్యి ఇస్తామని, తమకే ఓటు వేయాలని ప్రలోభపెడుతున్నారు. మహిళా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయించి, ఓట్లు తమకే వేయాలని గాలం వేస్తున్నారు. మహిళా సంఘాలకు ఉన్న బకాయిలను తీరుస్తామంటూ, బకాయిలో సగం డబ్బులను నేరుగా చేతికి అందించి, మద్దతిస్తున్నట్లు తీర్మాన పత్రాలు రాయించుకుంటున్నారు. ఇంటింటికి మాంసంతో పాటు మహిళలకు శీతల పానీయాలను పంపిణీ చేస్తున్నారు. మగవారికి ప్రతిరోజు మద్యం పంపిణీ కొనసాగుతోంది.
మందు, మాంసం..
మంగళవారం రోజే పెద్ద మొత్తంలో మందు, మాంసం పంపిణీ కొనసాగింది. ఇక, బుధ, గురువారాల్లో ఇది రెట్టింపు కానుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో అక్రమంగా మద్యాన్ని నిల్వ చేసిన అభ్యర్థులు ఓటర్లకు చేర వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోవైపు, ఎన్నికల వేళ మాంసానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. చికెన్ సెంటర్లలో పార్టీ నాయకుల రద్దీ ఎక్కువైంది. మరోవైపు, ఓటర్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అభ్యర్థులు సమకూరుస్తున్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు వాహనాలను సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment